మణిపూర్‌లో చల్లారని కుకీ-జో అశాంతి
కాషాయపార్టీ అధికార భాగస్వామ్య ఫార్ములా ఫెయిల్
రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కుకీ-జో కౌన్సిల్
కొత్త ప్రభుత్వంపై అపనమ్మకం
పదవులు పంచితే శాంతి రాదు
డిప్యూటీ సీఎంగా కిప్‌జెన్ ఎంపికను ద్రోహంగా భావిస్తున్న కుకీ-జో ప్రజలు
సమస్య మరింత పెరిగింది : రాజకీయ పరిశీలకులు
మణిపూర్‌లో కొత్త సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాక చురాచంద్‌పూర్‌లో నిరసనలు మొదలయ్యాయి. అంటే, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా ఆ కోపం తగ్గలేదని స్పష్టమవుతున్నది. బీజేపీ ఇటీవల మెయిటీ వర్గానికి చెందిన యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్‌ను సీఎంగా చేసింది. ఇది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టిన దాదాపు ఏడాది తర్వాత జరగటం గమనార్హం. మాజీ సీఎం ఎన్.బీరెన్ సింగ్ మెయిటీ-కుకీ జో జాతి ఘర్షణలను అదుపుచేయలేపోయారనే విమర్శలు రావడంతో గతేడాది ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసిన విషయం విదితమే.
న్యూఢిల్లీ : బీజేపీ వేర్వేరు వర్గాల వారికి పదవులు ఇవ్వడం ద్వారా ప్రజలలో అసంతృప్తిని శాంతింపజేయాలనే పాత ఫార్ములాను ఉపయోగించింది. ప్రస్తుతం సీఎం మెయిటీ వర్గానికి చెందినవారు కాగా… డిప్యూటీ సీఎంలు నెమ్చా కిప్‌జెన్ కుకీ-జో, లోసి దిఖో.. నాగ కమ్యూనిటీకి చెందినవారు. ముఖ్యంగా కిప్‌జెన్‌ను శాంతి వైపు తీసుకెళ్లే సాధనంగా, రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ప్రచారం చేశారు. కానీ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కూడా విఫలమైందని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు.. సంఘర్షణ మరింత పెరిగే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. చురాచంద్‌పూర్, ఢిల్లీలో జరిగిన నిరసనలు దీనికి నిదర్శనంగా వారు చెప్తున్నారు.
మాకు కావాల్సింది స్వయం పాలన : కుకీ జో కౌన్సిల్
కొండ ప్రాంతాలకు స్వయం పాలన ఇవ్వకుండా రాజకీయ పరిష్కారం ఉండదని కుకీ-జో కౌన్సిల్ ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే కిప్‌జెన్ నాయకత్వాన్ని తిరస్కరించింది. ఆమె రాజీనామానూ కోరింది. ఉప ముఖ్యమంత్రిగా ఆమె నియామకం మెయిటీల చేతుల్లో జరిగిన హింసను అనుభవించిన ప్రజల భావోద్వేగాలకు జరిగిన ద్రోహంగా కుకీ-జో కౌన్సిల్ ప్రతినిధి ఒకరు అభివర్ణించారు.
కుకీ-జో ఎమ్మెల్యేలు ఒక్కరూ అసెంబ్లీకి రాలేదు
దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత సమావేశమైన అసెంబ్లీకి ఒక్క కుకీ-జో ఎమ్మెల్యే కూడా ప్రత్యక్షంగా హాజరు కాకపోవడం గమనార్హం. పది మంది కుకీ-జో ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందినవారే. కానీ ముగ్గురు మాత్రమే ప్రభుత్వానికి మద్దతిచ్చారు. అయితే ప్రభుత్వానికి మద్దతిచ్చిన కుకీ-జో ఎమ్మెల్యేల నిర్ణయాన్ని ఆ వర్గం ప్రజలు ద్రోహంగా చూస్తున్నారు. 2023 మేలో అల్లర్లు చెలరేగినప్పటిక నుంచి కుకీ-జో ఎమ్మెల్యేలే రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు వెళ్లలేకపోతున్నారు. అక్కడ మెయిటీల ఆధిపత్యం ఉండటమే దీనికి కారణం.
వర్చువల్‌గా కిప్‌జెన్ ప్రమాణస్వీకరం చట్టబద్ధమేనా?
డిప్యూటీ సీఎంగా వర్చువల్ మోడ్‌లో ప్రమాణస్వీకారం చేసిన కిప్‌జెన్ చర్యను రాజకీయ పరిశీలకులు తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రమాణస్వీకారం హాస్యాస్పదమని పార్లమెంటరీ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ పి.డి.టి ఆచారి అన్నారు. ఇది చట్టబద్ధమా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వర్చువల్ ప్రపంచంలో నకిలీలు పెరిగాయనీ, అలాంటప్పుడు నిజంగా ప్రమాణం చేసింది ఆ వ్యక్తేనా అని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చుని మంత్రి ఎలా పని చేస్తారు? రాష్ట్రానికి రాకపోతే ఆ పదవికి అర్థమేంటి? అని పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అసలు సమస్యలు దాచే ప్రయత్నం
ఈ కొత్త ప్రభుత్వం మెయిటీ-కుకీ-జో సమస్యలను అలాగే ఉంచి అసలు సమస్యలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాము చర్యలు తీసుకున్నామని చూపించే ప్రయత్నం చేసింది. గతేడాది మార్చి 1న అమిత్ షా వచ్చే ఏడాది మార్చి 8 నాటికి రాష్ట్రంలో స్వేచ్ఛా ప్రయాణం ఉండాలని ఆదేశించారు. దాదాపు ఏడాది గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాకపోవడం గమనార్హం.
కుకీ-జోలు ఇంఫాల్‌కు రాలేరు, మెయితీలకు కొండ ప్రాంతాలకు వెళ్లలేరు. ఇప్పటికీ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 270 మందికి పైగా మరణించగా.. 60 వేల మందికి పైగా శరణార్థి శిబిరాల్లోనే ఉన్నారు. వారిని తిరిగి వారి గ్రామాలకు పంపిస్తామని ప్రభుత్వం చెప్పినా.. అది ఇప్పటికీ అమలు కాలేదు. అమిత్ షా సన్నిహితుడు అజయ్ కుమార్ భల్లాను గవర్నర్‌గా పంపినా శాంతి పరిస్థితులు నెలకొనలేదు. ప్రధాని మోడీ రెండేండ్ల తర్వాత గతేడాది సెప్టెంబర్ 13న మణిపూర్‌కు వచ్చారు.
కొత్త ప్రభుత్వంపై కుకీ-జోల్లో అపనమ్మకం
కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుకీ-జోల్లో మరింత అపనమ్మకాన్ని పెంచింది. స్వయం పాలన కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని కుకీ-జో కౌన్సిల్ చెప్తోంది. ఈ మేరకు కిప్‌జెన్ రాజీనామా కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం నిజమైన చర్చలు జరపకపోవడం.. బీజేపీ ఫార్ములా విఫలమవ్వడానికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు. మణిపూర్ సమస్యలో రాజకీయ పదవుల పంపకం పరిష్కారం కాదనీ, నిజమైన చర్చలు, భద్రత, న్యాయం అవసరమని వారు వివరిస్తున్నారు.
కిప్‌జెన్ ఎంపిక బీజేపీ రాజకీయ ఎత్తుగడ
అధికార కూటమికి పది మంది కుకీ-జో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముగ్గురు మాత్రమే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి కిప్‌జెన్ డిప్యూటీ సీఎం కావడం ఆమె వ్యక్తిగత నిర్ణయం, బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా చూడాలే తప్పితే.. జాతి సంఘర్షణను చల్లార్చే చర్యగా చూడాల్సిన పని లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా నియమితులైన కిప్‌జెన్.. ప్రమాణ స్వీకారానికి కూడా రాలేకపోవటం గమనార్హం. ఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్‌గా ఆమె ప్రమాణస్వీకారం చేశారు.
ఇలా జరగటం చరిత్రలో తొలిసారి అంటూ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. పూర్తిగా వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడలేకపోయారు. ఇక అసెంబ్లీలో విశ్వాస తీర్మానం కూడా అదే విధంగా సాగింది. ప్రభుత్వానికి మద్దతిచ్చిన కుకీ-జో ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ రాకుండా.. వర్చువల్‌గా మాత్రమే పాల్గొన్నారు. ఈ విశ్వాస పరీక్షలో బీజేపీ.. కాంగ్రెస్ మాజీ సీఎం ఇబోబి సింగ్‌ను కలుపుకొని వాయిస్ ఓటుతో విశ్వాస తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్నది.



