Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంఎట్టకేలకు దిగొచ్చిన సీఈసీ

ఎట్టకేలకు దిగొచ్చిన సీఈసీ

- Advertisement -

ఆధార్‌ను గుర్తించేందుకు అంగీకారం
77 రోజుల తర్వాత ఓటర్ల జాబితా
నుంచి 65 లక్షల పేర్లు గల్లంతు

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ను ఓ గుర్తింపు పత్రంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాలలో ఆదేశాలు జారీ చేసిన మీదట కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు దిగివచ్చింది. ఓటరుగా నమోదు కావడానికి ఆధార్‌ను ఓ గుర్తింపు కార్డుగా అంగీకరించాలని జూలై 10, జూలై 28, ఆగస్ట్‌ 14, ఆగస్ట్‌ 22 తేదీలలో…నాలుగు పర్యాయాలు సుప్రీంకోర్టు సూచించింది. బీహార్‌ లో సర్‌ను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 77 రోజుల తర్వాత ఓటర్ల జాబితా నుంచి అరవై ఐదు లక్షల పేర్లు గల్లంతయ్యాయి. సవరించిన ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చేందుకు ఆధార్‌ కార్డును 12వ గుర్తింపు పత్రంగా అంగీకరించాలని అత్యున్నత న్యాయస్థానం పదే పదే సూచించినప్పటికీ ఆ మేరకు బీహార్‌ సీఈఓకు ఆదేశాలు జారీ చేసేందుకు ఈసీ సుముఖత చూపలేదు. చివరికి సెప్టెంబర్‌ 8వ తేదీన జారీ చేసిన ఆదేశాల మేరకు బీహార్‌ సీఈఓకు 9వ తేదీన ఉత్తర్వులు పంపింది.

సుప్రీంకోర్టు నాలుగు సార్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ సీఈసీ దున్నపోతు మీద వాన పడిన చందంగానే వ్యవహరించింది. అంతేకాక తన వ్యతిరేకతను అఫిడవిట్‌ రూపంలో తెలియజేసింది కూడా. గుర్తింపు పత్రాల జాబితాలో ఆధార్‌ను చేర్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా జూలై 10న సూచించింది. సర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డును గుర్తింపు కార్డులుగా పరిగణించాలని సూచించింది. కాగా ఈ మూడింటినీ గుర్తింపు కార్డులుగా పరిగణించలేమని జూలై 21న సుప్రీంకోర్టుకు సీఈసీ తెలియజేసింది. ఆధార్‌ కార్డు పౌరసత్వ రుజువు కాదని, కాబట్టి దానిని 11 డాక్యుమెంట్లలో ఒకటిగా చూడలేమని చెప్పింది.

ఆధార్‌ కేవలం ఒక వ్యక్తి గుర్తింపుకు రుజువు మాత్రమేనని అన్నది. ఈ వాదనతో విభేదించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. శాశ్వత నివాస సర్టిఫికెట్‌, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ జారీకి ఆధార్‌ కార్డును అనుమతిస్తున్నారని తెలిపింది. ఇదిలావుండగా ఆధార్‌, ఓటర్‌ ఐడీని అనుమతించాల్సిందిగా జూలై 28న సుప్రీంకోర్టు మరోసారి సీఈసీకి సూచించింది. బీహార్‌లో ఓటర్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తే జోక్యం చేసుకుంటానని జులై 29న సుప్రీంకోర్టు మౌఖిక వ్యాఖ్యలు చేసింది. ఆగస్ట్‌ 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆగస్ట్‌ 14న సుప్రీంకోర్టు మరోసారి ఎన్నికల సంఘానికి సూచనలు చేస్తూ ఆధార్‌ను గుర్తింపు కార్డుగా పరిగణించాలని సూచించింది. చివరికి ఎట్టకేలకు సెప్టెంబర్‌ 8న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్‌ ఇస్తూ ఆధార్‌ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణనలోకి తీసుకుంటానని చెప్పింది. ఆ మేరకు మరునాడు బీహార్‌ సీఈఓకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్‌ను 12వ గుర్తింపు పత్రంగా అనుమతించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -