– కార్మికులు, కూలీలను వంచిస్తున్న ప్రభుత్వాలు
– పాపారావు, కేజీ రాంచందర్ తీవ్ర విమర్శలు
నవతెలంగాణ – కామారెడ్డి : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెడుతోందని, కార్మికులు, వ్యవసాయ కూలీలను వంచిస్తున్నదని ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రాంచందర్ లు తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐపికెఎంఎస్) రాష్ట్ర ప్రథమ మహాసభల రెండవ రోజు సమావేశంలో వారు మాట్లాడారు. 20 జిల్లాల నుంచి వచ్చిన 300 మంది ప్రతినిధులతో జరిగిన ఈ సభలో వ్యవసాయ రంగంలో పెరుగుతున్న అసమానతలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే పట్టణ కార్మికుల జీవన వ్యయం పెరుగుతుందని భావించే కార్పొరేట్ శక్తులు కనీస మద్దతు ధర (MSP) పెంపును అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. దేశంలో 69 శాతం మంది రైతులు ఒక హెక్టారులోపు భూమి కలిగి ఉండటంతో, అనివార్యంగా కూలీ పనులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఉత్పత్తుల ధరలు, ప్రజల జీవన ప్రమాణాల మధ్య వ్యత్యాసం పెరగడంతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ కూలీల సమస్యలను పాలకులు పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని, చట్టబద్ధ హక్కును కేవలం పేరుకే పరిమితం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాన్ని పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఐపికెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎం. కృష్ణ, పి. రామకృష్ణ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు వి. ప్రభాకర్, ఎఐయుకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాము, పివోడబ్ల్యూ నాయకురాలు వి. గోదావరి, పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ, టియుసిఐ నాయకుడు ఆర్. రమేష్, పిడిఎస్‌యు నాయకుడు ఎ. సురేష్, ఎఐపికెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



