Sunday, March 22, 2026
E-PAPER
Homeకవితభావోద్వేగాల పుట్టిల్లు

భావోద్వేగాల పుట్టిల్లు

- Advertisement -

తొలినాళ్ళలో మనందరికీ
వేసవి విడిదంటే తొలుత గుర్తొచ్చేది
అమ్మమ్మగారిల్లే…!
పట్టరాని ఆనందానికి కేంద్రీకతమై
స్వర్గధామంలా నిలిచి
మాలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసేది
అమ్మమ్మ చీర కొంగుముడిలో
దాచుకున్న రూపాయి బిళ్ళ
మన చేతిలో పడిందంటే చాలు
ఆరోజంతా ఓ పండుగే
ఏదో సాధించామని ధీమా ముఖం వెలిగిపోయేది
కలిపిన పెరుగన్నంతోపాటు
అమ్మమ్మ చెప్పే కోతి కొమ్మచ్చి
కథలతో మా కడుపు నిండిపోయేది
ఇంటి అరగునేలపై అలా తల ఆనించగానే
నిద్రలో జారిపోయేవాళ్ళం మనకు
తెలియకుండానే !
ఏదొక ఆకతాయి పనిచేసి
అమ్మమ్మ చేత చివాట్లు తినడమంటే
అదో సరదా…! అమ్మమ్మ
మా తలపై చేయేసి నిమురుతుంటే
మా పెదాలపై ఓ చిక్కని చిరునవ్వు కాసేది
అమ్మ తరపున ఏదైనా ఆస్తి,ఉందంటే
అది ఒక్క మన అమ్మమ్మగారిల్లే….!
అందులో ఇమిడిన మరువని
ఆప్యాయనుగురాగాలు!వాళ్లతో గడిపిన సమయమే
ప్రతి తరానికి అమ్మమ్మగారిల్లంటే
ఓ భావోద్వేగాల సంకేతం
విడదీయరాని అనుబంధం
పచ్చని మమతను పంచే ఓ ఉద్యానవనం
నిర్మలమైన ప్రశాంతతకు చిరునామా
అమ్మ చూపించే ప్రేమను
అమ్మమ్మలో చూసి మురిసిపోయేటోళ్ళం.
ఆ క్షణాలను తలుచుకుంటే
ఇప్పటికీ మా కనురెప్పలు కన్నీళ్ళలో
తడిచిపోతుంటాయి ఒక్కోసారి …!

-ఎం రాజశేఖర్‌ ఆదోని, 9381004519

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -