ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టిన స్మగ్లర్లు
మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
తీవ్రంగా పరిగణిస్తామన్న కలెక్టర్
బాధితురాలికి పరామర్శ.. ప్రభుత్వ పరంగా వైద్య ఖర్చులు
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. వాహన తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ నగర శివారులో శుక్రవారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నిర్మల్‌కు చెందిన గంజాయి స్మగ్లర్లు నిజామాబాద్‌కు గంజాయి సరఫరా చేసేందుకు కారులో వస్తున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు వారిని పట్టుకునేందుకు నిజామాబాద్ ఎస్‌హెచ్‌ఓ స్వప్న ఆధ్వర్యంలో మాధవనగర్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించారు.
అయితే, స్మగ్లర్లు కారుతో ఎక్సైజ్ సిబ్బందిని ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించారు. సీఐ స్వప్నతో పాటు పలువురు సిబ్బంది తప్పించుకున్నా.. కానిస్టేబుల్ జి.సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా దూసుకెళ్లిన స్మగ్లర్ల కారు ఓ స్తంభానికి ఢీకొని ఆగిపోయింది. ఎక్సైజ్ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో నిర్మల్ జిల్లా వైఎస్సార్ కాలనీలో ఉండే సయ్యద్ సోహిల్‌తోపాటు మరో బాలుడు ఉన్నట్టు తెలిపారు. కారులో సుమారు 2 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గాయాలైన కానిస్టేబుల్‌ను చికిత్స కోసం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.
ఎక్సైజ్ ఉద్యోగుల నిరసన
ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎక్సైజ్ జిల్లా కార్యాలయం ఎదుట ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. గంజాయి కేసుల విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ప్రమోషన్ల కోసం కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా గంజాయి రవాణా లేకున్నా పక్క జిల్లా కేసుల ఛేదనలో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి అక్కడికి చేరుకుని ఉద్యోగులకు నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
కానిస్టేబుల్‌ను పరామర్శించిన కలెక్టర్..
ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని పోలీస్ కమిషనర్‌ను కోరతామని చెప్పారు.
సౌమ్య వెంటిలేటర్‌పై ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. సౌమ్య ఆరోగ్యం సహకరించిన వెంటనే ఉన్నతస్థాయి వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేశామని, వైద్యం ఖర్చును ప్రభుత్వ పరంగా అందిస్తామని తెలిపారు. కాగా, ఘటనా స్థలంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ స్వప్న తక్షణమే స్పందించి సౌమ్యకు సీపీఆర్ చేయడం ఎంతగానో ఉపకరించిందని, ఈ సందర్భంగా స్వప్నను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులున్నారు.
విధి నిర్వహణలో స్వీయ భద్రత పాటించాలి
ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ విధి నిర్వహణ సమయంలో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కానిస్టేబుల్ సౌమ్య ఘటనను ప్రస్తావించారు. విధి నిర్వహణలో ఉన్న తరుణంలో గాయపడిన సౌమ్య ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. విధులు నిర్వర్తించే సమయాలలో ఉద్యోగులు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.



