Saturday, November 1, 2025
E-PAPER
Homeఆటలుబ్యాటర్లు విఫలం

బ్యాటర్లు విఫలం

- Advertisement -

అర్థ సెంచరీతో రాణించిన అభిషేక్‌
మెల్‌బోర్న్‌ టీ20లో ఆసీస్‌ ఘన విజయం
నిప్పులు చెరిగిన హాజిల్‌వుడ్‌, ఎలిస్‌, జేవియర్‌

మెల్‌బోర్న్‌ స్టేడియం 82438 మంది అభిమానులతో కిక్కిరిసిన వేళ.. టీ20 ధమాకాలో టీమ్‌ ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు. పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌ నం.1 భారత్‌ బ్యాట్‌తో ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ఆసీస్‌ పేస్‌ త్రయం నిప్పులు చెరుగగా భారత్‌ 125 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు 13.2 ఓవర్లలోనే ఊదేసింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజ వేసింది.

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)
అగ్రజట్ల టీ20 ధమాకాలో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. మెల్‌బోర్న్‌లో పేసర్లు నిప్పులు చెరుగగా ఆస్ట్రేలియా అలవోక విజయం ఖాతాలో వేసుకుంది. జోశ్‌ హాజిల్‌వుడ్‌ (3/13), నాథన్‌ ఎలిస్‌ (2/21), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (2/39) పేస్‌ దెబ్బకు భారత బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (68, 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో దంచికొట్టాడు. అభిషేక్‌ శర్మ మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించినా భారత్‌ 18.4 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ముగించింది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (46, 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిశ్‌ హెడ్‌ (28, 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), జోశ్‌ ఇంగ్లిశ్‌ (20, 20 బంతుల్లో 1 ఫోర్‌) రాణించారు. భారత బౌలర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/26), వరుణ్‌ చక్రవర్తి (2/23), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/45) రాణించారు. ఆస్ట్రేలియా పేసర్‌ జోశ్‌ హాజిల్‌వుడ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ ఆదివారం హోబర్ట్‌లో జరుగనుంది.

ఆసీస్‌ అలవోకగా..
126 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చెమట పట్టకుండా ఛేదించింది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (46) ఛేదనను దూకుడుగా మొదలెట్టాడు. ట్రావిశ్‌ హెడ్‌ (28) సైతం మెరవటంతో పవర్‌ప్లేలో ఆసీస్‌ 56 పరుగులు చేసింది. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఓవర్లో మిచెల్‌ మార్ష్‌ విశ్వరూపం దాల్చాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగిన మిచెల్‌ మార్ష్‌.. అదే ఓవర్లో వికెట్‌ కోల్పోయాడు. అప్పటికి ఆసీస్‌ స్కోరు 8 ఓవర్లలో 87/2. జోశ్‌ ఇంగ్లిశ్‌ (20), మిచెల్‌ ఓవెన్‌ (14) నెమ్మదిగా ఆడుతూ లక్ష్యానికి చేరువ చేశారు. టిమ్‌ డెవిడ్‌ (0), మాథ్యూ షార్ట్‌ (0) నిరాశపరిచినా.. స్టోయినిస్‌ (6 నాటౌట్‌), జేవియర్‌ (0 నాటౌట్‌)లు లాంఛనం ముగించారు. మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అభిషేక్‌ ఒక్కడే
తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ పవర్‌ప్లేలోనే విలవిల్లాడింది. ఆసీస్‌ పేసర్లు హాజిల్‌వుడ్‌, ఎలిస్‌, జేవియర్‌లు విజృంభించగా 6 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. శుభ్‌మన్‌ గిల్‌ (5), సంజు శాంసన్‌ (2), సూర్యకుమార్‌ యాదవ్‌ (1), తిలక్‌ వర్మ (0), అక్షర్‌ పటేల్‌ (7) నిరాశపరచగా 49 పరుగులకే భారత్‌ 5 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (68) ఒంటరి పోరాటానికి టెయిలెండర్‌ హర్షిత్‌ రానా (35) జత కలిశాడు. ఒత్తిడిలోనూ దంచికొట్టిన అభిషేక్‌ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. దీంతో భారత్‌ గౌరవప్రద స్కోరు చేసింది. శివం దూబె (4), కుల్‌దీప్‌ (0), వరుణ్‌ (0 నాటౌట్‌), బుమ్రా (0) వికెట్లు వదిలేయగా 18.4 ఓవర్లలోనే భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : శుభ్‌మన్‌ గిల్‌ (సి) మార్ష్‌ (బి) హాజిల్‌వుడ్‌ 5, అభిషేక్‌ శర్మ (ఎల్బీ) ఎలిస్‌ 68, సంజు శాంసన్‌ (ఎల్బీ) ఎలిస్‌ 2, సూర్యకుమార్‌ (సి) ఇంగ్లిశ్‌ (బి) హాజిల్‌వుడ్‌ 1, తిలక్‌ వర్మ (సి) ఇంగ్లిశ్‌ (బి) హాజిల్‌వుడ్‌ 0, అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌) 7, హర్షిత్‌ రానా (సి) డెవిడ్‌ (బి) బార్ట్‌లెట్‌ 35, శివం దూబె (సి) డెవిడ్‌ (బి) బార్ట్‌లెట్‌ 4, కుల్‌దీప్‌ (సి) అబాట్‌ (బి) స్టోయినిస్‌ 0, వరుణ్‌ నాటౌట్‌ 0, బుమ్రా (రనౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 125.
వికెట్ల పతనం : 1-20, 2-23, 3-32, 4-32, 5-49, 6-105, 7-109, 8-110, 9-125, 10-125.
బౌలింగ్‌ : జోశ్‌ హాజిల్‌వుడ్‌ 4-0-13-3, జేవియర్‌ బార్ట్‌లెట్‌ 4-0-39-2, నాథన్‌ ఎలిస్‌ 3.40-21-2, మార్కస్‌ స్టోయినిస్‌ 4-0-24-1, మిచెల్‌ ఓవెన్‌ 1-0-13-0, మాథ్యూ కున్హేమాన్‌ 2-0-14-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : మిచెల్‌ మార్ష్‌ (సి) అభిషేక్‌ (బి) కుల్‌దీప్‌ 46, ట్రావిశ్‌ హెడ్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 28, ఇంగ్లిశ్‌ (ఎలీ) కుల్‌దీప్‌ 20, టిమ్‌ డెవిడ్‌ (సి,బి) వరుణ్‌ 1, మిచెల్‌ ఓవెన్‌ (సి) శాంసన్‌ (బి) బుమ్రా 14, స్టోయినిస్‌ నాటౌట్‌ 6, మాథ్యూ షార్ట్‌ (బి) బుమ్రా 0, జేవియర్‌ బార్ట్‌లెట్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (13.2 ఓవర్లలో 6 వికెట్లకు) 126.
వికెట్ల పతనం : 1-51, 2-87, 3-112, 4-112, 5-124.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 4-0-26-2, హర్షిత్‌ రానా 2-0-27-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-23-2, కుల్‌దీప్‌ యాదవ్‌ 3.2-0-45-2.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -