Monday, November 3, 2025
E-PAPER
Homeదర్వాజసాహిత్యంవైపు నడిపించిన పుస్తకం..

సాహిత్యంవైపు నడిపించిన పుస్తకం..

- Advertisement -

మారుమూల గ్రామంలో ఓరియంటల్‌ తెలుగు విద్యను పూర్తిచేసుకొని హైదరాబాద్‌ మహానగరంలో గల హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో కాలు పెట్టాను. అప్పటికి నాకు తెలుగు సాహిత్యం గురించి ఏ మాత్రం తెలియదు. నాకు తెలిసిందల్లా ఆ విశ్వవిద్యాలయంలో సీటు కొట్టాలంటే ఎంట్రన్స్‌ రాయాలి. దానిలో పాసవ్వాలి. దాని కోసం అప్పటికి తెలుగులో బిట్స్‌ రూపంలో ఉన్న పుస్తకాలు చదివి సీటు అయితే సంపాదించాను కానీ సాహిత్యం మీద నాకున్న అవగాహన చాలా తక్కువ. నేను విశ్వవిద్యాలయం లైబ్రరీకి వెళ్తే తెలుగులో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ పాఠాలుగా చెప్పి చదమంటారేమోనని మొదట్లో భయం వేసింది.

విశ్వవిద్యాలయంలో నాకు దొరికిన మిత్రులు చాలా మంచివారు. ప్రతిభావంతులు కూడాను. వారు నన్ను ఆ కథ చదివావా? ఈ నవల చదివావా? అని అడిగితే నేను ఏది చెప్పలేకపోతుండేవాడిని. వాళ్ళు మాత్రం రోజూ రాత్రి అన్నం తినేసిన వెంటనే లైబ్రరీకి వెళ్లి కథలు, నవలలు చదవుతుండేవారు. నేను కూడా అలా వాళ్లతో వెళ్లి పుస్తకాలు తిరగవేసేవాడిని కానీ చదివేవాడిని కాదు.
మొదటిసారిగా మిత్రుడు మహేష్‌ నాకొక పుస్తకం బహుమతిగా ఇచ్చాడు. ఇచ్చి ఈ పుస్తకం కచ్చితంగా చదువు అని హెచ్చరించాడు. (ఇప్పటికీ కొన్ని పుస్తకాలు చదువు అని సూచిస్తాడు) ఆ పుస్తకమే సలీంగారు రాసిన వెండిమేఘం. తెలుగు సాహిత్యంలో నేను చదివిన మొదటి పుస్తకం. నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. నన్ను ఏడిపించింది. దానితో పాటుగా నడిపించింది.

మొదటిసారి చదివినప్పుడే ఇదంతా కలగడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆ పుస్తకంలో కథా ప్రాంతం చీరాల, చినగంజాం, ఒంగోలు అంతా నేను తిగినదే. ఆ ప్రాంతంలోనే నేను ఓరియంటల్‌ విద్య చదవడం వల్ల నాకు ఆ ఊర్లతో పరిచయం ఉంది. కాబట్టి నేను ఆ పుస్తకాన్ని చదువుతున్నంతసేపు కూడా అక్కడ తిరుగుతున్నట్లగానే ఉండేది. అందుకే ఆ పుస్తకం నాపై చాలా ప్రభావం చూపింది. అంతేకాకుండా ముస్లిం స్త్రీలు పడే బాధలను, అవమానాలను ఈ పుస్తకం మూలంగా మొదటిసారి తెలుసుకోగలిగాను. ఆ తర్వాత ఇంతటి ఉత్సుకతను, ఉత్కంఠను రేకెత్తించిన రచయిత సలీంగారి నవలలు, కథలు చదవడం మొదలుపెట్టాను. వెండిమేఘం పుస్తకం ఫలితంగా కథలు, నవలలు, కవిత్వం చదవడం అలవాటు అయ్యింది. జీవితానికైనా, చదువుకైనా ఏదో ఒక సందర్భంలో మలుపు తిరుగుతుంది. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను నన్ను సాహిత్యం వైపు నడిపించిన ఒక గొప్పపుస్తకం వెండిమేఘం అని మాత్రం చెప్పగలను.

  • సారిపల్లి నాగరాజు, 8008370326
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -