– బాలికల హాస్టల్‌లో అసభ్యకర ప్రవర్తన
– పోలీసులకు ఫిర్యాదు
– హాస్టల్‌ను సందర్శించిన బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్
నవతెలంగాణ-నారాయణఖేడ్ రూరల్
నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ కొడుకు అరాచకాలు పెరుగుతుండగా.. అతనికి సిబ్బంది వంత పాడుతున్నారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు విద్యార్థినులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్ మంగళవారం హాస్టల్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. బాలికలు తెలిపిన, ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హాస్టల్‌లో 50 మంది బాలికలు ఉన్నారు. వార్డెన్ కుమారుడు రాజేష్ మున్సిపల్ పట్టణంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ‘వార్డెన్ ఎప్పుడూ రారు.. ఎవరైనా అధికారులు వస్తేనే వస్తారు.. హాస్టల్‌కు వార్డెన్ కుమారుడే వస్తూ ఉంటాడు.. రోజూ రాత్రి 10 గంటల వరకు హాస్టల్‌లోనే ఉంటాడు..’ అని విద్యార్థినులు తెలిపారు. ఆ సమయంలో తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బందికి చెప్పినా ఆయనకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడ చేయి వేస్తే మీకేంది.. అన్నలా భావించాలని చెబుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తాము ఇంటికి వెళ్లి వచ్చిన సమయంలో కొంచెం ఆలస్యమైనా వార్డెన్ కొడుకు అనరాని మాటలు అంటున్నారని చెప్పారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం :బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్
నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్, ఎస్‌ఐ పివి.చరణ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన, అలాంటి వారిని ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ అన్నారు. వార్డెన్ శారద, ఆమె కుమారుడు రాజేష్ చౌహాన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హాస్టల్ సిబ్బందిని తొలగించినట్టు చెప్పారు. హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్‌కు నివేదిక అందిస్తామన్నారు.
వార్డెన్ కుమారుడి అరాచకం
- Advertisement -
- Advertisement -