Monday, May 5, 2025
Homeదర్వాజనన్ను చెక్కిన గబ్బిలం

నన్ను చెక్కిన గబ్బిలం

- Advertisement -

A book must be the axe for the frozen sea within us” అంటాడు kafka.
ఈ వాక్యం నా ద్వారా మరోసారి రుజువైంది. గబ్బిలం చదివి నిలువెల్లా కదిలిపోయాను.ఎన్నో రకాల ఆలోచనలోతో తడిసిపోయాను.కొత్త చైతన్యంతో ఊగిపోయాను. నాకంటూ ఉన్న సమాజం వైపు కదిలిపోయాను.నాలో వెనక్కి నెట్టబడిన, ఊరికి దూరంగా జరపబడిన మనుషుల సోయి మొదలయింది గబ్బిలం కతిని చదివాకనే..!
కావ్యానికి గబ్బిలం అనే శీర్షిక పెట్టడాన్ని ఇష్టపడ్డాను. పక్షులలో అపశకునపు పక్షిగా, తలకిందులుగా వున్న గబ్బిలాన్ని కావ్య నాయకుడిగా తీసుకోవడంతో జాషువా కవి ప్రయోగం చేసి తీరుకి ముగ్డుడుని అయ్యాను. ఆ గబ్బిలాన్ని సమాజంలో ఎంత పాటుబడినా పేదవాడిగా కడగొట్టు బిడ్డడిగా మిగిలిన అరుంధతీసుతునికి ప్రతీకగా తీసుకున్నాడని స్పష్టమయ్యాక జాషువా ప్రతిభ ఆశ్చర్యపరచింది.
మేఘసందేశం వంటి ద్యూతకావ్య సంప్రదాయాన్ని మాత్రమే తీసుకుని, సమాజంలో అంటరానితనం వల్ల నలిగిపోయే జీవుడి వేదనను ప్రపంచానికి వినిపించిన విధానం గబ్బిలం ఖండకావ్యం పై మరింత ఆసక్తిని రేపింది.కావ్యం చదవగానే వస్తువుని బలపరిచే కొత్తభాష వుండాలి. ఆలంకారిక సొగసుండాలి. కవిజాణతనం పదపదాన ప్రసరిల్లాలి. జాషువా పై కవిత్వవిలువలతో ఆధునికపద్యాన్ని రమణీయంగా కమకమగా నడిపిన విధానం నన్ను కవిత్వపిపాసిని చేసింది. అరుంధతీ సుతుని గురించి చెబుతూ ”చిక్కిన కాసుచే తనివిజెందును, బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్దమూర్తి వంటి పాదాలను చదివితే దొరికిన దానితో సంతప్తిగా జీవించే పద్ధతి బోధపడింది. గబ్బిలం అందమైన పక్షి కాకున్నా దానిని జాషువా చేసిన సంబోధనలు అబ్బుర పరిచాయి. ఖగసన్యాసిని, తబిసిపిట్ట, పక్షికళ్యాణి, మౌని ఖగరాజ్ఞి, గబ్బిలపుచానా, పుల్గుదొరసాని, వేలుపుగిడ్డివి, పక్షిసుందరీ, ఖగవధూటి వంటి పదసౌరభాన్ని సంబోధనా శిల్పంగా కావ్యం పొడవునా వాడాడు. సమాజంలో బాడీషేమింగ్‌ భాషతో అన్యులను కించపరిచే వాళ్లకు ఈ పిలుపుపందారలు కనువిప్పు కలిగిస్తాయి.నా వరకైతే ఈ పిలుపు సంస్కారాన్ని గబ్బిలం కావ్యం మరింత ఇనుమడింపజేసింది.
”హదయమే లేని లోకము సుమీ” అన్నప్పుడు సమాజలోని ఒక బలిసిన వర్గం బలహీనవర్గంపై చూపే క్రౌర్యంలోని తీవ్రత తెలిసింది. ”సనాతనధర్మధేనువుల్‌ పిదికిన పాలు పేదకు లభింపవు” అన్నప్పుడు సమాజ వాస్తవికత అద్దంపట్టింది. ఊహపేహల కల్పనా సాహిత్యాన్ని దాటించి, సమాజంలో విషాదాన్ని అశ్రువులుగా జీవించే మనుషులవైపు నా చూపుని తిప్పింది గబ్బిలం.ప్రతిమల పెండ్లిసేయుటకు, చీమకు పంచదార,కర్మసిద్ధాంతమున వంటి పద్యాలను ధారణగా చదివాక, హేతువాద దష్టి నరనరమైంది. మూఢనమ్మకం ఒకటైనా నాలో నిలవనీయలేదీ పొత్తం. నిశీథస్త్రీకి పెంజెడ తెల్లనవుతుంది అన్న పాదం ముచ్చట గొలిపింది. చీకటిస్త్రీకి పెంజెడ తెల్లనవడం అంటే తెల్లవారుతుంది అనే అర్థం. ఇంకా కసరి బుసగొట్టు నాల్గుపడగల హైందవనాగరాజు అనడం, ఇనుపగజ్జెలతల్లి, ముక్కుమొగమున్న చీకటి ముద్దవోలె అనీ, తిల్లికనారిపి దయ్యపు పిల్లవోలె అనీ,ఛత్రముల వంటి నీలి పక్షముల విచ్చి అని గబ్బిలాన్ని సిమిలీలుగా,రూపకాలుగా వర్ణనలు చేయడం కవిగా మొదలైన నాలో కవనరీతిని జాగతపరిచింది.
గబ్బిలం చదవగానే ఆధునికపద్యంతో ఆధునిక సమాజాన్ని గొప్పగా ఆవిష్కరించొచ్చని బోధపడింది. కులోన్మాదులు,శ్రమదోపిడీదారులు, మూఢనమ్మకాలు నాగరీక లోకంలో ఎంతగా వేళ్లూనుకున్నాయో అర్థమయింది. ధ్వనిపూర్వకంగా ప్రతిఘటనని వెలిబుచ్చవచ్చో నాడికొచ్చింది. గబ్బిలం మెదడుని తూట్లుపొడిచే పుస్తకం.ఆర్ద్ర హదయాన్ని తట్టిలేపిన పుస్తకం. గబ్బిలం కావ్యాన్ని పాఠ్యాంశంగా చెప్పిన ఎండ్లూరిసుధాకర్‌ గారు నాకు నిత్య స్మరణీయులు.

  • మెట్టానాగేశ్వరరావు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -