అగర్తల బహిరంగ సభలో సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్
విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలి
కార్పొరేట్లకు గిరిజనుల భూములు.. అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ అణచివేత పాలన, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రజానీకం ఏకం కావాలని సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన భూములు, జీవనోపాధిని గుంజుకుంటుందని విమర్శించారు. ఆ కాషాయపార్టీని అధికారం నుంచి తొలగించడానికి ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ ప్రభుత్వం గిరిజన భూములను ”కార్పొరేట్ షార్క్‌లకు” అప్పగిస్తోందని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతుందని దుయ్యబట్టారు. త్రిపురలోని అగర్తలలో గణ ముక్తి పరిషత్ (జీఎంపీ) 23వ మహాసభ సందర్భంగా గురువారం రవీంద్ర శత వార్షికీ భవన్ ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రజల జీవితాలతో, జీవనోపాధితో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు.
”దేశంలోని గిరిజనులు చాలా కష్టకాలం ఎదుర్కొంటున్నారు. అటవీ హక్కుల చట్టం కింద వారికి కేటాయించిన భూములను, వారి జీవనోపాధిని ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించడానికి లాగేసుకుంటోంది. మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. రాష్ట్రం, కేంద్రం రెండింటి నుంచి విముక్తి కావాలంటే.. బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించేలా చూడాలి” అని బృందా కరత్ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం మత భావ జాలాన్ని అనుసరిస్తోందని, ముఖ్యంగా మహిళలు, అణ గారిన వర్గాలపై వివక్ష చూపుతోందని విమర్శించారు. గణ ముక్తి పరిషత్ మహోజ్వల చరిత్రను, త్రిపుర గిరిజనుల సమస్యల పరిష్కారానికి అది చేసిన గొప్ప సేవను గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు, హింసాత్మక దాడుల కోసం ప్రజలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ అగర్తలా టౌన్ హాల్ పేరును మార్చి, భారతీయ జనసంఫ్‌ు (బీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. ”మొదటగా, డాక్టర్ ముఖర్జీకి డాక్టరేట్ ఉంది కానీ ఆయన వైద్యుడు కాదు, కానీ బీజేపీ ఆయన పేరును అగర్తలా టౌన్ హాల్‌పై తప్పుగా చెక్కించిన తీరు వారి అజ్ఞానాన్ని బయటపెడుతోంది.
రెండోది దేశవ్యాప్తంగా చెన్నై, ముంబయి, కలకత్తా వంటి అనేక ప్రధాన నగరాలలో టౌన్ హాళ్లు ఉన్నాయి. అక్కడ గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగోర్ నోబెల్ బహుమతి గెలుచుకున్న తరువాత సత్కరించారు. ఈ టౌన్ హాళ్లపై నాయకుల పేర్లు రుద్దబడలేదు” అని అన్నారు. చారిత్రాత్మక ప్రదేశంలో నిర్మించిన అగర్తలా టౌన్ హాల్‌ను 1985లో అప్పటి భారత ఉపరాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ ప్రారంభించారని, ఇప్పుడు నాలుగు దశాబ్దాలకు పైగా గడిచిన తరువాత ఈ పేరును మార్చకూడదని ఆయన అన్నారు. ”డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పట్ల బీజేపీకి ఉన్న భక్తిని పూర్తిగా కొత్త భవనాన్ని నిర్మించి, దానికి ఆయన పేరు పెట్టడంతో ప్రదర్శించవచ్చు. అగర్తలా టౌన్ హాల్ పేరును డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ టౌన్ హాల్‌గా మార్చాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. మనం ఆ చరిత్రను, వారసత్వాన్ని అగౌరవపరచకూడదు” అని అన్నారు. బీజేపీ అధికారంలోంచి దిగిపోయిన తరువాత అగర్తలా టౌన్ హాల్‌కు పెట్టిన ఆ పేరు ఉండదని అన్నారు. యథాతథ స్థితి పునరుద్ధరించబడుతుందని, దానికి మళ్లీ అగర్తలా టౌన్ హాల్ అని పేరు పెడతారని ఆయన అన్నారు.
తీర్మానాలు
ఈ అగర్తల టౌన్ హాల్‌లో జరిగిన మహాసభలో 550 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని, కొత్త ఉద్యోగాలు సృష్టించాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిం చాలని మహాసభ డిమాండ్ చేసింది. మెరుగైన వేతనాలతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద 200 రోజుల ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేసింది. గిరిజన స్వయంప్రతిపత్తి కోసం 125వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించాలని, త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తి జిల్లా మండలి (ఏడీసీ), రాష్ట్ర పరిపాలనలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసింది.



