సర్వే ఆఫ్ ఇండియా తీరుపై సర్వత్రా విమర్శలు
చరిత్ర గుర్తింపు నుంచి రక్షణ వరకు అంతా నిర్లక్ష్యమే
రాష్ట్రంలో 8 ప్రాంతాలకే పరిమితమైన వైనం
ఏపీలో 130, ఛత్తీస్‌గఢ్‌లో 200కు పైగా ప్రాంతాల పరిరక్షణ
రాష్ట్ర అభ్యర్థనలపై ఉలుకుపలుకూ లేని కేంద్రమంత్రులు
తెలంగాణ రాష్ట్ర పురాతన వారసత్వ సంపదపై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ ప్రాంత భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని అనుసంధానించే ఈ సంపద గుర్తింపు, పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం తీరు చరిత్రను అవమానించేలా ఉంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. తమ పలుకుబడి ఉపయోగించి, రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపద అన్వేషణ, పరిరక్షణ కోసం కేంద్ర పురావస్తుశాఖ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)లకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇప్పించడంలో విఫలం అయ్యారు. తమ ప్రాంతంలోని వారసత్వ కట్టడాలు, అన్వేషణకు సంబంధించి ఆయా విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సుల్ని పరిష్కరింపచేయడంలోనూ చొరవ చూపట్లేదు. కేంద్ర సంస్థల నిర్లక్ష్యం, కేంద్రమంత్రుల నిర్లిప్తతపై రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తెలంగాణ వారసత్వ కట్టడాలు, ప్రాంతాల సంరక్షణపై వివక్ష చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు, ప్రాంతాలను పరిరక్షించే ఈ విభాగం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది. వందలాది చారిత్రక కట్టడాలు, ప్రాంతాలున్నా.. కేవలం చార్మినార్, గోల్కొండ, రామ్పప్ప మొదలగు తొమ్మిదింటిని మాత్రమే ఏఎస్‌ఐ రక్షిత ప్రాంతాలుగా గుర్తించి వాటిని సంరక్షిస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 130, చత్తీస్‌గఢ్‌లో 200కు పైగా ప్రదేశాల ఆలనాపాలన చూస్తోంది. తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న పక్షపాతానికి ఈ గణాంకాలే నిదర్శనమని చరిత్ర కారులు, పర్యావరణ వేత్తలు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ పురావస్తు శాఖ 346 రక్షిత స్మారక చిహ్నాలు, 14 మ్యూజియాలను సంరక్షిస్తోంది, పూర్వ-చారిత్రక కాలం నుంచి వలసరాజ్యాల కాలం వరకు శ్మశాన వాటికలు, బౌద్ధ, జైన, హిందూ, ఇస్లామిక్ ప్రదేశాలు, కోటలు, బ్రిటిష్ స్మారక చిహ్నాలు మొదలైనవి దీనిలో ఉన్నాయి.
అలాగే కొత్త ప్రాంతాల్లో పరిశోధన-అన్వేషణలు, తవ్వకాలు, కళాఖండాలు, శాసనాలు, చరిత్ర పునర్నిర్మాణం తదితర బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నాల్లో అనుసంధానం కావల్సిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రముఖ చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ, రామ్పప్ప మొదలగు ఎనిమిదింటిని మాత్రమే ఏఎస్‌ఐ రక్షిత ప్రాంతాలుగా గుర్తించి వాటిని మాత్రమే సంరక్షిస్తోంది. ఇదే కేంద్ర సంస్థ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 130, చత్తీస్‌గఢ్‌లో 200కు పైగా ప్రదేశాల ఆలనాపాలనతో పర్యవేక్షణా బాధ్యతలు నిర్వహిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని గొల్లత్త గుడి, సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిగుట్ట, నల్లగొండ జిల్లాలోని పానగల్లు పచ్చ సోమేశ్వర ఆలయం మొదలగు 64 చారిత్రక కట్టడాలు, ప్రాంతాలను పరిరక్షించాలని తెలంగాణ పురావస్తుశాఖ 2022లో ఏఎస్‌ఐకి ప్రతిపాదనలు పంపింది. మూడేండ్లు దాటినా ఇప్పటి వరకు ఏఎస్‌ఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
2023లో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం టెంపుల్, మెడికల్, ఎకో, అడ్వెంచర్ సహా వివిధ టూరిజం రంగాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటుకు మౌఖికంగా పలుమార్లు ఏఎస్‌ఐని అభ్యర్థించినా వారు పట్టించుకోవడం లేదు. రేపు, మాపు అంటూ ఆర్నెల్లుగా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు సైతం ఎలాంటి చొరవ చూపట్లేదు. చారిత్రక కట్టడాల సంరక్షణలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డికి పలువురు చరిత్రకారులు చేసిన విన్నపాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు.
శిథిలావస్థకు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరైన ఆదరణ లేక పోవడంతో రాష్ట్రంలోని అనేక చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు, ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పురాతన నాణేల ప్రదర్శనకు సరైన స్థలం లేకపోవడం, ప్రాథమిక నిర్వహణకు తగినంత నిధులు లేకపోవడంతో అమూల్యమైన కళాఖండాలు కళావిహీనంగా వెలవెలపోతున్నాయి. అలాగే అనంతగిరిలోని 9వ శతాబ్దపు జైన గుహలు రహదారి విస్తరణ కారణంగా దెబ్బతిన్నాయి నల్లగొండ జిల్లాలోని ఇనుప యుగ నిర్మాణాలను పట్టించుకోకపోవడంతో అవి మసకబారుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం, జూబ్లీహాల్, పురానాపూల్ వంతెన వంటి చారిత్రక నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ స్టేట్ మ్యూజియంకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏటా కేవలం రూ.లక్ష లోపు నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు.
దీనితో మ్యూజియంలో చిన్న చిన్న మరమ్మతులు కూడా ఇక్కడ జరగట్లేదు. మ్యూజియంలో దెబ్బతిన్న గోడలు, విరిగిన శిల్పాలు పాడుబడ్డ భవనాలను తలపిస్తున్నాయి. వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ, సుందరీకరణకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ భాగస్వామ్యం అయితే రాష్ట్రానికి అదనంగా కొన్ని నిధులు సమకూరడం లేదా ప్రముఖ కట్టడాల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతల బదలాయింపు జరిగితే రాష్ట్ర పురావస్తు శాఖపై అదనపు భారం తప్పుతుంది. ఆ దిశగా ఏఎస్‌ఐ ప్రయత్నాలు లేవు. ఆద్యంతం రాష్ట్రంపై వివక్షను ప్రదర్శిస్తూ చరిత్రను కాలగర్భంలో కలిపేస్తున్నాయని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు రాలేదు : ఏఎస్‌ఐ
”తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు, ప్రాంతాలను పరిరక్షించాలని ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియాకు రాష్ట్రం నుంచి సరైన ఫార్మట్‌లో ప్రతిపాదనలు రాలేదు. గతంలో కొన్నింటిని కోట్ చేస్తూ ఏఎస్‌ఐ సంరక్షణకు లేఖలు రాశారు. అయితే వాటి సరిహద్దులు, ఆక్రమణలు, తదితర సాంకేతిక అంశాలకు సంబంధించి ఏఎస్‌ఐ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. మా నిబంధనలతో కూడిన ఫార్మాట్‌లో వివరాలు పంపితే వాటిపై పునరాలోచన చేస్తాం. కానీ ఇప్పటి వరకు మాకెలాంటి ప్రతిపాదనలు రాలేదు” అని ఏఎస్‌ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
64 కట్టడాల ప్రతిపాదనలు పంపాం : తెలంగాణ పురావస్తుశాఖ
”రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, ప్రాంతాల సంరక్షణ భాద్యతలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణ కోసం 2022లోనే ప్రతిపాదనలు పంపాం. 64 చారిత్రక కట్టడాలు, ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాం. ఇప్పటి వరకు వారి నుంచి ఏలాంటి స్పందన రాలేదు. తెలంగాణ పురావస్తు విభాగం వైపు నుంచి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం” అని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
