– శాసనసభలో మూడు బిల్లులపై చర్చ
– కాళేశ్వరం నివేదికను ప్రవేశ పెట్టనున్న మంత్రి ఉత్తమ్
– బీఏసీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
– సమావేశాలు 30 రోజులు జరపాలి :బీజేపీ
– ఎంఐఎం, సీపీఐ గైర్హాజరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే జరిగే అవకాశముంది. ఈమేరకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన రెండు చట్టాలకు సవరణలు ప్రతిపాదించనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కారు తీసుకొచ్చిన ప్రత్యేక జీవోపై ఆదివారం శాసనసభలో చర్చించనుంది. వీటితోపాటు కాళేశ్వరం కమిషన్ నివేదికను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం ఈ నివేదికపై చర్చ జరపాలని సర్కారు నిర్ణయించింది. శనివారం అసెంబ్లీలోని సభాపతి చాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. అధికార కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎంఐఎం, సీపీఐ పార్టీలు గైర్హాజరయ్యాయి. భారీ వర్షాలు, పంటల నష్టం, యూరియా కొరత, విషజ్వరాలు వంటి కీలకాంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించాలంటూ బీఆర్‌ఎస్ బీఏసీలో పట్టుపట్టింది. అందుకు అధికార కాంగ్రెస్ పక్షం ససేమిరా అనడంతో బీఏసీ నుంచి ఆ పార్టీ వాకౌట్ చేసింది. 30 రోజులపాటు సమావేశాలు నిర్వహించాల బీజేపీ కోరింది. ముందుగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వినాయక నిమ్జనం, వరదల్లో మంత్రుల పర్యటనల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
పీపీటీ అడిగే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీలో ప్రతిపక్షా లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చే సాంప్రదాయం లేదంటూ ఆనాడు బీఆర్‌ఎస్ చెప్పిన విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆ పార్టీ నేతలకు గుర్తు చేశారు. బీఏసీ సమావేశానంతరం ఆయన తన చాంబర్‌లో ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తమకు పీపీటీ అవకాశం కల్పించాలంటూ లేఖ రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. అప్పుడు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పుడులేని సాంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందని నిలదీశారు. ఇప్పుడు పీపీటీ అడిగే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,500 కోట్ల వడ్డీ కట్టలేదంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. అప్పులకు వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే బీఆర్‌ఎస్ నాయకులు చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌కు భయమెందుకు : మంత్రి సీతక్క
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ అంటే బీఆర్‌ఎస్‌కు భయమెందుకని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు ఆ పార్టీ యూరియా అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చర్చించనున్నట్టు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం పూర్తి స్పష్టత వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆదివారం సభలో పెడతామన్నారు. కాళేశ్వరంపై సభలో బీఆర్‌ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ కోరిందనీ, దానిపై స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
అసెంబ్లీ రెండ్రోజులే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES