ఎర్ర రాజశేఖర్ హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : కేవీపీఎస్ రౌండ్ టేబుల్‌లో జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్
నవతెలంగాణ – ముషీరాబాద్
కులోన్మాద క్రూరత్వం రోజురోజుకూ మధ్య యుగాల కాలాన్ని మరిపిస్తున్నదని, ఎర్ర రాజశేఖర్ హత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని జస్టిస్(రిటైర్డ్) చంద్రకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరా బాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్‌లో శుక్రవారం కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రకాశ్‌కరత్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ.. వేల ఏండ్లుగా కొనసాగుతున్న కులోన్మాదం నేటికీ విషం చిమ్ముతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో తమ మతం ప్రమాదంలో ఉందని కొందరు మతోన్మాద శక్తులు ప్రచారం చేస్తున్నారు కానీ.. నిజంగా ప్రమాదంలో ఉన్నది పేదలు, దళితులేనని అన్నారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని, 11 ఏండ్ల కాలంలో 142 జరిగాయని, అయినా ప్రభుత్వాల్లో ఉలుకూ పలుకూ లేదని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో రెండు కులోన్మాద హత్యలు జరిగాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్ తన తమ్ముడి ప్రేమ వివాహానికి సహకరించాడనే కోపంతో.. అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేయడం అమానుషమని అన్నారు. కిడ్నాప్ తర్వాత నాలుగు రోజులు గడిచినప్పటికీ పోలీసులు దుండగులను పట్టుకోలేకపోయారన్నారు. పైగా బాధిత కుటుంబాన్నే వేధించారని, హత్య జరుగుతుందని తెలిసినా పోలీసులు విచారణలో జాప్యం చేశారని ఆరోపించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడారు. కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, రాజశేఖర్ భార్య వాణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసును సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో షాద్‌నగర్, మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం, వారి సహకారంపై విచారణ జరగాలన్నారు.
టీపీఎస్‌కే రాష్ట్ర కన్వీనర్ జి.రాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 142 కుల దురహంకార హత్యలు జరిగితే.. ముస్లింలు నాగరాజును చంపినప్పుడు మాత్రమే బీజేపీ స్పందించిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆ హత్యను ఉపయోగించుకుందని విమర్శించారు. ఒక దళితుడిని అగ్రకులోన్మాదులు చంపితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు, బీజేపీ అగ్రనేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హిందువులందరూ బంధువులనే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు కులోన్మాదం పేరిట ఎన్ని హత్యలు జరిగినా బలపరుస్తారా? అని ప్రశ్నించారు. ప్రముఖ రచయిత, కులనిర్మూలన సంఘం వ్యవస్థాపక సభ్యులు వి.లక్ష్మీ నాగేశ్వర్ మాట్లాడుతూ.. కులదురహంకార హత్యలను అరికట్టాలంటే పౌర సమాజం కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని, హత్యలను ఖండిం చాలని అన్నారు. సమావేశంలో కులనిర్మూలన సంఘం అధ్యక్షులు ఎండీ వహీద్, బంధు సొసైటీ అధ్యక్షులు పల్లాల వీరస్వామి, ప్రొఫెసర్ ఏకు తిరుపతి, వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకులు కడమంచి రాంబాబు, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎం.కృపాసాగర్, బి.సుబ్బారావు, పి.భాగ్య, మధు, సీఐటీయూ నాయకులు జి.రాములు, సోమయ్య, ఓయు విద్యార్థి నాయకులు దాసరి బాలస్వామి, శ్రీనివాస్, మహేష్ దుర్గి పాల్గొన్నారు.
మధ్యయుగాలను మరిపిస్తున్న కులోన్మాద క్రూరత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



