కేరళ విధానం అమలు చేయాలి
పాలక పక్షాలతో స్నేహం కొన్ని అంశాలకే పరిమితం
ప్రజా సమస్యలను విస్మరిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే కొండగారి రాములు సంతాపసభ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
పేదోడి కేంద్రంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లు ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. కేరళం విధానం అమల్లోకి తేవాలని, పేదోడు లేకుండా చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సంతాప సభ మంగళవారం తెలంగాణ చౌరస్తాలోని భారత్ గార్డెన్‌లో జరిగింది. సీపీఐ రాష్ట్ర నాయకులు కావలి నర్సింహా అధ్యక్షతన నిర్వహించిన సభలో కూనంనేనితోపాటు సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.యాదయ్య పాల్గొన్నారు. అంతకుముందు కొండిగారి రాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. బడ్జెట్‌లో పేదోడి వాటా కావాల్సిందేనన్నారు. చనిపోయిన తర్వాత బీమాలి స్తున్న ప్రభుత్వాలు బతికున్నంత కాలం ఉండటానికి జాగా, తిండి, విద్యా, వైద్యం సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కమ్యూనిస్టులు లేని ప్రభుత్వాలను ఊహించుకోలేమని, ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, అధికారానికి దూరం కావాలన్నా కమ్యూనిస్టులకే సాధ్యమవుతుందని తెలిపారు. కమ్యూనిస్టు పోరాటాల ఫలితంగానే అనేక చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు. పాలక పక్షాలతో స్నేహం కొన్ని అంశాల వరకే పరిమితం అవుతుందని, ప్రజా సమస్యలను విస్మరిస్తే ఎదురొడ్డి నిలబడి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టులు ప్రశ్న వైపా? అధికారం వైపా? అనేది ఉత్పన్నమైతే కమ్యూనిస్టులు ప్రశ్న వైపే నిలబడతారని అన్నారు. పాలకులు ప్రశ్నించే వాడిని అణచాలని చూస్తున్నారని తెలిపారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు శాశ్వతంగా అదే పార్టీలో ఉంటారన్న నమ్మకం బూర్జువా పార్టీల్లో లేదన్నారు. కానీ కష్టమైనా, నష్టమైనా కమ్యూనిస్టులు తను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ జీవిస్తారని, అందుకు కొండిగారి రాములు నిదర్శనమని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కమ్యూనిస్టులను అణచివేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే డెడ్‌లైన్లు పెట్టి మరీ మావోయిస్టులను అంతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. దేశం వ్యాప్తంగా ప్రశ్నించిన వారిపైనా, మావోయిస్టులకు సానుకూలంగా మాట్లాడిన వారిపైనా ఉపా కేసులు నమోదు చేయడంతోపాటు తప్పుడు కేసుల్లో ఇరికించి, (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్‌ఐఏతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బిల్లు (విద్వేష ప్రసంగాల నియంత్రణ బిల్లు) విధానాలూ అలాగే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి, హేమంత్, రాష్ట్ర నాయకులు పుస్తకాల నరసింహారావు, నాయకులు యాదిరెడ్డి, ఓరుగంటి యాదయ్య, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి కావలి సురేష్, మాజీ జెడ్పీటీసీ హూనా నాయక్, నాయకులు పోచమోని నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేదోడి కేంద్రంగానే బడ్జెట్ ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



