Sunday, February 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపార్లమెంటులో కమలం కపట నాటకం

పార్లమెంటులో కమలం కపట నాటకం

- Advertisement -

దేశాన్ని కుదిపేసే తీవ్ర పరిణామాలు జరుగుతున్నా అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు మాత్రం వాటిని చర్చించే అవకాశం లేకుండా పోవడమే మోడీస్వామ్యం. ఈ వారం ఉభయసభల్లో ప్రకంపనాలే ఇందుకు నిదర్శనం. ప్రజాస్వామికంగా ప్రతిపక్షాలకు ఉండే చోటులేకుండా చేయడం, నయానో భయానో ప్రాంతీయ పార్టీలన్నిటినీ పోగేసుకుని సర్కారు నడిపించడం బీజేపీ, ఆరెస్సెస్‌ల ఏకైక సూత్రంగా మారింది. తమతమ నీతిబాహ్య నిర్వాకాల కారణంగా మోడీ త్రిశూల వ్యూహం ఉచ్చులో చిక్కిన చాలామంది ప్రాంతీయ పార్టీల నేతలు,వారెంత కొమ్ములు తిరిగినవారైనా నోరెత్తి అడగలేని, అనలేని పరిస్థితి.

ప్రధానమంత్రి ఆయన సన్నిహిత వలయంలోని అరడజను మంది పార్లమెంటులో పద విన్యాసాలు చేస్తుంటారు. సూక్తులు వల్లిస్తుంటారు. సభలో ఏదైనా తేడా వస్తే నిబంధనల చక్రం అడ్డువేయడానికి తమ వారినే పీఠాలపై కూచోబెడుతుంటారు గనక సమస్యేమీ వుండదు. మోడీ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా మాటున దాక్కున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యకు అర్థమదే. ప్రజల సభ, పెద్దల సభ అన్న తేడా లేకుండా ఈసారి రెండుచోట్లా ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం నిరాకరించడం ఇందుకు పరాకాష్ట.క్యాబినెట్‌ హోదాతో రాజ్యాంగబద్ద పదవిలోని వారికే అవకాశం ఇవ్వకపోతే ఇక ఇతర ప్రతిపక్షాలకు ఏముంటుంది? సమాన గౌరవంతో నడవాల్సిన ప్రతిపక్షాన్ని బొత్తిగా బేఖాతర్‌ చేశాక ఇక ఆ చర్చలకూ సభల్లో ప్రజాస్వామ్యం ఏం మిగులుతుంది?

లోగుట్టు ఏంటి?
వాస్తవానికి సభల్లోనే కాదు, మొత్తంగా దేశ వ్యవహారాల నిర్వహణపైనే ఈ సందేహం చాలామందికి కలిగింది.నిరసనా వ్యక్తమైంది, ఇంకా చెప్పాలంటే దేశవ్యవహారాలే గాక అంతర్జాతీయ సంబంధాల్లోనూ ఇష్టా రాజ్యమైంది. హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టిఎ) కుదిరిందని తన స్వంత వేదిక ట్రూత్‌ నుంచి ప్రకటించారు. వెంటనే ప్రధానమంత్రి 140 కోట్ల భారతీ యుల తరపున తన ప్రియమైన గొప్ప స్నేహితుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపి పరవశించిపోయారు. చర్చలు ఎక్కడ జరిగాయో ఎవరు చేశారో ట్రంప్‌కు ఇద్దరి తరపున ఏకపక్షంగా ప్రకటన చేసే అధికారం ఎవరిచ్చారో తెలియదు! ఈ చర్చల తర్వాత ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తుందని కూడా అమెరికా అధ్యక్షుడే ప్రకటిస్తారు.

వెనిజులాలో తాము దుర్మార్గంగా చేజిక్కించుకున్న చమురునే ఇండియా తీసుకుంటుందని కూడా చెప్పేస్తారు. 2025 ఏప్రిల్‌ నుంచి ఇరుదేశాలు మాట్లాడుతున్నా కుదరని డీల్‌ ఇలా ఆగమేఘాల మీద ఎలా కుదిరింది? మోడీ తనను సంతోషపెట్టడానికి చాలా చేశారు గానీ, ఇంకా చేయాలని ట్రంప్‌ మాట్లాడ్డం, ఆయన తమ అధ్యక్షుడికి ఒక్క ఫోన్‌చేస్తే అంతా అయిపోతుందని అమెరికా అధికా రులు షరతు పెట్టడం భారతదేశ ఆత్మగౌరవానికే భంగకరంగా పరిణమించింది. ఇప్పుడేమో బర్రెను చెరువులో పెట్టి బేరమాడినట్టు ఏమీ బయట పెట్టకుండా ట్రంప్‌ ఒకపోస్టు పెట్టగానే మోడీ ధన్యోస్మి అనడం ఆ షరతుకు లోబడటమే కాదా?ఈ విధంగా లోబడి పోవడమే పెద్ద దౌత్యనీతిగా చిత్రిస్తూ మోడీ ట్రంప్‌ను దారికి తెచ్చేసినట్టు బడామీడియా బాజాబజంత్రీలు అందుకోవడం మరీ వింతకదా?

పార్లమెంటుకు తెలియకుండానే..
దేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా, సభకు తెలియకుండా అమెరికా అధ్యక్షుడి ప్రకటనద్వారా వాణిజ్య ఒప్పందం గురించి అదీ అసంపూర్ణంగా తెలసుకోవడం కంటే దాన్ని కించపర్చడం ఏముంటుంది? ఆ తర్వాత కూడా మోడీ ముందు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. సభలో వాణిజ్యశాఖామంత్రి పీయుష్‌ గోయల్‌ అరకొర ప్రకటన చేసి మమ అనిపించారు. బయటమాత్రం ఆయనా రెచ్చిపోయి పొగిడేస్తున్నారు. దీనికన్నా ముందు ఈయుతో కుదర్చుకున్న ఒప్పందమే నష్టదాయకంగా వుంటే గొప్ప వరప్రసాదమన్నట్టు చిత్రించారు. అమెరికాతో ఒప్పందం సంగతి అంతకంటే ఘోరం.వ్యాపారస్తుడు ఏదైనా అమ్మాలనుకుంటే ముందు రేటు అమాంతం పెంచి తర్వాత పదో పరకో తగ్గించి పెద్ద రిబేట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ అంటాడు. ట్రంప్‌ ఇష్టానుసారం టారిఫ్‌లు పెంచేసి దాంట్లో కొంత తగ్గించాననగానే మురిసిపోవడం అవివేకమే.

2025 ఏప్రిల్‌లో జరిగిన సీపీఐ(ఎం) మహాసభ ఈ ఒప్పందం నష్టదాయకమని హెచ్చరిస్తూ తీర్మానమే ఆమోదించింది. వ్యవసాయానికి దానివల్ల కలిగే నష్టాలనూ వెల్లడించింది. ఇప్పటికే మన రైతాంగం అవస్తలు చూస్తున్నాం. ఈ స్థితిలో అమెరికా ఉత్పత్తులు దిగిపోతే ఎలా వుంటుందో ఊహించుకోవలసిందే. దాంట్లో వ్యవసాయానికి రక్షణ కల్పించామని చెబుతున్నారు గాని దాన్ని ఎవరూ పెద్ద విశ్వసించడం లేదు. మార్చిలోనో, ఏప్రిల్‌లోనో ఒప్పందం పూర్తయ్యేలోగా మరెన్ని షాకులిస్తారో ఎవరు చెప్పగలరు? అమెరికాకు డెబ్బయి శాతం ఎగుమతులు చేసే కెనడా మెక్సికో వంటి దేశాలే ఒక పట్టాన ఒప్పుకోవడం లేదు గానీ మోడీ సర్కారు మాత్రం మహా హడావుడిగా లోబడిపోయింది. వెంటనే అమెరికానుంచి 500 బిలియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులను అనుమతించాలి.

వారి సరుకులపై టారిఫ్‌ సున్నా శాతానికి తగ్గించాలి.మనపైన మాత్రం పద్దెనిమిది శాతం భరించాలి. అందుకే దీన్ని అసమతుల్య ఒప్పందం అంటున్నారు. టెక్స్‌టైల్స్‌ వంటి వాటి ఎగుమతులకు అవకాశం వస్తుందని ఊరిస్తున్నారు గానీ ఆ మేరకు మన ఫార్మా వంటివాటికి కలిగే తీవ్రనష్టం మాటేంటి?పార్లమెంటు ముందు ఈ వివరాలన్నీ మాట్లాడకుండా దాటేసి దాగుడు మూతలాడటం దారుణం. సౌరవిద్యుత్‌ ఒప్పందాల కోసం అదానీ కంపెనీ ముడుపుల గురించి అమెరికా కోర్టు నోటీసునివ్వడం, ఎపిస్టిన్‌ టేపుల్లో మోడీ, అనిల్‌ అంబానీ వంటివారి పేర్లు ప్రస్తావనకు రావడం ఈ హడావుడి ఒప్పందానికి ఒక కారణమని అంతర్జాతీయ మీడియాతో సహా చెబుతున్న దానిపై నిగూఢ నిశ్శబ్దం.

నరవాణే పుస్తకం సాకుతో
పార్లమెంటులో ఇవన్నీ చర్చకు రాకుండా చేయడానికే మోడీ బృందం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది.ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ చైనాతో డోక్లామ్‌, గల్వాన్‌ ఘర్షణలపై మాజీ ప్రధాన సైన్యాధికారి జనరల్‌ నరవాణే రాసిన జ్ఞాపకాలను చదవి వినిపించడం మహాపరాధమని అమిత్‌ షాతో సహా కేంద్రమంత్రులు గగ్గోలు పెట్టారు. భారత-చైనా సరిహద్దు సంఘర్షణలు దురదృష్టకరమైనవనీ, వాటిని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని ఎప్పుడూ అనుకుంటున్నదే, ఇటీవల ఆ విధమైన చొరవలో ప్రగతి కనిపిస్తున్నది కూడా. అయితే 2020లో ఈ ఘర్షణ జరిగినప్పుడు మోడీ ప్రభుత్వం, అంతకుమించి సంఘ పరివార్‌,వారి మీడియా ఉద్వేగాలు పెంచినతీరు అందరికీ గుర్తుంది. కానీ, లోపల వాస్తవాలు వేరన్నది నరవాణే చెబుతున్న వాస్తవ చరిత్ర. ఆయన కన్నా ముందు సైన్యాధికారిగా పనిచేసిన బిపిన్‌ రావత్‌ జ్ఞాపకాలు వెలువడ్డాయి, వాటిని ఆవిష్కరించే సందర్భంలోనే ఎవరో ప్రచురణకర్తలు అడిగితే నవరాణే రాశారు.

ఇప్పటికి సైన్యాధికారులు రాసిన 35 పుస్తకాలు ప్రచురితమైనాయి గనక అదేమీ నిషేదం కాదు.ఈయన చెప్పే సంగతులు తమ గొప్పలకు అనుకూలంగా లేవు గనకే కేంద్రం అడ్డుపుల్ల వేసింది. దాంతో ఆయన కల్పనాకథగా నవల విడుదల చేశారు. నేరుగా ఆయన జ్ఞాపకాలు కూడా కారవాన్‌ మాసపత్రికలో వచ్చాయి. అంటే ఇప్పటికే ప్రజల చేతుల్లోకి వచ్చిన సమాచారాన్ని రాహుల్‌గాంధీ చదవకూడదని సీనియర్‌ మంత్రులతో పాటు సభాపతి కూడా అడ్డుపడ్డారు, రెండు రోజుల సభను వాయిదాలు వేశారు. దీనికి పోటీగా ఒకనాటి బోఫోర్స్‌ కుంభకోణం పుస్తకాన్ని పోటీకి తెచ్చారు. ఇటు అమెరికా ఒప్పందం హడావుడి, అటు చైనాతో సంఘర్షణ సమయంలో మోడీ తీరు వీటిపై చర్చను అడ్డుకోవడం తప్ప ఇందుకు మరో కారణం లేదు. రాహుల్‌ ఏం చెబుతారు, దాంతో ఏకీభవించడం లేకపోవడం తర్వాత.

రాజ్యసభలో ఆక్రోశం
ఇదే కోవలో మరుసటి రోజు జరిగింది మరింత దారుణం.ప్రతిపక్ష మహిళా ఎంపీలు లోక్‌సభలో ప్రధాని స్థానం ముందు నిల్చుని నిరసన తెలిపారట. ఆ సమయంలో ప్రధాని లేరనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి.ఆ స్థానం అధికార పక్షంవైపు ముందు వరసలో వుంటుంది,(ట్రెజరీ బెంచెస్‌) కనక అక్కడ నిలుచోవడమే గాని లేని ప్రధానిని అడ్డుకోవడమేమిటి? ఆ పేరుతో పాలకపార్టీ రచ్చ చేయడ మేమిటి? ఆ రచ్చలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాన ప్రసంగం రద్దు కావదమేమిటి? ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవే. ప్రధానికి నిరసన తెలుపాలనుకుంటున్నట్టు తనకు తెలిసింది గనకనే సభను వాయిదా వేశానని స్పీకర్‌ విచిత్రమైన వివరణ ఇచ్చారు.

దీనితర్వాత రాజ్యసభలోనూ ఇదే తంతు. ప్రతిపక్షనాయకుడికే మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్‌ ఖర్గే ప్రస్తావన చేస్తే మరోసభ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదంటూ అడ్డుతగిలారు చైర్మన్‌ రాధాకృష్ణన్‌. రాహుల్‌ అబోధ బాలక్‌ అంటూ ఆయన్ను నమ్ముకుని ప్రతిపక్షం గొడవ చేస్తున్నదని జెపి నడ్డా దాడికి దిగారు. ప్రతిపక్షం ఉనికినే సహించలేని ఈ ధోరణిని నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ వాకౌట్‌ చేశాక రాజ్యాంగ పరంగా ఇబ్బంది రాకుండా మోడీ రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడారు. తమ గుజరాతీ అయిన గాంధీ ఇంటిపేరు దొంగిలించారనే అర్థరహిత ఆరోపణ నుంచి డిఎంకె, సీపీఐ(ఎం) నడిపే రాష్ట్ర ప్రభుత్వాల వరకూ అనేక విధాల దాడి చేశారాయన. నెహ్రూ, ఇందిర ప్రజలను సమస్యలుగా భావించారని తిట్టిపోశారు. ప్రతిపక్షాలు తన సమాధి తవ్వాలనుకుంటున్నాయని ఆక్రోశించారు. అమెరికాతో ఒప్పందపై అధికారికంగా ఏమీ మాట్లాడని మోడీ వాళ్ల హయాంలో ఒప్పందాలు ఎందుకు కుదరలేదని తలకిందులుగా వాదించారు.ఆ ప్రసంగం మొత్తం ప్రతిదాడి తప్ప ప్రధాని హోదాకు తగింది ఒక్కమాట లేదు.

గతంలోనూ 370 రద్దు, పెద్దనోట్ల రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, జమిలి ఎన్నికల కమిటీ,ఆపరేషన్‌ సిందూర్‌, సర్‌ తొలగింపులు, వంటివాటిపై సభలో చర్చ సమాధానం లేకుండానే జరిగిపోయింది. 2024 ఎన్నికల్లో మెజార్టీ కోల్పోయినప్పటికీ బీజేపీ పోకడలలో మార్పురాలేదు. మూడోసారి తిరిగివచ్చిన మోడీ చేసిందేమీ లేదుగాని హిందూత్వ రాజకీయాలు తీవ్రం చేశారని చరిత్రకారుడు రామచంద్రగుహ వ్యాఖ్యానించారు. దాంతో పాటు దేశ విదేశీ సూపర్‌ కార్పొరేట్‌ శక్తులకు తగినట్టు విశృంఖల నిర్ణయాలకు పాల్పడటం కనిపిస్తుంది. వాటిని ప్రశ్నించకుండా చేసేందుకే పార్లమెంటును ప్రహసనంగా మార్చేసి ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారనేది కనిపిస్తున్న సత్యం. వచ్చే దఫా శాసనసభ ఎన్నికల రీత్యా కూడా మోడీ సర్కారు నిరంకుశదాడి పెంచుతున్నదనేది వాస్తవం. అయితే ఇదేమీ నల్లేరు మీద బండిలా సాగబోదని దేశమంతటా వినిపించిన విమర్శలు, నిరసనలు చాటిచెబుతున్నాయి.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -