అసోం సభలో రాహుల్ గాంధీ విమర్శ
గౌహతీ : ప్రజల మధ్యన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ విద్వేషం వ్యాప్తి చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో అసోంలోని బిశ్వనాథ్ చరియాలీలో ఆదివారం నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను విద్వేషం విరజిమ్మే నేతగా ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే.. హిమంత క్షమాపణలు కోరినా.. వదిలిపెట్టబోమని, చట్టపరంగా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని రాహుల్ అన్నారు. హిమంతను దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా రాహుల్ పేర్కొన్నారు. అసోంకు చెందిన సుప్రసిద్ధ గాయకుడు, కీర్తిశేషులు జుబిన్ గర్గ్.. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదన్నారు.
తమ కాంగ్రెస్ పార్టీ భావజాలం కూడా అలాంటిదేనని, ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే తమ సిద్ధాంతమని తెలిపారు. అస్సాంలో తాము అధికారంలోకి వస్తే.. జుబిన్ మృతి కేసులో దోషులను 100 రోజుల్లోగా శిక్షిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు సామాజిక తరగతులకు షెడ్యూలు తెగ (ఎస్టీ) హోదా ఇస్తామని, తేయాకు కార్మికులకు రోజుకు రూ.450 చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిమంత నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. హిమంత అవినీతి చిట్టా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ఉందన్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారని, రాష్ట్రాన్ని బీజేపీ ఏటీఎంగా మార్చేశారని విమర్శించారు.



