Monday, May 26, 2025
Homeదర్వాజమెలిపెట్టే అలిశెట్టి!

మెలిపెట్టే అలిశెట్టి!

- Advertisement -

ప్రభావితం చేసిన పుస్తకాలు ఏవంటే కొన్ని ఉన్నాయి. అందులో ప్రథమంగా నేను చెప్పే పుస్తకం అలిశెట్టి ప్రభాకర్‌ మినీ కవితల పుస్తకం సిటీ లైఫ్‌. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అంత చిన్న నిడివిలో గొప్ప భావ సందేశాన్ని గుది గుచ్చడం అలిశెట్టికే చెల్లింది. సమాజాన్ని టిల్ట్‌ అప్‌ షాట్‌లో చూశారాయన. ఆయన కవితలు చదివితే మనకూ ఆ తీక్షణత, గాఢత అబ్బుతుంది. పేదల పట్ల వకాల్తా పుచ్చుకున్నట్టు ఉంటాయి ఆయన రాతలు.

దోపిడీ వర్గాన్ని, సామ్రాజ్యవాదాన్ని వేలెత్తి చూపుతూ ఖబర్దార్‌ అని బెదిరిస్తున్నట్టు ఉంటాయి. అలా రాతలతో పంచులు వెయ్యడం, పటాసుల్లా పేల్చడం, చూపుడు వేలితో వార్నింగ్‌ ఇచ్చినట్టు, అర్థవంతంగా ఆ రెండు మూడు లైన్లలో రాయడం ఆయనకు మాత్రమే అబ్బిన ప్రత్యేకమైన గొప్ప శైలి. రాస్తే గీస్తే అంత లోతుల్లోకి వెళ్లి చిక్కగా, చక్కగా పరిస్థితులను ఒడిసిపట్టుకుని బల్లెం విసిరినట్టు రాయాలి అనే ఎరుక కలిగింది.
మరోపక్క చలం రచనలు జీవితాలను వడపోసినట్టుగా, అలిశెట్టి రచనలు సమాజాన్ని వడపోసినట్టుగా ఉంటాయి. అటు చలం ఇటు అలిశెట్టిల ప్రభావం నామీద ఉంటుంది.
చిన్న వయసులోనే అలిశెట్టి ప్రభాకర్‌ పోయారు కానీ బతికి ఉండి ఉంటే ఇంకా ఎన్నో అమూల్యమైన రచనల భాండాగారం తెలుగు సాహిత్యానికి అందించి వెళ్లేవారేమో!
చుట్టూ పరిసరాలను పరిశీలించే తీరు ఆయనది చాలా భిన్నం అని ఆయన కవితలు చదివాక అర్థం అవుతుంది. ఆ రాతల్ని తడిమి చూస్తే సెగలు కక్కుతూ అలజడి రేగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఆర్గానిక్‌ అంటారు కదా అంతకు మించిన పదం ఏదైనా ఉందంటే అది అలిశెట్టి రాతలకు కితాబుగా ఇవ్వొచ్చు. భావితరాలు ఖచ్చితంగా ఆయన రచనలు చదవాలి. ఇప్పటికి నేను చాలామందికి చెప్పాను అలిశెట్టిని చదవండి అని. చదివితే ఆయన్ను మరిచిపోక నిత్యం మనసులో మననం చేసుకుంటారు. మెలిపెట్టి ఇలా రాయాలి అని ఆయన రచనలు కర్ర పట్టుకుని చెప్పినట్టు అనిపిస్తుంటుంది.
‘ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట/ ఇంకెవరినీ మోసం చెయ్యనని/ ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట/ తోటి జంతువులకు సహకరించినందుకు/ ఈ కట్టు కథలిని గొర్రెలింకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి’
ఇలా సమాజంలోని నక్క, పులల నైజాన్ని నిక్కచ్చిగా నిబద్ధతగా చెప్పడం ఆయనకే సాధ్యం అని చెప్పాలి. నా రాతల్లో ఆయన ప్రభావం బాగా ఉంటుందనే చెబుతాను. ఆయన మినీ కవిత్వం మత్తులా ఎక్కిందని భావిస్తాను. ఆ పుస్తకాన్ని పదేపదే చదవడం అలవాటుగా మార్చుకున్నాను.
‘కాచిగూడా/ కాచి వడబోస్తే/ నువ్వొక నీళ్ల టీ!/ నారాయణ గూడ/ నీమీంచి నడిచిపోతే/ నువ్వొక దాల్‌ రోటీ!!/ బతకొచ్చిన కష్టజీవి/ పట్నంలో నీకు పోటాపోటీ!’ అంటూ పట్నం వచ్చే బడుగు జీవుల కష్టాలను చిన్నగా, చిత్రంగా చిత్రిక పడతారాయన.
‘కాసుకో/ కోసుకో రాజకీయమా!/ ప్రజలు పనస తొనలు/ మీరు కత్తి మొనలు!!’
రాజకీయాల గురించి ఎంత నిక్కచ్చిగా రాశారో కదా. కత్తి మొనల్లో తెగిపడేది ఎప్పుడూ ప్రజలే. ప్రజాస్వామ్యం అని ఊకదంపుడు స్పీచులు ఇస్తారు కానీ నేతలే దాన్ని ఫాలో అవరు. మరోచోట మన ఓటును రక్తం ముద్దతో పోలుస్తారు. గద్దకు ఓటెయ్యొద్దని చెబుతారు. ఇలా ఆయన రచించిన సిటీ లైఫ్‌ పుస్తకాన్ని చదివితే ఖచ్చితంగా ప్రభావితులు అవుతారు. మనం సమాజాన్ని చూసే పరిశీలన మారుతుంది. ఆయన మార్క్‌ మన రాతల్లో పొడసూపుతుంది.
– హుమాయున్‌ సంఘీర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -