Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచమురు నిల్వల కోసమే దాడి

చమురు నిల్వల కోసమే దాడి

- Advertisement -

వెనిజులాపై అమెరికా పెత్తనం దుర్మార్గం
మోడీ మౌనం వీడి ట్రంప్‌ చర్యను ఖండించాలి : హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వెనిజులాలోని చమురు నిల్వల దోపిడీయే లక్ష్యంగా అమెరికా దాడి చేసిందనీ, ఆ దేశ అధ్యక్షుడు మదురో, అతని భార్యను నిర్బంధించిందని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ఒకదేశంలో చొరబడి అధ్యక్షున్ని అరెస్టు చేయడం అత్యంత ప్రమాదకమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మన ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి ట్రంప్‌ చర్యను ఖండించాలని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లో గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌, ఐన్‌ఎటీయూసీ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్‌ యాదవ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనురాధ, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్‌, బీఆర్టీయూ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ మాట్లాడారు. వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్నా ట్రంప్‌ నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు. వెనిజులా ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటనీ, చమురు, బంగారు గనులు పుష్కలంగా ఉన్నాయని గుర్తుచేశారు.

వెనిజులాలోని సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలనే సామ్రాజ్యవాద కుట్రలో భాగంగానే అమెరికా దాడి చేసిందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని ప్రపంచదేశాల్లో తన ప్రభ తగ్గిపోతుందన్న భయంతో అమెరికా దుర్మార్గాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలను, నిర్ణయాలను అన్ని దేశాలూ అమలు చేయాలనే ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తూ అమెరికా పెత్తనం చెలాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. యుద్ధ విమానాలతో ఒక దేశ మిలటరీ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడిచేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వెనిజులాపై దాడి చేసే హక్కు అమెరికాకు లేదన్నారు. అమెరికా తన తీరును మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ముందుకొస్తాయని హెచ్చరించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కార్మికులు, ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ నాయకులు అంజాద్‌, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు కూరపాటి రమేష్‌, పి. సుధాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, సీఐటీయూ నాయకులు మహేందర్‌, అశోక్‌, ఎం. రాధేశ్యామ్‌, ఐఎఫ్‌టీయూ అరుణక్క, టీయూసీఐ నాయకులు ఎస్‌.ప్రదీప్‌, లింగంగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -