పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్లు
కేంద్రం నిధులిచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి ఆగదు
జైలుకెళ్తే సీఎం కావొచ్చని కేటీఆర్, హరీశ్, కవిత ఆశపడుతున్నారు
రంజిత్‌రెడ్డికి మంత్రి పదవినిస్తానని నేనెక్కడా చెప్పలేదు : పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘నేను చెబుతున్నా.. రాసి పెట్టుకోండి… మన రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం 2028 డిసెంబరు లో ఎన్నికలు రావాలి.. కానీ అప్పుడు కాకుండా 2029లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి…’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు, దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకేసారి (జమిలీ) ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీ భావిస్తుండటమే దీనికి కారణమని ఆయన తెలిపారు.
ఆ ప్రకారంగా 2029 లో పార్లమెంటు ఎన్నికలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్లను నిర్వహిస్తారని వివరించారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం సీఎం… పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికల దాకా అనేక విషయాలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను విస్పష్టంగా ప్రకటించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తనదైన శైలిలో పలుమార్లు సీఎం సైటైర్లు విసిరారు.
2029 నాటికి జనగణనలో కులగణన, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, వాటి సంఖ్య పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు అనేవి బీజేపీ వ్యూహాలుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచుతామనటం సరికాదన్నారు. దీనివల్ల కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి, క్రమశిక్షణను నిరూపించుకున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ, బీహార్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి.. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని తెలిపారు.
అందువల్ల వాటి సంఖ్యను పెంచితే.. ఇప్పుడున్న ప్రకారంగా రాష్ట్రాల్లోని సీట్ల మధ్యనున్న గ్యాప్‌ను కొనసాగించాలని, అందుకనుగుణంగా సర్దుబాట్లు చేయాలని సూచించారు. అలా చేయకపోతే పార్లమెంటులో బలం కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధార పడాల్సిన అవసరమే కేంద్రానికి ఉండబోదని హెచ్చరిం చారు. ఇదే జరిగితే నిధులు, గ్రాంట్లు, సహాయాల విషయం లో ఆయా రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోబోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థికాంశాల్లో దక్షిణాదిపట్ల మోడీ సర్కార్ తీవ్ర వివక్షను చూపుతోందని విమర్శించారు. అయితే కేంద్రం నిధులిచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణలో మాత్రం అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తిగా మారిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు 20 నెలలపాటు విదేశాల్లో దాక్కున్నారని సీఎం ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఆయన్ను స్వదేశానికి రప్పించే విషయంలో కేంద్రం తమకు సహకరించలేదన్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన్ను ఇండియాకు రప్పించగలిగామని తెలిపారు. ఆ తర్వాతే కేసు విచారణ వేగం పుంజుకుందని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ‘దమ్ముంటే మమ్మల్ని జైలుకు పంపు…’ అంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సవాల్ విసురుతున్న విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించగా.. ‘జైలుక పోతే సీఎం అవుతామనే ఒక భావన సర్వత్రా వ్యాపించింది. జైలుకు పోయిన జగన్, చంద్రబాబుతోపాటు నేను (రేవంత్‌రెడ్డి) కూడా సీఎం అయ్యాను. అందుకే ఇప్పుడు వాళ్లు (కేటీఆర్, హరీశ్‌రావు) కూడా జైలుకు పోవటానికి తహతహలాడుతున్నారు..’అని ఎద్దేవాచేశారు.
అయితే వారిద్దరికంటే ముందుగా కవిత జైలుకు పోయింది కాబట్టి,తానే సీఎం కావాలని ఆమె కోరుకుంటున్నారని చమత్కరించారు. ఎవరైనా ఎప్పుడైనా ఇంటిబిడ్డను మంచిగా చూసుకుంటే ఎలాంటి సమస్యలూ రాబోవని వ్యాఖ్యానించారు. అధికారం ఉన్ననాళ్లూ వారందరూ (కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత, సంతోశ్) కలిసికట్టుగా ఉన్నారు, పవర్ పోయిన తర్వాత కొట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ నేతల కుటుంబ సభ్యుల మధ్యనున్న విబేధాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి మంత్రి పదవిని స్తానంటూ తానెక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఒక ప్రధాన పత్రికలో అవాస్తవాలు రాయటం శోచనీయమని అన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడొద్దని, తద్వారా కుటుంబాల్లో చిచ్చు పెట్టొద్దని మీడియాకు హితవు పలికారు.
2026 జనవరి ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు దేశంలోని ఏ హద్దులూ (రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు వగైరా) మార్చటానికి వీల్లేదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని రేవంత్‌రెడ్డి వివరించారు. అందువల్ల ఇప్పటికిప్పుడు జిల్లాల పునర్విభజన ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. ఒక పారీనేతగా, ముఖ్యమంత్రిగా ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ గెలవాలని కోరుకుంటానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన ప్రసంగాల్లోని భాషకు సంబంధించి.. ‘కొంతమందికి కొన్ని టెంపర్‌మెంట్స్ ఉంటాయి.. సిచ్యువేషన్‌ను బట్టి అవి మారుతుంటాయి..’ అని చెప్పారు. అయినా ఇటీవల కాలంలో తాను పరిస్థితులన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతున్నానని వివరించారు. గతంలో కేసీఆర్ పాత్రికేయులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ చెప్పి మోసం చేశారని సీఎం విమర్శించారు.



