– కార్మిక, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోడీ : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-నయీంనగర్
బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారుల సేవలోనే ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా రామ్‌నగర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం టి.ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని, ప్రజలను శ్రమ దోపిడీ చేస్తోందని విమర్శించారు. ధనికులు, పేదల మధ్య తీవ్ర అంతరాలు పెరుగుతున్నాయని, దీనికి మోడీ అనుసరిస్తున్న సరళీకరణ, ఆర్థిక విధానాలే కారణమని అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి కార్మిక వర్గంపై, రైతాంగంపై దాడి తీవ్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను మారుస్తూ, పెట్టుబడిదారులు యథేచ్చగా కార్మిక శ్రమను దోచుకునే విధంగా కార్మిక కోడ్‌లకు రూపకల్పన చేశారని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడుదారులకు అమ్మేస్తున్నారని తెలిపారు. దేశ సంపదను కొల్లగొట్టే విధంగా చట్టాలను మారుస్తున్నారని, ఖనిజ సంపదను మొత్తం అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పనంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, వీబీజీఆర్‌ఏఎం(జీ) పథకాన్ని రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, నాయకులు జి.ప్రభాకర్ రెడ్డి, బొల్లారపు సంపత్, సంగాల మొగిలి, శ్రీనివాస్, బరుపట్ల మహేష్, మెట్టు రవి, డి.భాను నాయక్ పాల్గొన్నారు.
పెట్టుబడిదారుల సేవలో బీజేపీ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



