ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
ఫెడరల్ నిర్మాణాన్ని ఉల్లంఘిస్తున్నారు :
కేంద్ర దర్యాప్తు ఏజెన్సీని ప్రశ్నించిన సీజేఐ గవాయ్
టీఏఎస్‌ఎంఏసీపై దర్యాప్తు నిలుపుదల
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై భారత సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఏఎస్‌ఎంఏసీ)పై మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తును తప్పుబట్టింది. కేంద్ర ఏజెన్సీ అన్ని పరిధులను దాటుతున్నదని, సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలిపింది. టీఏఎస్‌ఎంఏసీ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బి.ఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎ.జి మసీతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోన్నది. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిస్ సిబల్ వాదనలు వినిపించారు. మద్యం దుకాణాలను కేటాయించిన కొంత మంది వ్యక్తులు నగదు తీసుకుంటున్నట్టు కార్పొరేషన్ గుర్తించిందని ఆయన చెప్పారు. 2014 నుంచి 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వమే 41 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసిందనీ, ఇవి కూడా వ్యక్తుల పైనే కానీ కార్పొరేషన్‌పై కాదని కపిల్ సిబల్ కోర్టుకు స్పష్టం చేశారు. 2025లో ఈడీ రంగంలోకి దిగి.. కార్పొరేషన్, ప్రధాన కార్యాలయంపై దాడులు చేసిందని వివరించారు.కేంద్ర సంస్థ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) ఎస్.వి రాజుకు సీజేఐ నోటీసును జారీ చేశారు. కార్పొరేషన్‌పై నేరం ఎలా ఉంటుందని ఏఎస్‌జీని సీజేఐ ప్రశ్నించారు. వ్యక్తులపై కేసు నమోదు చేయొచ్చు కానీ క్రిమినల్ విషయాల్లో కార్పొరేషన్‌పై ఎలా చేస్తారని అడిగారు. ”మిస్టర్ రాజు, మీ ఈడీ అన్ని పరిమితులనూ దాటుతోంది” అని సీజేఐ గవారు అన్నారు. రెండువారాల్లోగా ఈడీ ప్రతిస్పందనను దాఖలు చేయాలని ఆదేశించారు. ఈలోగా, పిటిషనర్ల వాదన మేరకు తదుపరి చర్యలపై స్టే ఉంటుందని కోర్టు తెలిపింది. టీఏఎస్‌ఎంఏసీ తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈడీ చర్యల గురించి కోర్టుకు తెలిపారు. కేంద్ర ఏజెన్సీ.. కార్పొరేషన్ ఉద్యోగుల ఫోన్లను తీసుకొని, వాటిని క్లోన్ చేసిందని చెప్పారు. ఈడీ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా.. ఈ కేసు రాజకీయ నాయకుల రూ.1000 కోట్ల మోసానికి సంబంధించిందని ఏఎస్‌జీ తెలిపారు. ఈడీ దర్యాప్తులో ఎలాంటి దురుద్దేశం లేదనీ, అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ప్రతిస్పందనను దాఖలు చేసిన తర్వాతే ఈ కేసును కోర్టు వింటుందని సీజేఐ గవారు స్పష్టం చేశారు. తమిళనాడులో మద్యం అమ్మకాలను పర్యవేక్షించే టీఏఎస్‌ఎంఏసీలో అవినీతి, ఆర్థిక అవకతవకలపై పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈడీ ప్రవేశించింది. మార్చిలో కేంద్ర ఏజెన్సీ.. కార్పొరేషన్ కార్యాలయాల్లో సోదాలు జరిపింది. మార్చి 6 నుంచి మార్చి 8 మధ్య చెన్నైలోని కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో సహా 20 ప్రదేశాలలో ఈడీ అధికారులు దాడులు చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉన్నది.
హద్దులన్నీదాటుతున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES