Sunday, February 22, 2026
E-PAPER
Homeచౌరస్తాబాస్‌ ఈజ్‌ బ్యాక్‌

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌

- Advertisement -

గేటులోపలికి బండి పోనిచ్చి, దాని స్టాండు మీద దాన్ని నిలబెట్టి ఇంట్లోకి వెళ్లే డోర్‌ దగ్గరికి వచ్చాడు మయాంక్‌. లాక్‌ ఓపెన్‌ చేసి లోపలికి వెళ్లి విసురుగ్గా తలుపు మూశాడు. దానిరెక్కలు రెండూ ధడాల్‌మని కొట్టుకుని మూసుకున్నాయి.
‘ఏం తల పొగర్రా నీకు! జడుసుకునేట్టు విసిరికొట్టావు కదరా! లోపల ఏమి విరిగిందో ఏమో!’ అన్న మాటలు వినపడి విస్తుపోయాడు. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు. ఎండనపడి వచ్చాడు. పైగా బాగా టైరై వున్నాడు కదా! సీలింగ్‌ వైపు చూశాడు. రెండు రెక్కల ముని మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు. రెండు అంగల్లో స్విచ్‌ దగ్గరికి వెళ్లాడు. ఒకటి, రెండు, మూడు లెక్కపెట్టి ఫ్యాన్‌ స్విచ్‌ నొక్కాడు. మూడు రెక్కల ముని కదల్లేదు. మళ్లీ లెక్కసరి చూసుకుని, కరెక్టు స్విచ్‌ని కరెక్టుగానే నొక్కానని నిర్ణయించుకుని వేసిన స్విచ్‌ని మూసి, మూసిన స్విచ్‌ని మళ్లీ గట్టిగా నొక్కాడు. ‘క్రాంప్టన్‌’ గాడి మూడు రెక్కల్లో ఒక్కటి కూడా కొంచెం అయినా కదల్నే లేదు.
‘బుద్ధీ జ్ఞానం లేనోడా! ఎన్నిసార్లు స్విచ్‌ నొక్కినా లాభం లేదురా గూట్లే! కాయిల్‌ కాలిపోయిందిరా బేవకూఫ్‌! రిపేరయితే తప్ప, తపస్సు ముగించలేనురా అన్నమాటలు వినపడ్డాయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు. లోపల బనీను ఒంటికి చెమట కారణంగా అంటుకుంది. దాని మీద షర్టు నిలబడలేక కదలలేక కన్‌ఫ్యూజయింది. ‘ఫ్యాన్‌ రాకపోతే తుమ్మమొద్దులా, ఇలా స్విచ్‌బోర్డు దగ్గర నిలబడకపోతే, మూసున్న కిటికీ తెరవరాదూ!’ అన్నమాటలు వినిపించేయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థంకాలేదు. ఎవరైతేనేం మంచి సలహా, మంచిదే కాక ఉచిత సలహా కూడా అనుకుంటూ కిటికీ తెరిచి వాటి రెక్కలు విడదీసి గ్రిల్లులో ముఖం ఇరికించి బయటకు తొంగి చూశాడు. తనకోసమేనేమో ఎక్కడ్నించో ఉరుకులూ, పరుగులూ పెడుతూ వచ్చింది గాలి లోపలికి.
‘హమ్మయ్య’ అనుకున్నాడు మయాంక్‌. గాలికి అంటుకుని వున్న బనియన్‌ ఫెళ్లున నవ్వింది. ‘విప్పరాదోరు ఏం చేస్తున్నావు?’ అన్న మాటలు వినపడ్డయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు కానీ, తక్షణ కర్తవ్యం ఏమిటో అర్థమై, చొక్కా విప్పి, లుంగీ చుట్టుకుని, కిటికీ దగ్గర కూచుందామని ప్లాస్టిక్‌ కుర్చీని బర్రున లాగాడు. ‘ఒళ్లు కొవ్వెక్కిందా? అవతల వాళ్ల అవస్త అసలు పట్టించుకోవా?’ అన్న మాటలు వినపడ్డయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు. కుర్చీ కింద ఎవరూ లేరు కదా అనుకుంటూ దాన్ని పైకెత్తి చూసి, ఈసారి నెమ్మదిగా కిందికి దించి దాంట్లో కూచున్నాడు. ఎప్పటిలా కాక కాస్త సున్నితంగా.
కుర్చీలో కూచుని కిటికీలోంచి వస్తున్న గాలిని, ముక్కు స్ట్రాలతో పీల్చుకుంటున్నప్పుడు ఎంతసేపూ ముక్కు చూసుకోడమేనా? నన్ను మరిచిపోయావా? నాలోపల క్యాట్స్‌ అంత సైజులో వున్న ర్యాట్సు ఒకదాన్ని ఒకటి ఛేజ్‌ చేసుకుంటున్నవి. కమాన్‌, క్విక్‌! ఏదో ఒకటి చెయ్యి! అన్న మాటలు వినపడ్డయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు కానీ శరీరం నీరసంగా వున్న విషయం తెలిసి వచ్చింది. వంట మనిషి ఇంట్లో లేదన్నది గుర్తుకొచ్చింది.
ముందు ఏదన్నా తిండానికి ఆర్డరు చెయ్యాలి. ఆర్డరు చెయ్యాలంటే ఫోన్‌ కావాలి. ఫోనెక్కడ అంటూ గది అంతా కలియదిరిగాడు జూ లో చిరుతపులిలా. ఇందాక ప్యాంటు తీసి లుంగీలో దూరుతున్నప్పుడు అది జేబులోంచి జర్రున జారి మంచం కింద దాక్కుంది. కాసేపు అరచేతి వేడి, వేళ్లనొక్కుళ్లు తప్పుతాయని. ఆకలి కడుపును మోసుకుంటూ ఫోన్‌ కోసం అన్వేషణ సాగించిన మయాంక్‌ ఎలాగైతేనేం మంచం కింద దాక్కున్న ఫోన్‌ని దొంగోణ్ణి పోలీసోడు పట్టుకున్నట్టు పట్టుకుని బయటకు లాక్కువచ్చాడు. ఏం మాయ రోగంరా నీకు? అస్తమానూ నన్ను ఊపిరాడకుండా పట్టుకు చంపుతున్నావు అన్న మాటలు వినపడ్డయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు. ఫోన్‌ చేతికి చిక్కిన ఆనందంలో ఎవరేమంటే మనకేంటి ఒరే! అనుకుంటూ పొట్ట వైపు చూసుకుంటూ కావలసినవేవో ఆర్డర్‌ చేశాడు.
ఫుడ్‌ బాస్కెట్లో పడెయ్యడానికి రావలసిన ఫుడ్‌ పార్శిల్‌ వచ్చేవరకూ మంచం మీద ఒరుగుదామనుకున్నాడు. మంచం వైపు చూశాడు. దాని పరిస్థితి అసలేం బాగులేదు. వారం నుంచి విడిచిపడేసిన పాంట్లు, షర్టులు ఒకదాని మీద ఒకటి పడి పొర్లుదండాలు పెడుతున్నాయి. అటో ఇటో ఎటో వాటిని జరిపి పడుకుందామనుకున్నాడు.
ఏంటీ? పడుకుంటావా? చెమట కంపు ఇంపుగా వుందా? బెడ్‌షీటు మార్చి ఎన్ని రోజులైంది? బట్టలు శుభ్రంగా వుతికి, మంచం మీద బెడ్‌షీట్‌ మార్చి, పిల్లోలకు పూల కవర్లు తొడిగే మనిషేది? అన్న మాటలు వినపడ్డయి. ఆ మాటలు అన్నది ఎవరో అర్థం కాలేదు.
నీ ముఖానికి ఏ పనీ చేతవదు. టైముకి అన్నీ అమర్చే వాళ్లు కావాలి. సుఖంగా కూర్చుని తింటానికి అలవాటు పడి, నోటికి తిమ్మిరి ఎక్కి అనరాని మాటలన్నీ అని, వినరాని తిట్లన్నీ తిట్టి పో నీ దిక్కున్న చోటుకి పో అని ఛీ కొట్టావుగా! ఇంటి ఇల్లాలు వుంటేనే మేం అంతా పద్ధతిగా వుంటాం. ఆవిడే మా బాస్‌, ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌. నువ్వో గొట్టాం మొగుడివి. పూర్‌ ఫెలోవి. పో! మా బాస్‌తో ఈ ఇంట్లో అడుగుపెట్టు అన్న అరుపులతో పాటు తలుపు రెక్కలు, కిటికీ వింగ్స్‌, కుర్చీ కాళ్లు, మంచం మీది బట్టలు వంటింట్లో గిన్నెలూ రకరకాలుగా అరిచి గీ పెట్టసాగాయి.
ఇంట్లోకి వచ్చింది మొదలు తనతో మాట్లాడింది తలుపు రెక్కలూ, ఫ్యానూ, ఒంటి మీది షర్టూ, ప్లాస్టిక్‌ కుర్చీ, షర్టు లోపలి స్టమక్కూ, ఫోనూ, మంచం, మంచం మీది డ్రస్సులూనా? ఇల్లాలుని ఇంట్లోంచి పంపిస్తే ఇవన్నీ తిరుగుబాటు చేసాయా? వెంటనే బాస్‌ని తీసుకు వచ్చేయాలి.
తల గిర్రున తిరిగిన మయాంక్‌ వీధిలో పడి బైక్‌ మీద బయల్దేరాడు. బాస్‌ లేకుండా తను ఇంట్లో ఒక్క రోజు కూడా వుండలేనని. మయాంక్‌, బాస్‌తో తిరిగి వస్తే తప్ప ఎవరి మాటా వినం వినం అని అనేక గొంతులు గదిలో అరవడం ఎవరికీ వినిపించలేదు కానీ మరో గంట తర్వాత బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అన్న మాటలు మయాంక్‌ కు మాత్రమే వినిపించాయి.

చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -