Sunday, April 12, 2026
E-PAPER
Homeసోపతిఆధునికతను ముందడుగు వేయించిన ముద్రణ కళ

ఆధునికతను ముందడుగు వేయించిన ముద్రణ కళ

- Advertisement -

15వ శతాబ్దంలో ప్రపంచం, సాంకేతిక పరంగా ఒక వింత చూసింది. జర్మనీకి చెందిన జొహాన్నెస్‌ గుటెన్‌బర్గ్‌ 1440లో ఒక ముద్రణ యంత్రాన్ని తయారు చేశాడు. అది మేకు సాయంతో తిరుగుతూ వేసిన చిత్రమైనా రాసిన అక్షరాల కాగితమైనా అచ్చు తీస్తుంది. ఆనాటి వరకూ చేతిరాతతోనే ప్రతులు తీసి కళాకారులు చిత్రించి, అవి గ్రంథాలుగా తీసేవారు. అందువలన ఒక్కో గ్రంథానికి ఎంతో సమయం పట్టేది. 15వ శతాబ్దంలో ఈ ముద్రణ కళ వచ్చిన తర్వాత వేసిన చిత్రానికి రాసిన పుటలకు ముద్రణ యంత్రం ద్వారా ఎన్నో ప్రతులు తీయవచ్చు. అద్దంలోని ప్రతిబింబంలా తిరగతిప్పి, చెక్క పలక, రాగి పలకపై రాసి చిత్రించి, ఆ పలకపై ఇంక్‌ రాసి కాగితంపై సరిబొమ్మ అచ్చులు తీసేవారు. అందువలన గ్రంథాలు ఎన్నో తక్కువ సమయంలోనే వెలువడ మొదలెట్టాయి. ఈ ముద్రణ యంత్రంతో ఎన్నో గ్రంథాలు అచ్చువేయగల పద్ధతి యూరోప్‌ అంతా పాకింది. ఎన్నో వేల పుస్తకాలు అచ్చువేయబడ్డాయి.

ఇలా అచ్చువేసిన బైబిల్‌ పుస్తకాలు, ముద్రణ యంత్రం చేతపుచ్చుకుని పోర్చుగీసు క్రైస్తవ మిషనరీ వారు 1556లో గోవా చేరారు. ఆ తరువాత వారు అక్బరు ఆస్థానం కూడా చేరారు. 1561 – 1591 మధ్య చిత్రాలతో కూడిన 9 పుస్తకాలు అచ్చువేశారు. అందులో కనిపిస్తున్న యూరోపియన్‌ చిత్ర పద్ధతి అక్బరు ఆస్థాన చిత్రకారులను ఆకర్షించి, కొన్ని మార్పులు చేర్పులతో ఆ యూరోప్‌ చిత్ర పద్ధతిని తమ చిత్రాలలో అలవరచుకున్నారు. అప్పటి వరకు చేతిరాత, లేదా చిత్రించిన గ్రంథం మాత్రమే తెలిసిన మనదేశం ఆనాడు ముద్రణ పద్ధతి చూసింది. ఆపై కొంత విరామం తరువాత 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఈ కళ భారతదేశం చేరింది. ఈ ముద్రణ కళ ఈసారి చురుకుగా ఎన్నో మార్పులు అందిపుచ్చుకుంది. ఈ ముద్రణ కళ వలనే రవివర్మ తన చిత్రాలను ముద్రవేసి సగటు సమాజం అందుకోగలిగేట్టు చేయగలిగాడు.

ఈ ముద్రణ కళ మనదేశంలో మరిన్ని ఉపయోగకర మార్పులకు వేదిక అయింది. బ్రిటిష్‌ వారు విద్యారంగాల ద్వారా తాము అచ్చువేసిన పుస్తకాలు, బ్రిటిష్‌ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మన దేశంలో ఆధునికత నేర్పించదలచుకున్నారు. భారతీయులు ఆధునికతకు అర్థం మరోలా, వారికి సరిపడే సిద్ధాంతాలుగా మలచుకున్నారు. అందుకు తోడ్పడిన కళ ఈ ముద్రణ కళ. ముద్రణ కళ వలన ప్రచార మాధ్యమం, దేశ సమాచారం తెలిపే వార్తా పత్రికలు అందుకు దోహదం చేశాయి. నిజానికి ముద్రణ కళను బ్రిటిష్‌ వారు వారి అధికార వినియోగాల కోసం ఉపయోగించదలిచితే, భారతీయులు తమ ఆలోచనా విధానాలు సహ భారతీయులతో పంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. భారతీయుల ఆధునికత వారి సమాజ అవసరాల పరంగా సిద్హాంతాలను దిద్దుకుంది. అధునికత భారతీయ మెట్లు ఎక్కడానికి, బ్రిటీష్‌వారి ఆధిక్యత నుండి దూరంగా వుండి ముందడుగు వేయడానికి ఈ ముద్రణ కళే సహాయం చేసింది. భారతీయ ఆధునికతను భారతీయ కోణంలో ముందడుగు వేయించింది.

దేశమంతా ప్రతి భాషలోనూ ప్రాంతీయంగా పుస్తకాలు, ఆపై పత్రికలు అచ్చువేయబడి, వార్తలు, విశేషాలు సమాజంలో ఎన్నో గడపలు చేరాయి. తెలుగులోనూ అచ్చువేయబడ్డాయి. 1807లో బ్రౌన్‌ అనే ఇంగ్లీష్‌ వ్యక్తి తెలుగు నేర్చుకుని, ఇంగ్లీషు పదాలకు తెలుగు అర్థంతో నిఘంటువు అచ్చువేశాడు. వేమన శతకాలనూ అనువదించాడు. తెలుగు ముద్రణాలయాలు మద్రాసులో చాలా వెలిశాయి. తెలంగాణలో వనపర్తిలోనూ, రాయలసీమలో, గద్వాలలోనూ 1860, 70లలో తెలుగువారే తెలుగు ప్రచురణలు మొదలెట్టారు. అంతకు ముందు విద్య కొందరికే లభ్యమైంది. చిత్రాలతో కూడిన వ్యాసాలు, పుస్తకాలు అందుబాటులోకి రావడం వల్ల ఉత్సుకత పెరిగి మాతృభాషలో చదివే వారి సంఖ్య పెరిగింది. అందులో స్త్రీలూ వున్నారు. ఇలా మాతృభాష చదవగలిగి, సమాజంలో సాక్ష్యరాస్యత పెరిగింది. అందు అచ్చయిన చిత్రాలు ముందు చదవలేనివారికి కూడా ఉత్సాహమూ, ఊహా పెంచి చదవాలనే ఆశ పెంచింది.

1935లో, మారేపల్లి రామచంద్రశాస్త్రి గారి ‘తెనుగు తోబుట్టువులు’ కార్ట్‌వెల్‌ రాసిన ద్రవిడ భాషల వ్యాకరణ గ్రంథం వలన తెలుగువారి పఠనాపాఠవం, చదవాలనే ఆరాటం పెరిగాయనే అర్థం అవుతుంది. ఈ ప్రచురణ కళ, ప్రసార మాధ్యమాన్ని సమాజ సంస్కర్తలు చక్కగా ఉపయోగించుకుని, స్వదేశ భారత పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని ఈ మాధ్యమం ద్వారా ప్రచారం చేశారు.
1892లో రాజా రామ్మోహన్‌ రారు, ఆపై తెలుగువారైన కందుకూరి వీరేశలింగం (1848 – 1919), టంగుటూరి ప్రకాశం (1872 -1957) వంటి సంఘ సంస్కర్తలు ఈ ప్రసార మాధ్యమాన్నే ఆధారం చేసుకుని తమ ఆలోచనలు, వాదనలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. సతీసహగమనం ఆపబడింది. కందుకూరి తెలుగు సమాజం కోసం, అలాగే బాల్య వివాహాలను ఆపాలని, వరకట్న సమస్యని పారదోలాలనీ పోరాడాడు .ఈయన నవల ‘రాజశేఖర చరిత్రము’ తెలుగు సాహిత్యంలో మొదటి నవలగా లెక్కించబడింది.

ఆధునికత అనే సిద్ధాంతానికి అర్థం, వ్యక్తి స్వాతంత్య్రం, సమాజ వృద్ధి, స్త్రీ పురుష సమానత్వం, అందరికీ విద్య, బానిసత్వం వంటి విషయాలను రూపుమాపి వ్యక్తి గౌరవం పెంచటం. అది మన సమాజ కోణంలో పరికించి చూసి ఈ సంఘ సంస్కర్తలు ఇక్కడ మూఢ నమ్మకాలను రూపుమాపారు. అలాగే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించటం అంటే అదీ బానిసత్వమేకదా! భారతీయ ఆధనికతకు అర్థం వివరించాలంటే అదే కదా అర్థం. స్వదేశీ ఉద్యమం మొదలుపెట్టి, స్వయం పాలన కోసం ఆందోళన మొదలుపెట్టారు. ఈ ఆలోచనలు, ఆధునిక సిద్ధాంతాల భారతీయ కోణం, ప్రజల వరకూ సమాజ సంస్కర్తల ఆలోచలు తీసుకువెళ్లింది ముద్రణ కళనే. ఆధునిక పరికరాలైన టెలిగ్రాఫు, తపాలా, రైలు మార్గాల వలన ప్రచురించిన వారి ఉపన్యాసాలను పత్రికలు అతి తర్వగా ఒక చోటు నుంచి మరో చోటుకు చేర్చి దేశీయుల భావాలను ఒకటిగా చేశాయి.

19వ శతాబ్దంలో బళ్లారి నుండి ‘శ్రీ యక్షి’ అనే తెలుగు వారపత్రిక ప్రచురించబడంది. కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను ముందు వార పత్రికగా ప్రచురించినా ఆపై దిన పత్రికగా అచ్చువేశారు. ఆంధ్రపత్రిక – ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ధ షష్టి శుక్రవారం దినపత్రికలో శ్రీమతి అనిబీసెంట్‌ హిందూదేశ పౌరహక్కుల సమానత్వం గురించి లండన్‌లో మాట్లాడిన ఉపన్యాసం గురించి ప్రచురించ బడింది. అందులో అనిబీసెంట్‌ మాట్లాడుతున్నట్టు వ్యాసంతో పాటు అచ్చువేసిన చిత్రం, అది చెక్కపై చిత్రం వేసి ముద్రించిన చిత్రమూ అని తెలుస్తుంది. ఆ చిత్రం పాశ్చాత్య దేశాల కళలలో క్రైస్తవ చిత్రాలు ముందు దశలో ఉన్న చిత్రాలకు మల్లే రూపు రేఖలు అనిపిస్తాయి. అలా ఎన్నో చిత్రాలు ముద్రణ కళలతో అచ్చువేసినవి, సమాచారాన్ని ఆసక్తికరంగా పాఠకుల ముందు పెట్టి, ప్రపంచ విషయాలూ అందించాయి.

హిందూ సుందరి, హిందూ జన సంస్కారిణి, వివేకవతి వంటి పత్రికలు ఎన్నో వెలుబడ్డాయి. ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో బ్రిటిష్‌వారి సైన్యంలో పని చేస్తున్న భారతీయ సైనికుల కోసం ఉన్ని టోపీలు చలి ఆపుకోవడం కోసం స్త్రీలను అల్లమని సందేశం ఇచ్చిన వ్యాసాలూ వివేకవతిలో వున్నాయి. స్త్రీ విద్య ప్రచారం కోసం కూడా తెలుగు పత్రికలు ప్రచారం చేశాయి. ఉత్తీర్ణులైన స్త్రీలు, విజయం సాధించిన స్త్రీల చిత్రాలు అచ్చువేయ మొదలెట్టాయి. స్త్రీలు చేసిన సంఘసేవ, సామాజిక విప్లవం కోసం వారు రాసిన వ్యాసాలు అచ్చువేశాయి పత్రికలు. మన సాహిత్య రచనా సరళి మార్చిన రచయితలు వున్నారు. కట్టమంచి రామలింగారెడ్డి 1900లో ముసలమ్మ మరణం అనే పుస్తకం భావ కవితా శైలిలో రాయటమే కాక, అలాంటి రచనలు సంప్రదాయ పద్ధతి ఆలోచనా సరళి మార్చింది. కందుకూరి వీరేశలింగం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కట్టమంచి, గిడుగు రామమూర్తి వంటివారు ఇంగ్లీషు చదివి, తెలుగు రాతలో పాత పద్ధతి మారుస్తూ ఆధునిక రచనా పద్ధతి తీసుకువచ్చారు.

పేరుగాంచిన ఇంగ్లీషు నాటకాలు, వ్యాసాలు, నవలలు, హాస్యం, జీవిత చరిత్రలు, వీరేశలింగం అనువాదాలుగా రాశారు. కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, గడిచెర్ల 1907లో విజ్ఞాన చంద్రిక గ్రంథమాలని ప్రచురించ మొదలెట్టి, ముందుగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అబ్రహం లింకన్‌ జీవితచరిత్రని ప్రచురించారు. తెలుగు పాఠకులకు అంతర్జాతీయ విషయాలు చదివే ఆసక్తి కలిగిందనేగా అర్థం. మొదట వచ్చిన మాస పత్రికలు పురుషార్థ ప్రదాయినీ, ఆంధ్ర భాష సంజీవని, మందార మంజరీ, చింతామణీ, శ్రీ వైజయంతి వంటివి కొన్ని అచ్చయినవి. రెండవ విడతలో సరస్వతి, మంజువాణి, మనోరమ, సువర్ణరేఖ, సావిత్రి, హిందూ సుందరి వంటి మాసపత్రికలు. ఆంధ్ర ప్రకాశిక, శశిరేఖ, కృష్ణపత్రిక, ఆర్య మత బోధిని, సత్యవాది వంటి వారపత్రికలు తెలుగులో భాషావృద్ధికి తోడ్పడ్డాయి.

ఈ పత్రికలలో కొన్ని విషయాలు ఆరోగ్యం, ఇంటిలోని వస్తులతో మందులు చేయగలగడం, అలాగే సామాజిక సంస్కరణ విషయాలు, దేవదాసీ నిషేధం బిల్లు గురించి విషయాలు, జాతీయ పతాకం ప్రాముఖ్యత ఏమిటి, మహిళా విద్యాలయాలలో చదివించే విషయ పట్టిక, స్త్రీలు సాంఘిక సేవ కోసం చేసిన కార్యక్రమాలు, స్త్రీల సమాజ స్థితిగతుల గురించి వ్యాసాలు, ఇలాంటి విషయాలు ప్రచురితమయ్యాయి. ప్రాంతీయంగా పిల్లల కోసం కథలు, పాటలు, పద్యాలు అచ్చువేయటం మొదలైంది. పిల్లల ప్రపంచం, వారి ఆలోచనాపటిమ వేరు అనే విషయం విశదపరిచింది ఆధునికతనే.
రిచార్డ్‌ కార్నాక్‌ టెంపుల్‌ భారతీయ జానపద కథలను సంకలనం చేసి అచ్చువేశాడు. కొమర్రాజు లక్ష్మణరావు పిల్లల కోసం వ్యాసాలు రాశాడు. చిన్న పిల్లల వికాసం కోసం కిండర్‌ గార్డెన్‌ స్కూళ్లు, బొమ్మలతో కూడిన ఆటలు చదువులు మొదలైనాయి.

బొమ్మల రామాయణం, మహాభారతాలు, పజిల్‌ ఆటలు అచ్చువేశారు. తెలుగులో ఆంధ్ర పత్రికవారు ‘తమాషాలు’ అనే పేరు మీద హాస్య చిత్రంతో కూడిన హాస్య సంభాషణలు ప్రచురించారు. వివేకవతి పత్రిక వారు బాలికా విషయాలు పేరు మీద, చిన్నారుల జోల పాటలు, చిన్న చిన్న నీతికథలు ప్రచురించారు. ప్రాంతీయంగా ప్రతి భాషలోనూ ప్రచురణలు జరిగాయి. 1907లో పండిట్‌ బాలకృష్ణ భట్ట వారణాసి నుండి చిత్రాలతో కూడిన బాల ప్రభాకర్‌ అనే పిల్లల హిందీ మాస పత్రిక ప్రచురించారు. ఈ ప్రచురణలలో మరో ముఖ్యమైన భాగం హాస్య చిత్రాలు వ్యంగ్య చిత్రాలు. హాస్యచిత్రాలు పిల్లల పుస్తకాల కోసం విరివిగా వాడారు. కొన్ని వస్తువుల ప్రకటనల కోసం హాస్య, వ్యంగ్య చిత్రాలు వేశారు. వ్యంగ్య చిత్రాలు ముఖ్యంగా రాజకీయ వ్యాఖ్యల కోసం, ఇంగ్లీషు వారి అధికార ప్రవర్తన మీద, ఇంగ్లీషు వారిని అనుకరించిన భారతీయలు, మారిన వారి ఆచరణ అలవాట్లపై కూడా ఎక్కువగా వ్యంగ్య చిత్రాలు వేశారు. స్వదేశీ ఉద్యమం మొదలై, ఇంగ్లీషు పాలన విరోధించడంలో, పత్రికలలో వ్యాసాలే కాదు, ఇలా వ్యంగ్య, హ్యాస చిత్రాలను కూడా వాడి ప్రజలలోకి వారి ఆలోచనలు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు సంఘ సంస్కర్తలు.

మొదట ఇంగ్లీషువారి ఆర్ట్‌ స్కూళ్లలో చదివిన కళాకారులు ఈ పత్రికలకు చిత్రాలు వేయడం వలన, మొదటి దశలో ఇంగ్లీషు వారి చిత్రాలలాగా అనిపించినా ఆపై శైలి మారి భారతీయతను ప్రతిబింబించాయి. ఈ పత్రికలు చేసిన మరో కార్యం, జానపదకథలు, సామెతలు, జీవనశైలి, మౌఖిక సంప్రదాయాలను ప్రాంతీయంగా రాసి ప్రచురించి భద్రపరిచారు. మరో విధంగా చూస్తే ఇది ఇంగ్లీషువారు ప్రచారం చేస్తున్న వారి సంప్రదాయ సంస్కృతులకు అడ్డుకట్టలా పనిచేసింది. భారతి అనే తెలుగు మాస పత్రిక, ఆంధ్ర పత్రికవారిది. జయంతి అనే మాస పత్రిక తెలుగులో గొప్ప సాహిత్యవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రచురణ. ఈ రెండు ప్రచురణలు భారతీయ కళాకారుల కళలను కూడా ప్రచురించాయి.

ఈ విధంగా ప్రాంతీయ ప్రచురణలు ఇంగ్లీషు వారి ఆధిక్యతకు అడ్డుకాలు పెట్టి, భారతీయ సమాజ సంస్కృతి, సంప్రదాయాల విషయాలను ముందు పెట్టాయి. ఆధునికతను భారతీయ సమాజ పరంగా అర్థం చేసుకుని మూఢనమ్మకాలు పారదోలి, సమాన హక్కుల కోసం పోరాటం, స్వయం పాలన కోసం ఆరాటం, సంఘసంస్కర్తలు, నాయకులకు విజయవంతంగా ఈ ముద్రణ కళ సహాయ పడింది. ఇందు ప్రచురించిన వివిధ చిత్రాలు హాస్య, విషయ, వ్యంగ్య చిత్రాలు ఉత్సుకతను పెంచి చదవడానికి ప్రేరణ అయి సమాజంలో సాక్షరత పెంచాయి. ఈ ముద్రణ కళ భారతీయ ఆధునికతను భారతీయ మూసలో భారతీయుకులకు అందించి, భారతీయ ఆధునికతను గొప్ప ఎత్తుకు చేర్చింది. ప్రాంతీయ ముద్రణ కళ ప్రసార మాధ్యమంలో సమాజాన్ని ఎంత ఉత్తేజ పరిచిందంటే 1878లో బ్రిటిష్‌ వారు ప్రాంతీయ ప్రసార మాధ్యమాల మీద నియమాలు, నియంత్రణ విధించవలసి వచ్చింది.

ముద్రణ కళ ప్రసార మాధ్యంలో ఒక ఉప్పెనలా సమాచార విషయం, ప్రసార మాధ్యమాలను ముంచెత్తింది. 1840 తరువాత అలాగే మెల్లిగా అణిగిపోయింది. 1839లో హెన్రీ ఫాక్స్‌ టాల్‌బోట్‌ (1800 – 1877) ఒక ఇంగ్లీషు పరిశోధకుడు ఫొటోగ్రఫీని కనుగొన్నాడు. 1840లో బ్రిటిష్‌వారు భారతదేశం కూడా అది తీసుకువచ్చారు. ఫొటోగ్రఫీ, లేదా ఛాయాచిత్రంగా పిలువబడే ఈ కళ క్షణాలలో ఎదురుగా వున్న విషయం, సందర్బం చిత్రంగా కెమెరాలో బంధించగలదు. ఇది ప్రసార మాధ్యమానికి గొప్ప ఆసరా అయింది. ముద్రణ కళ కోసం కళాకారులు చిత్రించిన చిత్రాలు సమయం తీసుకుంటాయి. ఫొటోగ్రఫీ చిత్రానికి మరో గుణం కూడా వుంది. కెమెరా ఎదురుగుండా వున్న విషయాన్నే కెమెరాలో చిత్రాంగా బంధిస్తుంది. ఈ ఫొటోగ్రఫీ చిత్రం నమ్మదగ్గ నిజం. ఈ రెండు లక్షణాల వలన ప్రసార మాధ్యమాలలో ఫొటోగ్రపీ చిత్రాలకు ఆదరణ పెరిగింది. కొంత కాలం వరకు ముద్రణ కళ అలాగే సాగినా, కొంతకాలానికి ఫొటోగ్రఫి పూర్తిగా ప్రసార మాధ్యమాన్ని ఆక్రమించుకుంది. ముద్రణ కళ మూలబడింది. ఒక అర్థశతాబ్దం తరువాత కళాకారులు తమ భావప్రకటన కోసం మరో మాధ్యమం అని బయటకు తీశారు. భారతీయ ఆధునికతను మొదటి దశలో భారతీయ ఆలోచనా పరంగా ముందడుగు వేయించింది ముద్రణ కళేను.

(ఈ వ్యాసం లో ప్రస్తావించిన పత్రికలు, చిత్రాలు, ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్‌ ఆర్కైవ్స్‌ తార్నాక, హైదరాబాద్‌ లో పొందు పరచి ఉన్నాయి)

డా||యమ్‌.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -