Wednesday, October 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'భరోసా'కు ఎసరు

‘భరోసా’కు ఎసరు

- Advertisement -

మన వేలితో మన కంటినే పొడవడంలో కేంద్ర ప్రభుత్వానిది అందెవేసిన చేయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా శ్రమించి, శక్తినంతా ధారపోసి, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వారికి భరోసా ఇచ్చే పెన్షన్‌కు ఎసరు తీసుకొస్తోంది ప్రభుత్వం. కార్మికులు, ఉద్యోగుల ఈపీఎఫ్‌ విత్‌డ్రా వందశాతం చేసుకోవచ్చనే ఒక వెసులుబాటును కల్పిస్తున్నామని చెప్పి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. సరిగ్గా ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్‌) విషయంలో దీన్నే ఫాలో అవుతున్నది. దీనికోసం నిబంధనలు కూడా సడలించింది. కార్మికులను, ప్రయివేటు ఉద్యోగులను ఇదేదో ఉద్దరించబోతున్నట్టుగా ప్రకటించు కుంటున్నది. కానీ ఈపీఎఫ్‌ అకౌంట్లో అసలు డబ్బే లేకుండా ఖాళీ చేస్తే రిటైర్మెంట్‌ తర్వాత వారికి పెన్షన్‌ ఎక్కడి నుండి వస్తుంది? అంటే పెన్షన్‌ ఇచ్చే బాధ్యతల నుండి తప్పుకోవడమే ఈ నిర్ణయం వెనుకున్న అసలు కుట్ర. ఇలా మనకు తెలియకుండానే మన గొంతుకోసే పనిలో ఉన్నది కేంద్రం.

ఈపీఎఫ్‌ అనేది ఏ ఉద్యోగికైనా, కార్మికుడికైనా ఓ భరోసా. వయసు ఉడిగిన తర్వాత సదరు వ్యక్తికి ఇచ్చే ఆర్థిక చేయూత. ఈపీఎఫ్‌ ఆధారంగానే రిటైర్మెంట్‌ తర్వాత వారికి పెన్షన్‌ వస్తుంది. శరీరం సహకరించని చివరి దశలో ఆత్మ గౌరవంగా బతికేందుకు కొద్దో గొప్పో ఇదే వారికి ఆధారం. ఇందులో ఉండే ఉద్యోగులు, కార్మికుల సొమ్ముకు ఆ సంస్థ 8.25శాతం వడ్డీని చెల్లిస్తోంది. గతంలో అయితే ఉద్యోగి జమచేసిన సొమ్ములో నుంచి మాత్రమే కొంత విత్‌డ్రాకు అవకాశం ఉండేది. తర్వాత కాలంలో నిబంధనల్లో అనేక సడలింపులు మొదలుపెట్టింది. కోవిడ్‌ సమయంలో అయితే పీఎఫ్‌ సొమ్ము అనేకమంది అవసరాలను తీర్చింది. ఇక అప్పటి నుంచే మోడీ సర్కారు ఈ స్కీంను మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఉద్యోగి జమచేసిన సొమ్ముతో పాటు యజమాని వాటాను కూడా ఎలాంటి షరతులు లేకుండా విత్‌డ్రా చేసుకొనేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మికశాఖ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్‌వో ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌’ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది.

తమ నిర్ణయంతో ఏడు కోట్ల మందికి ప్రయోజనం చేకూరబోతోందని చెప్పుకుంటున్నది. కానీ ఇక్కడ తెలుసుకో వలసిన నిజం ఏమిటంటే ఈ ఏడులక్షల మంది రిటైర్మెంట్‌ ప్రయోజనాలను కోల్పోతున్నారు. అదెలా అంటే ప్రస్తుతం అకౌంట్లో కనీసం 25శాతం ఉంచాలనే నిబంధన ఉంది. ఈ సొమ్ముకు ఈపీఎఫ్‌వో 8.25 శాతం వడ్డీతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను అందిస్తుంది. తాజా సవరణలతో వీటిని ఉద్యోగులు, కార్మికులు కోల్పోతారు. ఇప్పటికే వేతనాల్లో పెట్టిన సీలింగ్‌ సిస్టమ్‌ వల్ల కార్మికులు, ఉద్యోగులు ఈపీఎఫ్‌ను తద్వారా పెన్షన్‌ను చాలా వరకు కోల్పోతున్నారు. ఇదే విషయంపై 2014లో కేరళ కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మానవీయకోణంలో స్పందించి సీలింగ్‌ సిస్టమ్‌ సరైనది కాదని తీర్పునిచ్చింది. ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సింగిల్‌ బెంచ్‌ కూడా ఇదే తీర్పు ప్రకటించింది. తిరిగి ఫుల్‌ బెంచ్‌కు వెళ్తే అక్కడ కూడా ఇదే చెప్పింది.

కానీ ఈ తీర్పును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలా ఇప్పటికే కార్మికులు, ఉద్యోగులు అనేక రకాలుగా శ్రమదోపిడీకి గురవుతున్నారు. తమకు అందాల్సిన ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఇక ఈ తాజా నిర్ణయంతో మరింత నష్టపోతారు. ఇక 2014లో బీజేపీ నాయకులైతే తాము అధికారంలోకి వస్తే కార్మికులకు, ఉద్యోగులకు రూ.3వేల పెన్షన్‌, డీఏ ఇస్తామంటూ తెగ ప్రచారం చేసుకున్నారు. దీని కోసం అప్పట్లో ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి మరీ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకుడు జవదేకర్‌ అయితే ప్రతి సంస్థకు తిరిగి మరీ ఇవే విషయాలను ఊదరగొట్టారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదిస్తామని కూడా చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నీ మోడీ సర్కారు తుంగలో తొక్కేసింది. కార్పొరేట్లకు మేలుచేసే ఆర్టికల్‌ 370 రద్దు వంటి బిల్లులను ఏకపక్షంగా అమోదించుకున్న బీజేపీ.కార్మికులకు, ఉద్యోగులకు ఉపయోగపడే బిల్లు విషయంలో మాత్రం పార్లమెంటులో చేతులెత్తేసింది. అంటే శ్రమజీవుల పట్ల వీరికున్న చిత్తశుద్ది ఏపాటితో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కార్మికులు, ఉద్యోగుల ఆర్థిక చేయూతను నిర్వీర్యం చేయజూస్తున్న కేంద్ర సర్కారు విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలి. తద్వారా శ్రమజీవుల భవితకు ఎంతోకొంత భరోసాగా ఉన్న ఈపీఎఫ్‌ను కాపాడుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -