డిసెంబర్ 30, 31, జనవరి 1 సెలవు
మళ్లీ 2వ తేదీ నుంచి కొనసాగింపు
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి మంతనాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు 29 నుంచి ప్రారంభంకానున్నాయి. డిసెంబరు 30, 31, జనవరి 1న అసెంబ్లీకి సెలవులిచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ జనవరి 2వ తేదీ నుంచి సమావేశాలు కొనసాగనున్నాయి. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ విమర్శలు, కృష్ణా, గోదావరి జలాల సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటివాటాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను శాసనసభ సమావేశాల సందర్భంగా చర్చకు పెట్టనున్నట్టు సమాచారం. నీటిపారుదల అంశాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిలదీయాలని మంత్రులతో చర్చించినట్టు తెలిసింది.
ఈ భేటీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, పీఏసీఎస్ ఎన్నికలు, మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టు సమాచారం. గత సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆగస్టు 2025లో పంచాయతీరాజ్ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే రిజర్వేషన్లు 50శాతం పరిమితి మించడాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ అక్టోబర్‌లో హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లు లేకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం పరిమితిని తొలగించాలని ఒత్తిడి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానాలు, పార్లమెంటులో ప్రయివేటు బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు తదితర చర్యలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. కాగా జనవరి 2 నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.



