పోలీసులు కార్మికుల కోసం గాలింపు చర్యలను నిలిపివేయాలి..
చనిపోయిన కార్మికుడికి 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి..
కంపెనీ వద్దకు ఎలాంటి సంఘాలు రావద్దంటూ మూడు రోజులపాటు ఆంక్షలు విధించడం అప్రజాస్వామీకం..
ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్ భద్రయ్య
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాకు చెందిన వినోద్ అనే కార్మికుడు కంపెనీలో నిరంతరాయంగా వెదజల్లిన వాయు కాలుష్యం మూలంగానే శ్వాస తీసుకోలేని పరిస్థితికి నట్టబడి అస్వస్థకు గురై మృతి చెందాడని అతని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్ భద్రయ్య అన్నారు. సోమవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్వి నందాలాల్ పవర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకీడు మండలం జాన్ పహాడ్ కు దగ్గరలో ఉన్న డెక్కెన్ సిమెంట్ కార్మికుడు చనిపోవడంతో తోటి కార్మికులు చనిపోయిన కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగినందుకు యాజమాన్యం, పోలీసులు ఆందోళనను చెదరగొట్టడం సందర్భంగా అతిగా వ్యవహరించడం వల్లనే పోలీస్ లకు కార్మికుల మధ్య జరిగిన ఘటనే తప్ప అది ఉద్దేశ్య పూర్వకంగా జరిగింది కాదనిఅన్నారు.రాష్ట్రప్రభుత్వం,యాజమాన్యమే ఈ ఘటనకు, కార్మికుని మృతికి పూర్తి బాధ్యత వహించాలని అరెస్ట్ చేసిన కార్మికులను తక్షణమే విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని,వలస కార్మికుల కోసం పోలీసులు గాలింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.కార్మికుని మృతి పై విచారణ చేయడానికి వెళ్ళిన కార్మిక నాయకులను మూడు రోజులుగా ఫ్యాక్టరీ ఆవరణలోకి రావడానికి వీల్లేదని పోలీస్ లు ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సిమెంట్ ఫ్యాక్టరీ లో చట్టపరమైన రక్షణ, భద్రతా ప్రమాణాలు, ఏ లాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యలు ఏవీ లేకుండా కార్మికులను అతి తక్కువ వేతనాలతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు.ఫాక్టరిలో పనిచేస్తున్న కార్మికుడు చనిపోతే వీక్లి ఆఫ్ లో ఉన్నాడని దబాయిస్తు పోలీస్ వాళ్ళను రక్షణ పెట్టుకొని కార్మికులకు అన్యాయం చేయాచూస్తుందని,సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యను అన్ని రంగాల కార్మికులు ఖండించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య, నాయకులు నల్లెడ మాధవరెడ్డి, గుంజలూరి కోటయ్య, అబ్దుల్ కరీం, యోగానంద చారి, షేక్ ఉమర్, చిలువేరు నరసింహారావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.