Thursday, February 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త ప్రయాణానికి నాంది

సరికొత్త ప్రయాణానికి నాంది

- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారతీయ సినీ పరిశ్రమకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశంలో అత్యాధునిక మోషన్‌ క్యాప్చర్‌ సదుపాయాన్ని ఆవిష్కరిస్తూ, భారతీయ సినిమాల సృజనాత్మకతకు, సాంకేతికతకు కొత్త దిశను చూపింది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌, ప్రొడ్యూసర్‌ శోభు యార్లగడ్డ స్థాపించిన మిహిరా విజువల్‌ ల్యాబ్స్‌ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీకి ‘ఏఅండ్‌ఎం మోక్యాప్‌ ల్యాబ్‌’ అని పేరు పెట్టారు. హాలీవుడ్‌లో ప్రముఖ మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ భాగస్వామి అయిన అనిమాట్రిక్‌ ఫిల్మ్‌ డిజైన్‌ ఈ ల్యాబ్‌కు సాంకేతిక శక్తిని అందించింది. ఈనెల 20న దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేతుల మీదుగా ఈ ఫెసిలిటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం ‘వారణాసి’లో కీలక సన్నివేశాలను ఈ మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో చిత్రీకరించినట్టు ఆయన వెల్లడించారు.

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారతదేశపు మొదటి డాల్బీ సినిమా ప్రాసెసింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించిన రాజమౌళి, ఈ మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ దేశీయ దర్శకులకు కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇప్పటివరకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. ‘బాహుబలి, ఈగ’ వంటి సినిమాల సమయంలో ఈ సదుపాయం భారత్‌లో ఉంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దేవాళ్లమని అనిపిస్తోంది. ఇప్పుడు ఆ లోటు తీరింది అని రాజమళి చెప్పారు. నాగార్జున అక్కినేని మాట్లాడుతూ,’భారతీయ సినిమా ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టం. ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనే కల భారతీయ దర్శకులకు ఎప్పటి నుంచో ఉంది. కానీ అత్యాధునిక సాంకేతిక వసతులు కొరతగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్‌ అడ్వెంచర్‌ నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చు’ అని అన్నారు. ‘భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే దేశంలోనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలు అవసరం’ అని శోభు యార్లగడ్డ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -