Sunday, February 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచిన్నారిని చిదిమేసిన పెత్తందారీ అహంకారం

చిన్నారిని చిదిమేసిన పెత్తందారీ అహంకారం

- Advertisement -

కాళ్లతో తొక్కి విసిరేసిన ఆలయ నిర్వాహకులు
నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర జాతరలో ఘటన
పోలీసుల ప్రేక్షక పాత్ర
ఆలస్యంగా కేసు నమోదు
ఆస్పత్రిలో బాధితుల ఆందోళన

నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ప్రజాసంఘాలు

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
దళితురాలు జాతరలో దైవదర్శనం కోసం వెళితే కులంపేరుతో దూషించారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బెదిరించి, దాడిచేసి కొట్టారు. అన్యాయంగా ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే మహిళ అని కూడా చూడకుండా చితక బాదారు. అడ్డుబోయిన ఆమె తమ్ముడినీ గొడ్డును బాదినట్టు బాదారు. దెబ్బలు తాళలేక ‘దొరా…కనరించి వదిలేరు’ అని వేడుకుంటూ తన రెండునెలల చిన్నారిని వారి కాళ్ల మీద వేసి వేడుకుంటే, ఆ పసికందును కాళ్ళతోనే తొక్కి అవతలకు విసిరేశారు. దీనితో ఊపిరి ఆడని ఆ బిడ్డ మరణించింది. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. దాడిచేసినవారే పోలీసులకు ఫిర్యాదు చేస్తే, దాన్ని నమోదు చేశారు. దళితుల పట్ల పెత్తందారుల ఆగడాలకు ఈ ఘటన పరాకాష్ట! నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో ఆలయ నిర్వాహకులు, పెత్తందారులు మూడ్రోజుల క్రితం మల్లన్నజాతర నిర్వహించారు.

దీనికి అదే జిల్లాలోని తాడూరు మండలం కుమ్మెర గ్రామానికి చెందిన కీర్తి తన రెండేండ్ల బిడ్డను తీసుకొని తల్లి చంద్రకళతో కలిసి జాతరలో దైవ దర్శనానికి వెళ్లింది. గుడిపైకి ఎక్కే సమయంలో అదే గ్రామానికి చెందిన పెత్తందారి శ్రీనివాస్‌రెడ్డి రూ.100 ఇస్తేనే పైకి పోవాలని అడ్డు చెప్పాడు. ఆలయ నిర్వాహకుల్ని కాదని మీకు డబ్బులు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. డబ్బులిస్తే రసీదు ఇవ్వాలని అడిగారు. దీనితో పెత్తందారు శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహంతో బూతులు తిట్టాడు. మాదిగ దానివై ఉండి చాకలోడ్ని పెండ్లి చేసుకున్న మీరు మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ మరికొందరితో కలిసి దాడికి దిగారు. ఎదపై, వీపుపై పిడి గుద్దులు గుద్దారు. చెల్లిని, తల్లిని కొడుతుంటే తమ్ముడు గణేశ్‌ అడ్డుపడ్డాడు. దాంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు యువకులు గణేశ్‌ను రూములోకి తీసుకెళ్లి చితక బాదారు. కొట్టొద్దంటూ బాధితులు పెత్తందారుల కాళ్లపై పడి దండం పెట్టారు. కీర్తి తన రెండునెలల బిడ్డను పెత్తందారు శ్రీనివాసరెడ్డి కాళ్లపై వేసి కొట్టొద్దని ప్రాధేయపడింది.

ఆవేశంతో ఊగిపోయిన పెత్తందారులు బిడ్డను కాళ్లతో తన్ని విసిరేశారు. దీనితో ఆ బిడ్డ కొనఊపిరితో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం మరణించింది. ఇంత జరుగుతున్నా పోలీసులు బాధితుల పక్షాన కేసు నమోదు చేయకపోగా, తిరిగి తమపైనే కేసులు పెట్టారని బాధితురాలు కీర్తి తెలిపింది. దళిత సామాజిక తరగతికి చెందిన కీర్తి రెండేండ్ల క్రితం బీసీ సామాజిక తరగతికి చెందిన యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రేమించి పెండ్లి చేసుకున్న వీరు కొంత కాలం బాగానే అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నారు. ఇంతలోనే ఈ ఘటన జరగడం కూతురిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కీర్తి తమ్ముడు గణేశ్‌ను మూడు గంటలు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తుంటే, జాతరకు వచ్చిన భక్తులు కనీసం వారిని అడ్డుకొనే ప్రయత్న కూడా చేయకపోవడం గమనార్హం.

గుడిపై పెత్తనం వారిదే..
15 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షల్లోనే భక్తులు వస్తారు. ఇక్కడ దేనికీ చట్టబద్ధమైన నిర్ణయాలు ఉండవు. టెంకాయలు, ఊదిబత్తిలు, దర్శనం పేరుతో భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. పెత్తందారుల ఆధ్వర్యంలోనే గుడి నిర్వహణ ఉంది. జాతర కూడా వారే నిర్వహిస్తారు. కొండపై ఉండే ఈ గుడిని భక్తులు పెద్దసంఖ్యలోనే సందర్శిస్తుంటారు. అక్రమంగా డబ్బు వసూళ్లు ఇక్కడ సర్వసాధారణం. దేవాదాయశాఖ పరిధిలోకి ఈ గుడి వెళ్లకుండా పెత్తందారులు అడ్డుపడుతుంటారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు.

చనిపోయిన చిన్నారికి పోస్టుమార్టం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం చేశారు. బాధిత కుటుంబాన్ని గ్రామ పెద్దలతో కలిసి వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పరామర్శించారు. చిన్నారి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులు ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలు పెట్టిన కేసు చూడకుండా, దాడి చేసిన వారు పెట్టిన కేసునే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఆందోళనల అనంతరం పోలీసులు శనివారం సాయంత్రం కేసు నమోదు చేశారు.

న్యాయం చేస్తాం : గోవర్థన్‌రెడ్డి, ఎస్‌ఐ, నాగర్‌కర్నూల్‌
పసిబిడ్డ చనిపోయిన విషయం బాధాకరం. కేసు పూర్వాపరాలు పరిశీలించి బాధితురాలికి న్యాయం చేస్తాం. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నాం. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నాం. ఇందులో ఎవరు ఎటువంటి అపోహలకు తావివ్వొద్దు.

దోషుల్ని శిక్షించాలి : కీర్తి, బాధితురాలు
నా కూతురు మరణానికి కారకులైన దోషుల్ని పోలీసులు అరెస్టు చేయాలి. మాకు న్యాయం చేయాలి. నా తల్లిని, తమ్ముడిని దారుణంగా కొట్టారు. నిందితుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలి.

దుర్మార్గం : పరశురాములు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్‌
కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన కీర్తి కూతురు మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి. కుటుంబానికి రక్షణ కల్పించాలి. బాధితులకు చట్టపరమైన సహాయక చర్యలు కల్పించాలి. ముఖ్యంగా కేసు విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరి సరికాదు. పోలీసుల నుంచి రక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటివి జరుగుతున్నాయి. మున్ముందు ఇటువంటివి జరిగితే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

దళితులపై దాడులు అరికట్టకపోతే ఉద్యమిస్తాం : విశారదన్‌, ఎస్సీ,ఎస్టీ, బీసీ జేఏసీ కన్వీనర్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీల సహనానికి పరీక్ష పెడుతున్నారు. పోలీసుల వైఫల్యమే కీర్తి కూతురు మరణానికి కారణం. ఇప్పటికైనా పెత్తందారికి చెందిన వారు దాడులు ఆపకపోతే సహించేది లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -