భారత్ విదేశాంగ శాఖ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో అడ్డూఅదుపు లేకుండా మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, హింస, అల్లర్లు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని భారత్ శుక్రవారం వ్యాఖ్యానించింది. ఆ దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగాలన్న తన వైఖరిని పునరుద్ఘాటించింది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) తాత్కాలిక చైర్మెన్ తారిఖ్ రహమాన్ స్వదేశానికి రావడంపై కూడా భారత్ ఆచితూచి ప్రతిస్పందించింది. రాబోయే ఎన్నికల్లో అందరినీ కలుపుకుని వెళ్లాలన్న నేపథ్యంలో దీన్ని చూడాలని వ్యాఖ్యానించింది. విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఇటీవల బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో హత్యకు గురైన హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ హత్యను భారత్ ఖండిస్తోందని చెప్పారు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంటూ ఇటువంటి దాడులకు, నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైస్వాల్ మీడియా సమావేశంలో చెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. తాత్కాలిక ప్రభుత్వ హయంలో మైనారిటీలపై 2900కి పైగా హింసాత్మక సంఘటనలు జరిగాయని, వాటిని స్వతంత్ర వర్గాలు డాక్యుమెంట్ చేశాయని ఆయన తెలిపారు. అక్కడి దాడులను కేవలం మీడియా అత్యు త్సాహంగా లేదా రాజకీయ హింసగా కొట్టిపారేయలేమని జైస్వాల్ వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను రాజకీయ హింసగా కొట్టివేయలేం
- Advertisement -
- Advertisement -



