Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండబుల్‌ షాపుల వేలంపాట ఆపాలి

డబుల్‌ షాపుల వేలంపాట ఆపాలి

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌
ప్రజాభవన్‌ ప్రతినిధి జి.చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్య దేవరాజ్‌కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని డబుల్‌ బెడ్‌రూం సముదాయంలో ఉన్న వాణిజ్య షాపుల అమ్మకాలను ఆపాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో శుక్రవారం సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి వెళ్లి ప్రజాభవన్‌ అధికార ప్రతినిధి జి.చిన్నారెడ్డి, ప్రజాభవన్‌ నోడల్‌ అధికారి దివ్యదేవరాజ్‌కి విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. పేదలకు డబుట్‌ బెడ్‌ రూం ఇండ్లు రావడంతో .. బయట అద్దెలు కట్టలేక ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేకపోయినా నివాసముంటున్నారని తెలిపారు. పేదలు, కార్మికులు, అక్కడి సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ముందు చూపుతో కాలనీల్లో వాణిజ్య షాపులు ఏర్పాటు చేసిందని చెప్పారు.

వాటిని స్థానిక ప్రజలకు కిరాయిలకి ఇచ్చి ఆ డబ్బులతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదయాల్లో లిఫ్ట్‌, కరెంట్‌, జెన్‌రేటర్‌ లాంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. ఆ షాపులను ఇప్పుడు పూర్తిగా అమ్మేయాలని ఈ ప్రభుత్వం చూస్తున్నదని, ఇది చాలా దుర్మార్గం అన్నారు. వెంటనే వాణిజ్య షాపుల అమ్మకాలను ఆపాలని లేనిపక్షంలో ఈనెల 15-17 మధ్య జరిగే వేలం పాటను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాల్లేకుండా.. డబుల్‌ బెడ్‌ రూం ఏరియాల అసోసియేషన్‌లతో మాట్లాడకుండా వారి బతుకు మీద కొడుతాం అంటే ఎర్రజెండా, సీపీఐ(ఎం) చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, జె.చంద్రశేఖర్‌, ఏ.అశోక్‌, ఐ.రాజశేఖర్‌, జి.శ్రీనివాస్‌, నాయకులు నరేష్‌, సంతోష్‌, శంకర్‌, లింగస్వామి, గణేష్‌, జె.వెంకన్న, సబిత, బాధితులు విజయ్, బాబురావు, రాజేందర్‌, రాములు, గోపాల్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -