మోడీ పాలనలో పెరుగుతున్న నిరుద్యోగం : డీవైఎఫ్‌ఐ అధ్యక్షులు, ఎంపీ రహీం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందనిభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) అఖిల భారత అధ్యక్షులు, ఎంపీ ఎఎ రహీం విమర్శించారు. ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేస్తున్నదని అన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఉన్న ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన అయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మివేస్తూ బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తున్నదని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంతగా మోడీ ప్రభుత్వంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతున్నదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. అందులో భాగంగానే ఎనిమిది గంటల నుంచి 12 గంటల పనివినానికి పెంచి కార్మికుల శ్రమను దోపిడీ చేసి కార్పొరేట్లకు మేలు చేస్తున్నదని చెప్పారు. పని ఒత్తిడితో అనేక తీవ్రమైన ఆందోళన చెందుతున్నారనీ, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వరంగాన్ని ప్రయివేటికరిస్తూ ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, రాష్ట్ర ఆఫీస్ బెరర్లు కష్ణ నాయక్, శివవర్మ, జావీద్, మల్లం మహేష్, ఆర్‌ఎల్ మూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్, ఆనంద్, ప్రశాంత్ చారి, పల్లె మధు, అరవింద్, ప్రశాంత్, నరేందర్, మధు, నవీన్, హస్మి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పనలో కేంద్రం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



