వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆలేరు మండల కేంద్రంలోని సుందరయ్య భవనంలో జరిగిన సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బొమ్మకంటి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్ఆర్ఈజీఏ)ను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీలకు రోజుకు రెండు పూటలా ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు.కూలీలకు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకూలిని రూ.600గా పెంచాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సవరించిన వ్యవసాయ కార్మికుల వేతనాలను వెంటనే అమలు చేసి, గ్రామ సభలు నిర్వహించి పెరిగిన కూలి రేట్లపై అవగాహన కల్పించాలని కోరారు.50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు రూ.7,000 పింఛన్ ఇవ్వాలని, పని ప్రదేశాల్లో తాగునీరు,టెంట్లు,ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కూడా కోరారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి శంకరయ్య,కేతావత్ లక్ష్మి,పుట్టల రత్నం,చౌడబోయిన యాదగిరి,ఎలగందుల రాములు,జాలపు లక్ష్మి,మద్దెబోయిన ఉప్పలయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.



