– కుల మతాలకు అతీతంగా పీర్లను ఎత్తిన యువత
– కొనసాగిన మహా అన్నదాన కార్యక్రమాలు
– కురిసిన వర్షంలోనూ.. మరింత ఉత్సాహంతో పీర్ల ఉత్సవాలు
నవతెలంగాణ – రాయపర్తి
త్యాగానికి ప్రత్యేకగా నిలిచే మొహర్రం ఉత్సవాలను పల్లెల్లో అసై దూల హారతి అంటూ పీర్ల చావడీల వద్ద యువత చిందులు వేశారు. ఆదివారం ముస్లిం సోదరులు నిర్వహించిన మొహర్రం పండుగ వాతావరణంతో పల్లెల్లో కోలాహలం నెలకొంది. రాయపర్తి, కొత్త రాయపర్తి, కాట్రపల్లి, కొండూరు, వెంకటేశ్వర పల్లి, కొత్తూరు, బంధన పల్లి తదితర గ్రామాల్లో పీర్ల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో పీర్లకు దట్టీలు, కుడుకలు, పిండి వంటలు అసమర్పించారు. డప్పు చప్పుళ్ళు, బ్యాండు దరువులు, డీజే పాటలతో పీర్ల పండుగ కొత్త పుంతలు తొక్కింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో ఉత్సవం నీరు కారిపోతుందనుకున్నారు.
కానీ కురిసే వర్షంలోనూ కూడా యువత పీర్లను ఎత్తుకొని గ్రామాల పురవీధుల్లో ఊరేగింపులు చేశారు. కొత్త రాయపర్తిలో ఎండి వసిమ్ నిర్వహించిన మహా అన్నదానానికి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మధ్య రాత్రి వరకు సాగిన పీర్ల (సవార్ల) ఊరేగింపు చెరువుల వద్దకు చేరుకున్నాయి. చిల్పేర్ పేరుతో పిర్లను (సవార్లను) చెరువులో నిమజ్జనం చేశారు. ఫాతియా ఇచ్చి ముస్లిం సోదరులు విషాద గేయాలను ఆలపిస్తూ ఇండ్లకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.