ఒక్క ఫోటో… వంద మాటల పెట్టు : మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఘనంగా తెలంగాణ బెస్ట్ ఫోటోజర్నలిస్ట్ అవార్డుల ప్రధానోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కెమెరా లెన్స్ ఎప్పుడూ బాదితుల పక్షానే ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి మీడియా అకాడమీలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ ఆసోసియేషన్(టీఎస్‌పీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన బెస్ట్ ఫోటో జర్నలిస్ట్-2025 అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు మీడియా రంగంలో ఏది ఇన్‌ఫర్మేషనో, ఏది కన్‌ఫర్మేషనో తెలియని అనిచ్ఛిత పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బాషలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికి అర్థమయ్యేది ఒక్క ఫోటో మాత్రమేనని పేర్కొన్నారు. ”కలం ఆగిపోయిన చోట చిత్రం మాట్లాడాలి. ఒక్క ఫోటో వంద మాటల పెట్టు… ఎన్నో హావభావాలను పలికించే వాస్తవం. కలం కాలాన్ని బంధిస్తే ఫోటో సాక్ష్యాన్ని అందిస్తుంది. ఫోటో జర్నలిజం ఫ్రోఫెషన్ మాత్రమే కాదు… అది ప్యాషన్. అలాంటి వృత్తిలో ఎండనక, వాననక ఒంటి కాలు మీద నిలబడి ఫోటో జర్నలిస్టులు చేస్తున్న సాహసం గొప్పది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నో యుద్ధాలను, ఆకలి కేకలను కళ్లకు కట్టింది ఫోటో మాత్రమేనని అన్నారు. ఇటీవలి రష్యా ఉక్రేయిన్, అమెరికా ఇరాన్ యుద్ధాల్లో ఫోటో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న వారు తమను తామ రక్షించుకునేందుకు వెనక్కి పరిగెత్తితే ఫోటో జర్నలిస్ట్ మాత్రం ఆ ఘటనను బంధించేందుకు ప్రాణాలకు తెగించి ముందుకు పరిగెత్తుతాడని గుర్తు చేశారు. వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వాలు అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత ఫోటో జర్నలిజానికి కూడా సవాల్‌గా మారిందని అన్నారు. మాటలు, పాటలు, వార్తలతో పాటు ఫోటోలు కూడా క్షణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా సృష్టిస్తున్నారని అన్నారు.
ఈ సాంకేతిక మార్పు పర్యవసానాలపై తెలంగాణలో జాతీయ సదస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ వాస్తవాలను, చారిత్రక సత్యాలను తమ ఫోటోల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోటో జర్నలిస్ట్‌ల వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఫలితంగా వృత్తిలో వారెదుర్కొంటున్న సమస్యలపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. టీఎస్‌పీజేఏ రాష్ట్ర అధ్యక్షులు ఏ.గంగాధర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి కేఎన్. హరి వందన సమర్పణ చేశారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరహాత్ అలి, రాంనారాయణ, నరెందర్‌రెడ్డి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.



