Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆటలుదేశవాళీకి స్టార్స్‌ కళ!

దేశవాళీకి స్టార్స్‌ కళ!

- Advertisement -

నేటి నుంచి విజరు హజారే ట్రోఫీ
బరిలో కోహ్లి, రోహిత్‌, పంత్‌, సూర్యకుమార్‌


ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ నేటి నుంచి ఆరంభం కానుంది. ఈ ఏడాది విజరు హజారే ట్రోఫీ ఈ దశాబ్ద కాలంలోనే ప్రత్యేకం. మూడు ఫార్మాట్ల ఆటలో 50 ఓవర్ల ఫార్మాట్‌కు తృతీయ ప్రాధాన్యత. అయినా, విజరు హజారే ట్రోఫీపై గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. అందుకు కారణం, స్టార్‌ క్రికెటర్లు ఈ టోర్నమెంట్‌ బరిలోకి దిగటమే. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా పలువురు మేటి ఆటగాళ్లు విజరు హజారే సవాల్‌కు సిద్ధమవుతున్నారు.

నవతెలంగాణ-హైదరాబాద్‌

2011, విరాట్‌ కోహ్లి చివరగా దేశవాళీ విజరు హజారే ట్రోఫీలో ఆడాడు. 2017, రోహిత్‌ శర్మ విజరు హజారే ట్రోఫీలో చివరగా మెరిశాడు. టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పిన దిగ్గజ క్రికెటర్లు కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్‌ రేసులో నిలిచిన కోహ్లి, రోహిత్‌.. ఫామ్‌, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవటంతో పాటు బీసీసీఐ రూల్స్‌కు అనుగుణంగా దేశవాళీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌.. ముంబయి తరఫున రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌.. పంజాబ్‌ తరఫున అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఫ్యాన్స్‌కు పండుగే
ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుస శతకాలు, ఓ అజేయ అర్థ సెంచరీతో విరాట్‌ కోహ్లి కదం తొక్కాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఓ సెంచరీ, సఫారీలపై రెండు అర్థ సెంచరీలతో రోహిత్‌ శర్మ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు విజరు హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. భారత జట్టులో చోటు కోసం కోహ్లి, రోహిత్‌ కొత్తగా చేయాల్సిందేమీ లేదు. కానీ, కోహ్లి, రోహిత్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు ఆడటంతో విజరు హజారే ట్రోఫీ స్థాయి గణనీయంగా పెరిగింది. ముంబయి, ఢిల్లీలు గ్రూప్‌ దశలో ఏడేసి మ్యాచ్‌లు ఆడతాయి. అయితే, రోకో తొలి దశలో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. గ్రూప్‌ దశలో 3-4 మ్యాచ్‌ల్లోనే బ్యాట్‌ పడతారని సమాచారం. విజరు హజారే ట్రోఫీలో స్టార్‌ ఆటగాళ్ల తాండవం చూసే అవకాశం రావటంతో ఫ్యాన్స్‌కు ఇది పండుగే కానుంది.

సూర్యకు కీలకం
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ఫామ్‌లో లేని సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్య పగ్గాలు నిలుపుకున్నాడు. జట్టులో స్థానంతో పాటు కెప్టెన్సీ దక్కినా.. చోటుకు న్యాయం చేయాల్సిన బాధ్యత సూర్యకుమార్‌పై ఉంది. ఈ ఏడాది 22 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ సగటు 12.84. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ జనవరి 21 నుంచి ఆరంభం కానుంది. ఆ లోపు ఫామ్‌ చాటుకునేందుకు సూర్యకు విజరు హజారే ట్రోఫీ చక్కటి అవకాశం.
వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ సైతం దేశవాళీలో సత్తా చాటాలని ఎదురు చూస్తున్నాడు. తాజా పరిస్థితుల్లో భారత వన్డే, టీ20 జట్లలో పంత్‌కు చోటు లేకుండా పోయింది. ఇషాన్‌ కిషన్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీలో మెప్పించి జట్టులోకి వచ్చినట్టే.. విజరు హజారేలో సత్తా చాటి సెలక్షన్‌ కమిటీ దృష్టిలో పడేందుకు పంత్‌ ప్రయత్నం చేయనున్నాడు. గ్రూప్‌ దశలో ఢిల్లీ తరఫున ఏడు మ్యాచ్‌ల్లోనూ పంత్‌ బరిలోకి దిగనున్నాడు.

ఐపీఎల్‌లో ఎంట్రీ కోసం!
ఐపీఎల్‌ 2026 ఆటగాళ్ల మినీ వేలం ముగిసింది. కానీ ఐపీఎల్‌ జట్టులో చోటు సాధించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఆటగాళ్లకు గాయాలు, అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో ప్రాంఛైజీలు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. గత సీజన్‌ విజరు హజారే ట్రోఫీ ఫైనల్లో శతక బాదిన ఆర్‌. స్మరణ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆఖర్లో తీసుకుంది. ఆడం జంపా గాయంతో నిష్క్రమించటంతో స్మరణ్‌ను ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఇదే తరహాలో తీసుకోగా.. అతడు ఆర్‌సీబీకి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో వేలంలో నిరాశకు గురైనా.. ఇక్కడ మెరిస్తే మరో అవకాశం దక్కుతుందనే ఆలోచన క్రికెటర్లలో కనిపిస్తోంది.

బరిలో 32 జట్లు
విజరు హజారే ట్రోఫీ వేటలో 32 జట్లు పోటీపడుతున్నాయి. ఎలైట్‌ గ్రూప్‌లో 32 జట్లు.. నాలుగు గ్రూప్‌లుగా ఆడుతున్నాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు ఇతర ఏడు జట్లతో ఓసారి తలపడాల్సి ఉంటుంది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు ముందంజ వేస్తాయి. గత ఐదేండ్లుగా విజరు హజారే ట్రోఫీ అత్యంత పోటీతత్వంగా సాగుతోంది. గత సీజన్లలో ఐదు విభిన్న జట్లు చాంపియన్‌గా నిలువటమే అందుకు నిదర్శనం. కర్ణాటక డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఆడనుంది. హైదరాబాద్‌ జట్టు ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్‌తో పాటు అస్సాం, బరోడ, బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌, జమ్ము కాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, విదర్భలు ఉన్నాయి.

మంచు ప్రభావం ‘సున్నా’
వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ప్రధానంగా వినిపించే సమస్య ‘మంచు ప్రభావం’. సాధారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌లు మధ్యాహ్నం మొదలవుతాయి. రెండో ఇన్నింగ్స్‌ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. ఏడాది ఆఖర్లో తీవ్రమైన మంచు ప్రభావం ఉంటుంది. ఫలితంగా బంతి మెత్తబడి, బౌలర్లకు పట్టు చిక్కదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి. ఇరు జట్లకు వాతావరణ పరంగా సమాన పరిస్థితులు కల్పించేందుకు ఈ ఏడాది మ్యాచ్‌లను ఉదయం 9 గంటలకు ఆరంభించనున్నారు. దీంతో తొలి సెషన్లో పేసర్లకు పిచ్‌పై తేమతో వికెట్ల వేటకు అనుకూలత ఉండనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -