స్వాతంత్య్రోద్యమంలో దాని పాత్రే లేదు
ఐక్య పోరాటాల ఆవశ్యకత పెరిగింది : ”వందేండ్ల సీపీఐ స్ఫూర్తి సభ”లో పల్లా వెంకటరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ రాజకీయ లబ్ది కోసం బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని నారాయణ గూడ మార్వెన్ పంక్షన్ హాల్లో సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా ‘సీపీఐ త్యాగాల, విజయాల స్ఫూర్తి సభ’ జిల్లా కార్యదర్శి స్టాలిన్ అధ్యక్షతన జరిగింది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీపీఐ జెండాను పల్లా వెంకట రెడ్డి ఆవిష్కరించి అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలోనూ, హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం సందర్భంగా జరిగిన పోరాటాల్లోనూ బీజేపీ ఎక్కడున్నదని ప్రశ్నించారు.
ఆ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీకి గణనీయమైన చరిత్ర ఉన్నదని వివరించారు. కమ్యూనిస్టు పార్టీ లేకపోతే తమకు ఎదురు ఉండదనే ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం పోరాట, ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ వల్లనే హైదరాబాద్ విలీనమైందని చెప్పటం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మఖ్ధూం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చా రనీ, అప్పటికే పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు ప్రజలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. దీంతో హైదరాబాద్ కమ్యూనిస్టుల వశమౌతుందనే భయంతోనే హైదరాబాద్ విలీనానికి ఒప్పందం జరిగిందని తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వం బ్యాంకులను జాతీయకరణ చేస్తే..మోడీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వం రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జనవరి 18న ఖమ్మంలో జరగబోయే సీపీఐ శతాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈటీ నర్సింహా మాట్లాడుతూ చరిత్రలో బీజేపీకి, ఎంఐఎంకు స్థానమే లేదని విమ ర్శించారు. ప్రధాని మోడీ అబద్ధాలను ప్రచారం చేస్తే.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం మొత్తం తిరిగి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో మోడీని 60 లక్షల మంది తిరస్కరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహా, వి.ఎస్.బోస్, కార్యవర్గ సభ్యులు ఎస్.చాయాదేవి, ఎ.రవీంద్ర చారి, సీనియర్ నాయకులు డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి పి.ప్రేమ్ పావని, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి నేదునూరి జ్యోతి, నాయకురాలు ఆరుట్ల సుశీల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఇ.ఉమామహేశ్, హైదరాబాద్ సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.
భారీ ప్రదర్శన
సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా హిమాయత్‌నగర్ ఏఐటీయూసీి రాష్ట్ర కార్యాలయం సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి నారాయణగూడలోని మార్వేల్ ఫంక్షన్ హాల్ వరకు ఎర్రజెండాలతో
భారీ ర్యాలీ నిర్వహించారు.



