Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంబుర్ఖా తొలగించాల్సిందే

బుర్ఖా తొలగించాల్సిందే

- Advertisement -

ఓటింగ్‌కు వచ్చే మహిళల్ని తనిఖీ చేయాలి : బీజేపీ డిమాండ్‌
ఇది రాజకీయ కుట్ర : ఆర్జేడీ.. ఛత్‌ పండుగ తర్వాతే బీహార్‌ ఎన్నికలు నిర్వహించాలి : ఈసీని కోరిన రాజకీయ పార్టీలు

పాట్నా : బుర్ఖాలు ధరించి వచ్చే మహిళలను, వారి ఓటరుకార్డులను సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ నేతలు ఈసీ బృందాన్ని కోరారు. అంతేకాదు ఓటింగ్‌ పూర్తైన తరువాత పోలింగ్‌ ఏజెంట్లు ఫారమ్‌ 17సీ సేకరించేలా చూడాలని, దీని వల్ల ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగిందో లేదో తెలుస్తుందని, ఈవీఎంలపై ఉన్న సందేహాలు కూడా తొలగిపోతాయని చెప్పారు. అయితే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని, బహుళ దశల్లో జరిపితే ఓటర్లకు అసౌకర్యం, అభ్యర్థులకు ఖర్చులు పెరుగుతాయని బీజేపీ నేతలు ఎలక్షన్‌ కమిషన్‌కు తెలిపారు.

బీహార్‌ శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం పాట్నా వచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ సారథ్యంలోని ఈసీ బృందం ఆరు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేత లతో శనివారం భేటీ అయింది. బీజేపీ మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ ఖండించింది. బుర్ఖా ధరించిన మహిళలను అవమానించటం తగదని, ఇది రాజకీయ కుట్రే అని అభివర్ణించింది.

ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు ఉన్నారు : ఆర్జేడీ
ఛత్‌, దీపావళి తరువాత ఎన్నికలు నిర్వహించా లని ఆర్జేడీ కోరింది. లేకుంటే ప్రజలు అసౌకర్యానికి గురువుతారని ఈసీకి తెలిపింది.ఆర్జేడీ ఎంపీ అభరు కుశ్వాహా మాట్లాడుతూ, బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ చేపట్టి ఓటర్‌ జాబితా నుంచి ఏకంగా 3,66,000 ఓటర్లను తొలగించారని, దీనిపై తమకు అభ్యంతరా లు ఉన్నాయని అన్నారు. తొలగించిన ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆయన కోరారు.

ఛత్‌పండుగ తర్వాత ఎన్నికలు..
బీహార్‌ శాసనసభ ఎన్నికలు ఛత్‌ పండుగ తర్వాత నిర్వహించాలని అక్కడి రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) విజ్ఞప్తి చేశాయి.

ఒకే విడతలో పోలింగ్‌..
ఈసీని కలిసిన రాజకీయ పార్టీల నేతలు ఈసారి తక్కువ విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని కోరారు. వీలైతే ఒకటి లేదా రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మహారాష్ట్ర మాదిరిగా బీహార్‌లోనూ ఒకే విడతలో పోలింగ్‌ జరపాలని జేడీయూ నేతలు విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన బీహారీలు దీపావళి, ఛత్‌ పండుగలకు స్వస్థలాలకు తిరిగి వస్తారని, అప్పుడు పోలింగ్‌ నిర్వహించటం వల్ల ఓటింగ్‌ శాతం పెరుగుతుందని వారు అన్నారు. బీహార్‌లో నిర్వహించే ముఖ్యమైన పండుగల్లో ఛత్‌ ఒకటి. ఈ పండుగను దీపావళి తర్వాత ఆరు రోజులకు జరుపుకొంటారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను తగ్గించాలి
లోక్‌ జనశక్తి పార్టీకి చెందిన నేతలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 800కు తగ్గించాలని ఈసీని కోరారు. సీనియర్‌ సిటిజన్లను పోలింగ్‌ బూత్‌లకు తీసుకురావడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నవంబర్‌ 22 తో ముగియనున్న అసెంబ్లీ గడువు
ప్రస్తుత బీహార్‌ శాసనసభ గడువు నవంబర్‌ 22న ముగియనుంది. కనుక అంతకు ముందే కొత్త శాసనసభ ఏర్పాటు చేయాలి. దీపావళి అక్టోబర్‌ 20న వస్తుంది. నాలుగు రోజుల ఛత్‌ పండుగ అక్టోబర్‌ 28న ముగుస్తుంది. కనుక నవంబర్‌ మొదటివారంలో బహుశా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2020లో మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది ఒకటి లేదా రెండు దశ్లలో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -