తండోపతండాలుగా యువత,మహిళల రాక
లక్షలాది పుస్తక ప్రియుల ఆదరణ
విద్యార్థుల హడావిడి
ప్రముఖులతో నిండిన మండపం
శోభాయమానంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రస్తుతం పోటీ ప్రపంచం నడుస్తోంది. అందునా డిజిటల్ యుగం మరి. ప్రతి రంగంలోనూ అదే తత్వం కనిపిస్తుంది. సమాజాన్ని పరిశీలిస్తే బోధపడుతుంది. దీనికి సాంకేతికత రంగు అద్దాల్సిందే. తప్పనిసరి కూడా. హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్‌సాగర్ సమీపంలోని భారీ ప్రాంగణంలో పుస్తకాల ఉత్సవం జరుగుతోంది. అదే హైదరాబాద్ బుక్ ఫెయిర్. 38వ పుస్తకాల పండుగ. లక్షల పుస్తకాలకు చిరునామా. ఒకటేమీటీ ఎన్నో రకాలు. కనివిని ఎరుగని కీతాబులు. రంగురంగుల పుటలతో, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్దులు, పిల్లలను ఆకర్షించే పేజీలతో ఎన్టీఆర్‌స్టేడియం అందెశ్రీ ప్రాంగణం కలర్‌ఫుల్‌గా మారింది. వేలాది మంది తమకిష్టమైన పుస్తకాల పేజీలు తిప్పేస్తూ, అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, చర్చాగోష్టులును తిలకిస్తూ సంతోషంగా తినుబండారాలను ఆరగిస్తూ సాయంత్రాలను గడిపేస్తున్నారు.
పుస్తకం అదో విజ్ఞాన ఖని. అజ్ఞానపు పొరలను తొలగించే గని. మనిషిని సన్మార్గం వైపు నడిపించే దిక్సూచీ. ఉరివేస్తున్న చివరి క్షణం వరకు లెనిన్ గురించిన పుస్తకాన్ని చదివాడు భగత్‌సింగ్. ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాలోజీ. అంబేద్కర్ ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు చదవడానికి 30పెట్టెల పుస్తకాలను తెచ్చుకున్నాడు. ‘పుట్టినరోజు నాడు నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే పుస్తకం ఇవ్వండి అన్నాడు’ లెనిన్. పుస్తకం ప్రాముఖ్యత అంతటిది. గొప్పది. సజీవం.
గత పదేండ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. లక్షలాదిగా తరలివస్తున్న పుస్తక ప్రియులతో హైదారాబాద్ మహానగరం ప్రాశస్తయం పొందుతున్నది. పునీతమవుతున్నది. మన విశ్వంలో దేని గురించైనా తెలుసుకునేందుకు ఉపయోగపడేదే పుస్తకం. చరిత్ర, కళలు, సైన్స్, మతం, ప్రకృతి, గణితం, సాంకేతికత గురించి నేర్చుకోవడానికి పుస్తకాలు సహాయపడతాయి. వినోదాన్ని అందిస్తాయి. 1964లో యునెస్కో ‘కనీసం 49 పేజీలతో కూడిన, కవర్ పేజీలు కాకుండా, దేశంలో ప్రచురించబడి ప్రజలకు అందుబాటులో ఉంచబడిన, కాలానుగుణంగా కాకుండా ముద్రించబడిన ప్రచురణ’ అని పుస్తకాన్ని నిర్వచించింది. అలాగే ‘ప్రపంచంలో కనుగొన్న గొప్ప వస్తువు ఏదైనా ఉందీ అంటే అదే పుస్తకం’ అని ప్రముఖ భౌలిక శాస్త్రవేత్త అల్భర్ట్ ఐన్‌స్టీస్ అభిప్రాయం. కాలానుగుణంగా మార్పులు వస్తున్నా పుస్తకం విలువను తగ్గించలేకపోయాయి. అందుకు నిదర్శనమే ఈనెల 19న ప్రారంభమైన బుక్‌ఫెయిర్. ఏడు రోజులుగా కొనసాగుతున్న మహాయజ్ఞం. కథలు, నవలలు, చరిత్ర, డ్రాయింగ్, సాహిత్య పుస్తకాలు ఇక్కడ ప్రత్యేకం.
గత ఏడు రోజుల్లో ఎనిమిది లక్షల మంది పుస్తక ప్రదర్శనను సందర్శించారంటే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ పుస్తకమంతా నిజం. అక్షరాలా నగసత్యం. 368 స్టాళ్లతో అన్నీ సౌకర్యాలతో బుక్ ఫెయిర్ దేదీప్యమానంగా వెలుగుతోంది. రోజురోజుకు ఉత్సాహాంగా ప్రదర్శనకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంగవైకల్యాన్నీ సైతం లెక్కచేయకుండా పుస్తకాలను ఖరీదు చేయడానికి వస్తుండటం గమనార్హం. వృద్ధులు, పిల్లలు, యువకులు, పస్తక ప్రియులు వంటి సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సదుపాయాలను బుక్‌ఫెయిర్ సోసైటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఈసారీ బాలోత్సవం ప్రత్యేకత. పిల్లలకు విజ్ఞానం నేర్పించే కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మూఢనమ్మకాల నుంచి పిల్లలను దూరంగా ఉంచేలా, అవగాహన, చైతన్యం పెంచేలా కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ బుక్‌ఫెయిర్‌ను సందర్శించడానికి ప్రముఖలెందరో వచ్చివెళ్లడం విశేషం. బుక్ ఫెయిర్‌లో రోజుకో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం కొంపెల్లి వెంకట్ గౌడ్ వేదికలో ‘మధనం’ పుస్తకావిష్కరణ చేశారు. బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, ప్రొపెసర్ కాసీం, టీఎస్‌యూటీఎప్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

పుస్తకం ప్రకృతి: కవి జయరాజు
ప్రకృతి అంటే అందం. ఆ అందమే పుస్తకం. సృజన అంటే పుస్తకం. విజ్ఞానపు విస్తృతి పుస్తకం. ఆటవీకం నుంచి నాగరికతకు నడిపేది పుస్తకం. పుస్తకమే ఆయుధం. అదే కొత్త బంగారులోకం. కవుల ఉన్నతికి కారణం పుస్తకం. అక్షరం లేకుండా జయరాజు, అందెశ్రీ, గద్దర్ లేనేలేరు.
రెగ్యులర్‌గా వస్తుంటా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
గత పదేండ్లుగా ఇక్కడికి వస్తున్నా. కుప్పలుకుప్పలుగా పుస్తకాలు కొంటా. సాధ్యమైన మేర చదువుతుంటా. ఇక్కడ ఎన్నో కొత్త కొత్త, వినూత్న పుస్తకాలు దొరుకుతాయి. పుస్తకం చదవకుండా విజ్ఞానవంతులం కాలేం. జీవితాన్ని కండ్లముందుంచుతాయి. బుక్‌ఫెయిర్‌ను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించాలి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించాలని సొసైటీని కోరా.
నాగరికతను నేర్పుతుంది
పుస్తకం నాగరికతను నేర్పుతుంది. ఇవి లేకుండా జ్ఞానం రానేరాదు. లిపి నుంచి తాళపత్రాల వరకు మేము ప్రదర్శనలో పెట్టాం. దేశంలోనే ఈ బుక్‌ఫెయిర్‌కు పేరుంది. రాష్ట్రంలోని గ్రంథాలయాకు పుస్తకాలను కొంటున్నాం. – – రియాజ్ చైర్మెన్, తెలంగాణ గ్రంథాలయ అభివృద్ధి సంస్థ
లక్షలాదిగా వస్తున్నారు
హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు లక్షలాదిగా సందర్శకులు వస్తున్నారు. గురువారం ఒక్కరోజే 1.80 లక్షల నుంచి 2 లక్షల వరకు సందర్శించారు. 30 ఏండ్లుగా బుక్‌ఫెయిర్ చూస్తున్నా. గతంలో ఎన్నడూ లేనివిధంగా జరుగుతున్నది. సకల సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు భారీగా వస్తున్నారు. బాలోత్సవానికి స్పందన బాగుంది. -బుక్‌ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్



