Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుపేదల భూములు లాక్కుంటున్న కేంద్రం

నిరుపేదల భూములు లాక్కుంటున్న కేంద్రం

- Advertisement -

అదానీ, అంబానీలకు ఊడిగం చేస్తూ నిరుపేదల పొట్ట కొడుతోంది : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌

నవతెలంగాణ-జహీరాబాద్‌
మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ, దళిత బిడ్డల భూములను వివిధ రకాల పేర్లతో లాక్కొని, పెట్టుబడిదారులకు, అదానీ అంబానీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తన్నదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ అన్నారు. నిమ్జ్‌ భూ బాధితుల సమస్యల పరిష్కారానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని శ్రామిక విజ్ఞాన కేంద్రం నుంచి నిమ్జ్‌, ఆర్డీవో కార్యాలయాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో నిరుపేదల నుంచి భూములను లాక్కొని పెట్టుబడిదారులకు కారు చౌకగా అందజేస్తూ భూ దందాలు కొనసాగిస్తుందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భూ నిర్వాసితులకు లాభం చేకూరే విధంగా తీసుకొచ్చిన 2013 భూ చట్టానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల్లో నిరుపేదల నుంచి భూములు తీసుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను కల్పిస్తూ సవరణలు తీసుకువచ్చిందన్నారు. ఆ సవరణలతోనే మాజీ సీఎం కేసీఆర్‌ 123 జీవోను తీసుకొచ్చి భూ బాధితులకు నష్టపరిహారం రాకుండా చట్టంలో అనేక మార్పులు చేశారని తెలిపారు. దేశంలోని బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లో నిర్ధాక్షిణ్యంగా నిరుపేదల నుంచి భూములను లాక్కునే పరంపర కొనసాగుతుందన్నారు.

బీజేపీ విధానాలతో దేశవ్యాప్తంగా భూములన్నీ కేవలం ఒకే వర్గం చేతిలోకి వెళ్లిపోవడంతో ఆహార అభద్రతతో పాటు ఆర్థిక అసమానతలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రం ఊబిలో పడకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 2013 చట్టాన్ని అమలు చేసి, అవసరం మేరకు మాత్రమే భూములను కొనుగోలు చేయాలని తెలిపారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నిమ్జ్‌ కోసం వేల ఎకరాల భూమిని సంవత్సరాల తరబడి స్వాధీనపరచుకుంటున్నారే తప్ప అందులో ఇప్పటికి ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చట్టప్రకారం భూములు తీసుకున్న అన్ని వర్గాల వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అవి సాధించేంతవరకు దేశ వ్యాప్తంగా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉం టుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాం, సంఘం జిల్లా అధ్యక్షులు బి. రామచందర్‌, ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింలు, సీఐటీయూ క్లస్టర్‌ కన్వీనర్‌ మహిపాల్‌, వ్యకాస జహీరాబాద్‌ మండల అధ్యక్షులు ఎస్‌. సుకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -