Thursday, March 26, 2026
E-PAPER
Homeఖమ్మంరక్తాన్ని శ్రమగా మార్చి పంటల పండిస్తున్న అన్నదాతలు

రక్తాన్ని శ్రమగా మార్చి పంటల పండిస్తున్న అన్నదాతలు

- Advertisement -

  • వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
  • మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి
  • అకాల వర్షాలను నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
  • నిద్రపోతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు ఉదృతం
  • రాజకీయాలకు అతీతంగా హక్కుల కోసం రైతులు పోరాటంలోకి రావాలి
  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు

నవతెలంగాణ – బోనకల్
అన్నదాతలు రక్తాన్ని శ్రమగా మార్చి పంటలు పండిస్తున్నారని, వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మొక్కజొన్న కొనుగోలుపై పరిమితిని వెంటనే ఎత్తివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు రెండు గంటలపాట ఆందోళన నిర్వహించారు. తొలుత స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ప్రదర్శనగా బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం, స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినత పత్రాన్ని తహశీల్దార్ మద్దెల రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.330, పత్తికి రూ.800 బోనస్ ప్రకటించిన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేస్తే కేవలం ఖమ్మం జిల్లాలోని లక్ష ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం దారుణమన్నారు. ఎకరానికి సుమారు 40 క్వింటాలు దిగుబడి వస్తుందని, మిగిలిన మొక్కజొన్న పంటను ఎవరు కొనుగోలు చేయాలని ఆయన ప్రశ్నించారు. నేడు మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ. 2400 రూపాయల ప్రకటించిందని, కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు గ్రామాలలోకి రంగ ప్రవేశం చేసి క్వింటా కేవలం రూ.1600 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు వలన పత్తి, మొక్కజొన్న పంట రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన మొక్కజొన్న రైతులకు వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోతుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు అనేక కష్టాలు పడ్డారన్నారు.


రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన దేశంపై పెత్తనం చేస్తున్నాడని, దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతకాని తనం అన్నారు. అమెరికా నుంచి మనం ఏది దిగుమతి చేసుకోవాలో, పన్ను ఎంత చెల్లించాలో, అదేవిధంగా మన దేశం నుంచి అమెరికాకు ఏది ఎగుమతి చేయాలో ఎంత పన్ను విధించాలో రెండు కూడా డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించడం బాధాకరమన్నారు. పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ భూములను కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్న పంట పండించే ఐదు మండలాలలో బోనకల్ మండలం ఒకటన్నారు. మొక్కజొన్న రైతులు అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తగిన విధంగా న్యాయం చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోతే రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
రైతుల కోసం సాగుతున్న పోరాటంలో రాజకీయాలకు అతీతంగా రైతులందరూ పాల్గొని తమ హక్కులు సాధించుకోవాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్మినేని నాగేశ్వరరావు, తుళ్లూరు రమేష్, నాయకులు జొన్నలగడ్డ సునీత గుడ్డుూరి ఉమ, దొండపాటి సత్యనారాయణ, జోనిబోయిన గురవయ్య, బంధం శ్రీనివాసరావు, గుగులోత్ నరేష్, కేతినేని నాగేశ్వరరావు, గుగులోతు పంతు, చలమల హరికిషన్ రావు, పుచ్చకాయల వల్లరాజు ముంగి వెంకన్న కారంగుల చంద్రయ్య ఎర్రదేశి నరసింహారావు, గుడ్డురి వెంకట నరసయ్య, ఉన్నం వెంకటేశ్వర్లు, తాత వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -