గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు
చివరి విడత పంచాయతీల్లో జోరుగా పంపకాలు, ప్రలోభాలు
ఓటుకు రూ.500 నుంచి రూ.5 వేలవరకు పంపిణీ
రాత్రయితే మందు, విందు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. చివరి దశ సమరం తుది అంకానికి చేరుకున్న వేళ అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం లేదా ప్రలోభ పెట్టేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు పంచేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బులతో పాటు రాత్రయితే విందు, మందుతో చాలా చోట్ల పచ్చని పల్లెలు నైట్ క్లబ్‌లను తలపిస్తున్నాయి. వీటికి తోడు అభ్యర్థులు అలవిగాని హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తానని ఒకరంటే, పెండ్లిండ్లకు బ్యాండ్ ఫ్రీగా కొడతానని ఇంకొకరూ ఇలా విలువలకు పాతరేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఈ కొత్త పోకడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లకు ఇత్తడి బిందెలు పంచుతుండగా ప్రత్యర్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా ఎక్లాస్‌ఖాన్ పేటలో సర్పంచ్ అభ్యర్థి అర్ధరాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతుంటే అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఏకంగా ప్రత్యర్థి గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్‌కు క్షుద్ర పూజలు చేయడం సంచలనంగా మారింది. ఇవి మొదటి, రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక చివరి దశ పంచాయతీ ప్రచారం ముగిసిన వేళ ఎన్నికలు జరగనున్న పల్లెల్లో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఇంటింటి ప్రచారం చేస్తూ మద్యం, చికెన్, మటన్, నగదు పంపిణీకి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఓట్ల కోసం వాయిస్ మెసేజ్‌లు, ఫోన్‌పే ద్వారా నగదు పంపిణీ జరుగుతోంది. కుల సంఘాలు, మహిళా సంఘాల వారీగా తాయిలాలు, హామీలు ఇస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు తమకే పడాలనే లక్ష్యంతో అభ్యర్థులు రాత్రీ పగలూ తేడా లేకుండా శ్రమిస్తున్నారు. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ధన ప్రవాహం జోరుగా సాగుతోందని తెలుస్తోంది. పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డబ్బు మాత్రమే కాకుండా వెండి, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో మహిళా ఓటర్లకు వెండి గ్లాసులు, చిన్న చిన్న బంగారు నగలను కూడా పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.
ఒక్క ఓటు కూడా పక్కదారి పట్టకుండా డబ్బులు, ఇతర తాయిలాలు అందిస్తూ దేవుళ్లు, కుటుంబ సభ్యులపై ఒట్టేయించు కుంటున్నారు. ప్రత్యర్థుల ప్రచార శైలిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి దీటుగా ఓట్లు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంత మంది ఓ అడుగు ముందుకేసి కొత్త తరహా హామీలు ఇస్తున్నారు. తమను గెలిపిస్తే కేబుల్ కనెక్షన్ ఫ్రీ అని ఒకరంటే, పెండ్లిండ్లకు బ్యాండ్ ఉచితంగా వాయిస్తానని మరొకరు ఓటర్లను మభ్య పెడుతున్నారు. ఇలా తాము చేసే వృత్తులు, వ్యాపారాలను ఉచితంగా అందిస్తామని అలవి గాని హామీలు ఇస్తున్నారు. ఇదంతా నోటి మాటతో కాదు… వాల్ పోస్టర్లు, వీడియో, ఆడియో సందేశాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆరు నూరైనా…నూరు ఆరైనా ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతో పాటు హామీలను గుప్పిస్తున్నారు.
నోటీసులతోనే సరి పెడుతున్న ఎన్నికల సంఘం
సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో డబ్బు, మద్యం, బలవంతపు ఏకగ్రీవాలు, వేలం పాటలు, ఇతర తాయిలాలపై వస్తున్న ఫిర్యాదులు, సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు నుంచి ఓటర్లను ప్రలోభ పెట్టేవరకు టీయాప్, టోల్‌ఫ్రీ నెంబర్‌కు ప్రతి రోజు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటిపై ఎన్నికల సంఘం నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023 శాసన సభ ఎన్నికల సమయంలో రూ.724 కోట్ల విలువ చేసే డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా మద్యం, డబ్బు ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదనే ఆపవాదును ఎన్నికల సంఘం మూటగట్టుకుంటోంది.



