Wednesday, January 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురావాల్సింది రూ.22,782 కోట్లు ఇచ్చింది రూ.3,805 కోట్లే

రావాల్సింది రూ.22,782 కోట్లు ఇచ్చింది రూ.3,805 కోట్లే

- Advertisement -

– పన్నువాటాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష : కాగ్‌ నివేదిక
– ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇక మూడు నెలలే గడువు
– పతాక స్థాయికి మోడీ సర్కార్‌ ఆర్థిక వేధింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో వసూలు చేస్తున్న వివిధ రకాల పన్నుల వాటాలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన స్థాయిలో ఇవ్వకుండా వివక్ష చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రాంటు కింద రూ.22,782.50 కోట్లు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ వరకు కేవలం రూ.3,805.59 (16.70 శాతం) కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వం ఎంత వివక్షను చూపుతున్నదో అర్థమవుతున్నది. గతేడాది ఏప్రిల్‌లో రూ.68.85 కోట్లు, మేలో రూ.17.87 కోట్లు, జూన్‌లో రూ.347.04 కోట్లు, జులైలో రూ.356.70 కోట్లు, ఆగస్టులో 882.96 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.323.34 కోట్లు, అక్టోబర్‌లో రూ.948.70 కోట్లు, నవంబర్‌లో రూ.526.54 కోట్లు, డిసెంబర్‌లో 333.59 కోట్ల చొప్పున విడుదల చేసింది. డిసెంబర్‌ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలే గడువున్నది. పన్ను వాటాలకు సంబంధించి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇంకా రూ.18,977 (83.3 శాతం) కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. మూడు నెలల్లో అన్ని నిధులు విడుదలవుతాయా?అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాలో కేవలం 22.05 శాతం నిధులనే విడుదల చేసింది. మంగళవారం వెల్లడైన ‘కాగ్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

నెలకు రూ.1,898.5 కోట్లు విడుదల చేయాలి
కేంద్ర ప్రభుత్వం రూ.22,782 కోట్లు పన్నుల ఆదాయాన్ని తెలంగాణకు ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే నెలకు రూ.1,8 98.5 కోట్లు విడుదల చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి డిసెంబర్‌ వరకు ఏ ఒక్క నెలలోనూ ఆ స్థాయి నిధులను విడుదల చేయకపోవడం గమనార్హం. ఏ నెలలోనూ కనీసం వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది. ప్రతిపక్ష రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందనడానికి తెలంగాణకు రావాల్సిన పన్ను వాటాలను సక్రమంగా ఇవ్వక పోవడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే మిగిలిన నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని ఆర్థికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

వీరూ అదే దారి…
బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అధోగతి పాలు చేసిందంటూ కాంగ్రెస్‌ విమర్శిస్తున్నది. కానీ బీఆర్‌ఎస్‌ దారిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తున్నది. లక్ష్యానికి మించి అప్పులు చేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009.74 కోట్ల అప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ డిసెంబర్‌ వరకే రూ.65,930.31 (122.07 శాతం) అప్పు చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇచ్చిన హామీల అమలు కోసం ఇంకా అప్పు ఎంతకు పెరుగుతుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడులు రూ.2,84,837.30 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. డిసెంబర్‌ వరకు రూ.1,90,876.51 (67.01 శాతం) రాబడులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలే గడువున్నది. రూ.93,960.79 (32.99 శాతం) రాబడులు వస్తాయా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -