Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమళ్లీ వెట్టిచాకిరీని తేవాలన్నదే బీజేపీ లక్ష్యం

మళ్లీ వెట్టిచాకిరీని తేవాలన్నదే బీజేపీ లక్ష్యం

- Advertisement -

అందుకే ఉపాధికి ఉరేశారు
కూలీలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం
27 లేదా 28న ఆందోళనలు : మంత్రి సీతక్క


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో మళ్లీ వెట్టిచాకిరీని తేవాలన్నదే కేంద్రంలోని బీజేపీ సర్కారు లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న ఉపాధి హామీ చట్టానికి మోడీ ప్రభుత్వం ఉరేసిందని ఆమె దుయ్యబట్టారు. ఆ చట్టాన్ని రక్షించుకోవాలి, వీబీ జీరామ్‌జీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 27 లేదా 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కూలీలను ఈ ఆందోళనల్లో భాగస్వాములను చేస్తామని తెలిపారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు సైతం ఈ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ… ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దాన్ని కాపాడాలంటూ గ్రామగ్రామాన తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపుతామని వివరించారు.

వలసలు తగ్గించేందుకు, పేదలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలన్న సదుద్దేశంతో యూపీఏ-1 హయాంలో ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అది గిట్టని బీజేపీ… మొదటి నుంచీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వస్తోందని విమర్శించారు. అందులోంచి గాంధీ పేరును తీసేయటం ద్వారా అభినవ గాడ్సేలు ఆయన్ను మరోసారి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు గత పదకొండేండ్ల నుంచి ప్రతీయేటా ఉపాధి పని దినాలను తగ్గిస్తూ వస్తోందని తెలిపారు. పేదలకు పని హక్కును దూరం చేసిందని పేర్కొన్నారు. అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ల మైనింగ్‌ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకే ఉపాధి చట్టాన్ని రద్దు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల ఇప్పటి నుంచి కూలీలకు పని ఉండబోదన్నారు. ఫలితంగా వారు తక్కువ కూలీకే కార్పొరేట్ల పని చేయాల్సి వస్తుందని, శ్రమ దోపిడీకి గురవుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సీతక్క పిలుపునిచ్చారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -