Tuesday, July 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉద్యమాల సారథి.. కామ్రేడ్‌ కొరటాల

ఉద్యమాల సారథి.. కామ్రేడ్‌ కొరటాల

- Advertisement -

కామ్రేడ్‌ కొరటాల సత్యనారాయణ అనగానే.. ఆ తరం నుంచి నేటివరకు రైతు, కార్మిక, ఉద్యమాలే గుర్తుకొస్తాయి. సీపీఐ(ఎం) ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌ బ్యూరో సభ్యునిగా పనిచేసిన ఆయన రైతు, వ్యవసాయ, చేనేత, కార్మిక సంఘాల ఉద్యమాల్లో చెరగని ముద్ర వేశారు.1962, 1978ల్లో రెండుసార్లు రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాప్రతినిధిగానూ సేవలందించారు. ఆయన 19వ వర్థంతి నేడు. ఉమ్మడి ఏపీ గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబర్‌ 24వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన 2006 జూలై1 చనిపోయేవరకూ పేదప్రజల కోసమే తపించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే పద్నాలుగేళ్ల వయసులో డిటెన్షన్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంతో ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. సుమారు ఏడు దశాబ్దాల పాటు ఎర్రజెండా చేత పట్టుకుని అలుపెరుగని పోరాటం నిర్వహించారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్బంధ కాలంలో నాలుగేండ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. 1948లో అరెస్టు చేసి సుమారు మూడేండ్లకు పైగా బళ్లారి, కడలూరు జైళ్లలో నిర్బం ధించారు. చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా జరిగిన భూ పోరాటంలో, పేదల స్వాధీ నంలో ఉన్న బంజరు భూముల పోరాటంలో ఆయనది ప్రత్యేక పాత్ర. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, కరువు నుండి రాయల సీమను విముక్తి చేసేం దుకు, కృష్ణా జలాలు మళ్లించాలని సాగిన పోరాటాల్లో ఆయన కృషి మరువలేనిది. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించాలని, రైతులకు పంటలకు మద్దతు ధరలు కల్పించాలని జరిగిన ఉద్యమాల్లో కొరటాలది క్రియాశీలక పాత్ర. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలో కరువు, తుఫాన్‌ వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా బాధితుల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన పత్తి రైతుల ఆత్మహత్యలపైన, వరి, పత్తి, కంది, మిరప, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధరల కోసం ఉద్యమాలు నిర్వహించారు. వ్యవసాయ కార్మికులకు బంజరు భూములు పంచాలని, కూలి రేట్ల పెంపుదల, ఉపాధి వంటి సమస్యలపై ఉద్యమాలు చేపట్టారు. చేనేత కార్మికుల మజూరి, రంగుల ధరలు, ఆత్మహత్యలు వంటి సమస్యలపై ఎనలేని కృషి చేశారు. తాను ఏ రంగంలో పని చేసినా ప్రజాసమస్యల పరిష్కారానికి లోతైన అధ్యయనంతో ఉద్యమాల్ని నిర్మించి ముందుకు సాగారు.ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకు, రైతులకు అండగా ఎన్నో పోరాటాలు నిర్వహించి రైతుల పక్షాన నిలిచిన కొరటాల స్ఫూర్తితో మరిన్ని రైతు ఉద్యమాలు నిర్వహించాలి. ఆ ఉద్యమాల నిర్మాణమే కామ్రేడ్‌ కొరటాలకిచ్చే నిజమైన నివాళి.
(నేడు కామ్రేడ్‌ కొరటాల వర్థంతి)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -