మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. దేశ జీడీపీలో 5 శాతానికి పైగా వాటాను కలిగిఉన్న తెలంగాణ గురించి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించక పోవడం గర్హ నీయమని పేర్కొన్నారు. కేంద్రం తరచూ వల్లించే ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ నినాదం తెలంగాణ విషయంలో ఉత్తిదేనని తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుం దని చెబుతూనే, నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష ప్రదర్శించారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ.22,782 కోట్లు వస్తాయని అంచనా వేస్తే, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై పది నెలలు గడుస్తున్నా వచ్చింది కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ సమ న్యాయంగా జరగాలనీ, కానీ సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ‘రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్-2, గోదావరి – మూసీ అనుసంధానం, బందరు పోర్టు-హైదరాబాద్ డ్రైపోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, నాలుగు కొత్త విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోకపోవడం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలభిస్తోన్న వివక్షకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



