Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్‌ను సవరించాలి

బడ్జెట్‌ను సవరించాలి

- Advertisement -

వ్యవసాయనామ సంవత్సరంలో కోతలు సరికాదు
లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపుల్లేని పద్దు
తెలంగాణ రైతు సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యవసాయనామ సంవత్సరం అని ముఖ్యమంత్రి ప్రకటించి.. బడ్జెట్‌లో మాత్రం కోతలు విధించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. వెంటనే బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పి.జంగారెడ్డి అధ్యక్షతన సోమవారం ‘రాష్ట్ర బడ్జెట్‌ 2026-27 వ్యవసాయం రంగం’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారని తెలిపారు. గతేడాది రూ.24,439 కోట్లు కేటాయిం చగా ఈసారి రూ.1,250 కోట్లు తగ్గించారని చెప్పారు.

గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం ”క్యూర్‌, ప్యూర్‌, రేర్‌” లక్ష్యాలుగా ప్రకటించి రేర్‌లో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా వ్యవసాయోత్పత్తులు 236.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరిగినట్టు ప్రకటించారని తెలిపారు. వ్యవసాయరంగం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1.11 లక్షల కోట్లు కాంట్రిబ్యూట్‌ చేస్తున్నట్టు చెప్పారు. రైతు భరోసా, యాంత్రీకరణ, పంటల బీమా, పంటల బోనస్‌కు నిధులు పెంచినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 7.15శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. భూ భారతి అమలులో రెవెన్యూ కోర్ట్‌ల పునరుద్ధరణ, 11 అంశాల పహాణి పత్రికలో వాస్తవ సాగుదార్లు (కౌలుదార్లు) పేరు నమోదు, పంటల బోనస్‌, మ్యానిఫెస్టోలో ప్రకటించిన పంటల కనీస మద్దతు ధరల నిర్ణయానికి బడ్జెట్‌ కేటాయింపుల్లేవని అన్నారు. వ్యవసాయ ప్రణాళిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల వల్ల రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పత్తి చేయడానికి తగిన ప్రణాళిక లేదన్నారు. హార్టికల్చర్‌ శాఖ 2 దశాబ్దాలు గా 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నద న్నారు. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు తగ్గిందని తెలిపారు.

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ దిగుమతుల ద్వారా రైతులు నష్టపోతున్నారన్నారు. పత్తి, వరి పంటలను మాత్రమే మద్దతు ధరల ఆధారంగా సాగు చేస్తున్నారని, ఆ రైతులకు కూడా కనీస మద్దతు ధరలు అందడం లేదని అన్నారు. భూ భారతి వల్ల కౌలుదార్లకు ఆర్థిక రక్షణ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనలకు, లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపు ల్లేకపోవడంతో వ్యవసాయ రంగంలో మాంద్యం పెరుగుతోందన్నారు. సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో వ్యవసాయరంగంలో కౌలు రైతులకు రైతు భరోసా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, మార్కెట్‌ జోక్యం పథకం కింద నిధుల కేటాయింపు లేదని అన్నారు. పాల ఉత్పత్తిదార్లకు లీటరుకు రూ.5 ప్రోత్సాహకం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి బడ్జెట్‌ నిధులు కేటాయించలేదన్నారు.

అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను సవరించాలని, కనీసం బడ్జెట్‌లో 20శాతం నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కార్యదర్శి భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.శ్రీరామ్‌ నాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌, రైతు కూలీ సంఘం నాయకులు విజరు మాట్లాడారు. బడ్జెట్‌ను సవరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి జరిగే ఆందోళనలో భాగస్వాములమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ్మ, రైతు సంఘం నాయకులు శివ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్‌.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -