బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ జీవితఖైదు కొనసాగించాలి : ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఢిల్లీ హైకోర్టు ఎదుట ఆందోళన
నవతెలంగాణ – హైదరాబాద్
ఉన్నావ్ లైంగికదాడి నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్ బెయిల్ రద్దు చేయాలని, ఆయన జీవిత ఖైదు కొనసాగించాలని ఐద్యా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే డిమాండ్ చేశారు. కుల్దీప్‌కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడం, షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. ”బలత్కారియో కో సంరక్షన్ బ్యాండ్ కరో (లైంగికదాడి చేసిన వారిని రక్షించడం ఆపండి)” అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మరియం దావలే మాట్లాడుతూ నేరస్తుడికి పదవి, కులం, మతం, ఎలాంటి పరిపాలన, రాజకీయ, న్యాయపరమైన రక్షణ కల్పించకూడదని డిమాండ్ చేశారు. నిందితుడు కుల్దీప్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మైనర్‌ను ఇంటికి పిలిపించుకుని, స్పృహ లేకుండా చేసి లైంగికదాడికి పాల్పడడం హేయమైన చర్యని అన్నారు.
ఘటన అనంతరం బాలికను బయటకు చెప్పవద్దంటూ బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని విమర్శించారు. అయినా బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయబోతే పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడానికి భయపడ్డారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగితే తప్ప ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని దుయ్యబట్టారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ ఉపసంహరించుకోవాలని నిరంతరం బెదిరింపులకు పాల్పడుతూ బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, ఆమె తండ్రిని కస్టడీలోకి తీసుకుని హత్య చేశారన్నారు. అయినా విషయం సద్దుమణగకపోవడంతో కుటుంబంపై దాడి చేశారని, ఆ సమయంలో మైనర్ అత్త, పిన్ని మరణించారని తెలిపారు. చివరికి నిందితునికి జీవిత ఖైదు శిక్ష పడిందన్నారు.
అప్పటికీ బీజేపీ నేతల బెదిరింపులు ఆగలేదన్నారు. కమలం నాయకులు వారి ప్రతి వాహనం వెనుక ”బేటీ బచావో, బేటీ పడావో” అనే నినాదాన్ని అతికిస్తున్నారని, వాస్తవంలో వారే ఆచరించడం లేదని దుయ్యబట్టారు. ఈ మనువాద పాలనలో కోర్టు నుంచి న్యాయం ఆశించడం కష్టమవుతోందన్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ ఘటన అనంతరం తన కుమార్తె అనేక బాధలు అనుభవించిందని గుర్తు చేసుకున్నారు. న్యాయం కోసం నిరసన తెలిపేందుకే కోర్టుకు వచ్చామన్నారు. గతంలో చేసిన న్యాయాన్ని మార్చి ఇచ్చిన తాజా తీర్పు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, అందుకే సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త యోగితా భయాన, ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆశాయాదవ్, కవిత శర్మ, నేతలు ఆశా శర్మ, శర్బానీ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.



