పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువు : సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు
కాగజ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఐదో సదస్సు..భారీ ప్రదర్శన
నవతెలంగాణ-కాగజ్‌నగర్
దేశంలో మహిళలపై రోజురోజుకూ హత్యలు, లైంగికదాడులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమవుతోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఈ నేరాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా రాష్ట్ర ఐదో సదస్సును నిర్వహించారు. సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆర్.త్రివేణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎం. సాయిబాబు మాట్లాడారు. మహిళలకు చట్టపరంగా ఇవ్వాల్సిన ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్ కూడా సకాలంలో చెల్లించడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్‌లు తీసుకువచ్చి ఎనిమిది గంటల పని దినాలను 12 గంటలకు మార్చిందని, దాంతో మహిళలు మరింత బానిసత్వంలోకి నెట్టబడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్‌ల రద్దు కోసం శ్రామిక మహిళలు పెద్దఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలో ఆర్థిక అసమానత లు పెరుగుతున్నాయని, ఒక శాతం ఉన్న సంపన్నుల వద్ద 45 శాతం డబ్బు పోగైందన్నారు. తిండికి, బట్టకు, ఇల్లుకు నోచుకోని వారు కోట్లాది మంది ఉన్నారని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అయిన సరుకులు అమ్ముడుపోక వాటి అమ్మకం కోసం యాజమాన్యాలు అనేక ఆఫర్లు పెడుతున్నాయన్నారు. అయినా సరుకులు అమ్ముడుపోవడం లేదనీ, దీనికి ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమే ప్రధాన కారణమని తెలిపారు. ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టించి బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం రావడంలో ఇసుమంత పాత్ర కూడా లేని ఆర్‌ఎస్‌ఎస్ నేడు దేశభక్తిని ఒలకబోస్తోందని విమర్శించారు. రాజ్యాంగం రక్షింపబడాలన్నా, కార్మిక హక్కులు కాపాడబడాలన్నా సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు వాస్తవాలు అర్థం చేసుకొని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న ప్రదర్శన
సదస్సుకు ముందు కాగజ్‌నగర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బాలభారతి పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్కెట్ ఏరియా, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, లారీ చౌక్ మీదుగా వినరు గార్డెన్ వరకు సాగింది. ప్రదర్శనలో గుస్సాడీ, ఒగ్గు డోలు కళాకారులు చేసిన సంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు బతుకమ్మలు చేతపట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్‌వీ రమ, సీఐటీయూ కార్యదర్శి పద్మశ్రీ, ఉపాధ్యక్షులు భూపాల్, జె వెంకటేష్, పి. జయలక్ష్మి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె రాజేందర్, ముంజం శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు కూశన రాజన్న, దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్‌కుమార్, గొడిసెల కార్తీక్, గెడం టీకానంద్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వి. ఆనంద్, జిల్లా కార్యదర్శి ఆర్. మహేష్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్, దిగిడ బక్కన్న, వివిధ జిల్లాల నాయకులు, శ్రామిక మహిళలు పాల్గొన్నారు.