రెగ్యులరైన తేదీ నుంచే కాంట్రాక్ట్ ఉద్యోగుల స్కేల్ గుర్తింపు
స్పెషల్ మెన్షన్‌లో పలు సమస్యలను ప్రస్తావించిన సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21 సవరణ బిల్లు (ముగ్గురి పిల్లల నిబంధన)ను శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ మంగళవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క బిల్లును ప్రవేశపెట్టారు. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు గతంలో ఉన్న 1.7 రేష్యూయోను ప్రస్తుతం 2.1గా మార్చామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల ముందే ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా చాలా మంది పోటీ చేశారని గుర్తు చేశారు. బిల్లుపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేని నిబంధనల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పెట్టడం వల్ల 30 ఏండ్ల పాటు అనేక మంది నష్ట పోయారని అభిప్రాయపడ్డారు. సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సభ్యులు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ నిబంధన వల్ల గతంలో తాను కూడా ఇబ్బందులు పడ్డానని గుర్తు చేశారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ చిన్నారెడ్డి ముత్తాత పేరున గతంలో ఉన్న జయంతి తిరుమలాపూర్‌ను పేరును యధాతంగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సభ అమోదించింది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయిమెంట్స్ టూ పబ్లిక్ సర్వీసెస్ అండ్ పే స్ట్రక్చర్ అమెండ్‌మెంట్ బిల్లును సభ అమోదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులరైన కాంట్రాక్ట్ ఉద్యోగులను తాము జాయిన అయిన తేదీ నుంచి కాకుండా రెగ్యులర్ చేసిన తేది నుంచి గుర్తించనున్నట్టు తెలిపారు. పక్క రాష్ట్రం ఏపీలోనూ ఈ సమస్య తలెత్తినప్పుడు వారు కూడా ప్రత్యేకంగా బిల్లును తెచ్చి పరిష్కరించారని సభకు తెలిపారు. అందెశ్రీ కుమారునికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశ పెట్టిన బిల్లును మండలి ఆమోదించింది. అనంతరం జరిగిన స్పెషల్ మెన్షన్‌లో పలువురు సభ్యులు వివిధ సమస్యలను ప్రస్తావించారు.
2024 ఏడాదికి సంబంధించి వేర్‌హౌస్ విభాగం నివేదికను టేబుల్ చేయడాన్ని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తప్పుపట్టారు. గిరిజన పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని టీచర్స్‌్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్రంలో అరుదైన తెగ అయిన తుర్క కాశీలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం కోరారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న 41 లక్షల మంది కార్మికులకు భీమా కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పాఠశాలల్లో పీఈటీల ఖాళీలు భర్తీ చేయాలని బీజేపీ సభ్యులు మల్క కొంరయ్య, చేవెళ్ల మండలంలో టీజీఐసీసీ సేకరించిన 3 వేల ఎకరాల భూములకు సంబంధించిన రైతులకు ఇచ్చిన ఒక ఫ్లాట్, ఇంటికో ఉద్యోగం హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్నం మహేందర్‌రెడ్డి, గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కేతావత్ శంకర్ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్న మంత్రి అజహరుద్దీన్ సంబంధిత శాఖలకు నివేదిస్తానని తెలిపారు. అనంతరం మంగళవారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాశ్ ప్రకటించారు.
ముగ్గురి పిల్లల నిబంధన బిల్లుకు మండలి ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



