10 నుంచి 15 శాతం ధరల పెరుగుదల
ఒక్కో ఆవుకు రోజుకు రూ.210, గేదెకు రూ.140కిపైనే ఖర్చు
దాణా సబ్సిడీలను ఎత్తేసిన ప్రభుత్వ డెయిరీ సంస్థలు
డెయిరీలో లీటర్ ఆవుపాలకు దక్కుతున్నది రూ.33 నుంచి రూ.35 లోపే
గేదె పాలకు అందుతున్నది రూ.50 నుంచి 56 లోపే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాడి రైతులపై ‘దాణా’భారం పడుతున్నది. పాల ఉత్పత్తిలో కీలకమైన ఆవులు, గేదెలకు ఉపయోగించే దాణా ఉత్పత్తులపై పది నుంచి 15 శాతం మేర ఇటీవల రేట్లు పెరిగాయి. ఓవైపు దాణా ధరలు పెరగటం…మరోవైపు ప్రభుత్వ డెయిరీలు సబ్సిడీపై దాణా సరఫరాను అమలు చేయకపోవడం…మరోవైపు డెయిరీలు పాల ధరలను తగ్గించడం వెరసి పాడి రైతులు నష్టాల్లోకి కూరుకుపోతున్నారు. గతంలో విజయ డెయిరీ సంస్థ రైతులకు 50 శాతం సబ్సిడీ మీద లిక్విడ్ దాణాను సరఫరా చేసేది. మినరల్ మిక్స్‌డ్ పౌడర్‌ను 20 శాతం సబ్సిడీపై ఇచ్చేది. అయితే, రెండేండ్లుగా మినరల్ మిక్స్‌డ్ పౌడర్‌ను ఇవ్వట్లేదు. లిక్విడ్ దాణా సరఫరాను ఆపేసింది. మిగతా డెయిరీలదీ ఇదే పరిస్థితి. బహిరంగ మార్కెట్‌లో 20 కేజీల పౌడర్‌కు రూ.4 వేలు ఉంది. అది సబ్సిడీ ఉన్నప్పుడు రైతులకు రూ.2 వేలకే దక్కేది. లిక్విడ్ పది లీటర్లకు రూ.1800 వరకు ఉంది.
ఇప్పుడు ఆ భారం రైతులపై పడుతున్నది. సగటున ఒక్కో ఆవు రోజుకు ఏడు కేజీల దాణా తింటుంది. సగటున ఒక్కో కేజీకి రూ.30 వేసుకున్నా రోజుకు రూ.210 ఖర్చవుతున్నది. ఒక ఆవు రోజుకు యావరేజ్‌గా 14 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. డెయిరీలు లీటర్ ఆవు పాలకు కనిష్టంగా రూ.30, గరిష్టంగా రూ.35కి మించి ఇవ్వడం లేదు. డెయిరీ సంస్థకు ఒక ఆవుకు సంబంధించి రైతు పోసే పాలకు గానూ రోజుకు యావరేజ్‌గా 420 నుంచి 490 మధ్య ధర దక్కుతున్నవి. ఒక ఆవుపై రోజువారీగా దాణా ఖర్చుపోగా మిగులుతున్నది రూ.210 నుంచి రూ.250 మాత్రమే. అంటే రైతులకు కూలి కూడ గిట్టని పరిస్థితి. అదే గేదె పాలకు అయితే లీటర్‌కు రూ.50 నుంచి రూ.56 వరకు పాడి రైతులకు డెయిరీ సంస్థలు చెల్లిస్తున్నాయి. ఒక్కో గేదెకు సగటున దాణా ఖర్చు రూ.120 అవుతుండగా..పాల ద్వారా రైతులకు ఒక గేదెపై సగటుగా అందుతున్నది రూ.220 మాత్రమే. అంటే ఖర్చులుపోను గేదెపై రూ.100 మాత్రమే మిగులుతున్నాయి.
దీంతో చాలా మంది పాల డెయిరీలను వదిలేస్తున్నారు. రైతులు ఈ విధంగా నష్టపోతుండగా పాల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో వినియోగదారుని దగ్గరకు వచ్చేసరికి పాల రేట్లు పెరిగిపోతున్నాయి. పట్టణాల్లో ప్రాంతాలను బట్టి లీటర్ బర్రె పాలకు రూ.80 నుంచి రూ.100 పలుకుతుండగా, గ్రామాల్లో రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. పాలప్యాకెట్ల ధర లీటర్‌కు( ఆయా డెయిరీ సంస్థలను బట్టి ఒక రూపాయి అటు ఇటుగా) రూ.60 ఉంది. దీంతో పాల ఉత్పత్తి , డెయిరీల నిర్వహణ ద్వారా తమకు పెద్దగా ఏమీ మిగలట్లేదని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ పాడి రైతులకు ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయట్లేదని ఎత్తిచూపుతున్నారు. ప్రమాదాల్లో, వివిధ రోగాలతో బర్రెగానీ, ఆవుగానీ చనిపోతే రైతు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తున్నది. పాల సొసైటీ నిర్వహణ గ్రామాల్లో అస్తవ్యస్తంగా తయారైంది. డెయిరీలు పాల సెంటర్ల నిర్వహణను పట్టించుకోవట్లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పాలరేట్లను పెంచి సబ్సిడీపై దాణా ఇవ్వాలి
దాణా ఖర్చులకు అనుగుణంగా పాడి రైతులు నష్టపోకుండా పాల రేట్లను పెంచాలి. మినరల్ మిక్చర్, కాల్షియం, నట్టల మందులను రైతులకు 50 శాతం సబ్సిడీలపై అందజేయాలి. పాడి పశువులకు గడ్డి కట్టర్ మిషన్‌లను, పాలు పిండే మిషన్లను 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలి. దాణాను డెయిరీల ద్వారా సబ్సిడీపై అందించాలి. పాడి పశువులకు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి.
సాదం రమేశ్, విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్


